Kashmir పౌర హత్యలు.. 700 మందికిపైగా ఉగ్రవాద సానుభూతిపరుల అరెస్ట్
జమ్మూ కశ్మీర్‌లో ఏడుగురు సాధారణ పౌరులను ఉగ్రవాదులు హత్యచేసిన తర్వాత భద్రతా బలగాలు, పోలీసులు ముమ్మర గాలింపు చర్యలు చేపట్టిన విషయం తెలిసిందే. ఆరు రోజుల్లో 700 మందికిపైగా ఉగ్రవాద సానుభూతిపరులను అదుపులోకి తీసుకున్నారు. వీరిలో కశ్మీరీ పండిట్లు, సిక్కు, ముస్లిం వర్గాలకు చెందిన వారు ఉన్నారు. భద్రతా బలగాలు అదుపులో ఉన్న పలువురికి నిషేధిత జమాతే ఇస్లామీ లేదా సస్పెక్టడ్ ఓవర్‌గ్రౌండ్ వర్కర్స్, శ్రీనగర్, బుద్గామ్ ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన ఉగ్రవాదులతో సంబంధాలున్నట్టు నమ్ముతున్నారు. జమ్మూ కశ్మీర్‌కు చెందిన ఓ సీనియర్ పోలీస్ అధికారి మాట్లాడుతూ.. లోయలో ఉగ్రదాడుల పరంపరను తుంచడానికే వీరిని అదుపులోకి తీసుకున్నామని తెలిపారు. కశ్మీర్‌లో దాడులకు అఫ్గనిస్థాన్‌లో తాలిబన్లు అధికారంలోకి రావడంతో వేర్పాటువాదానికి మరింత ఊతమిచ్చినట్టు భావిస్తున్నామని, హంతకులు సులభమైన లక్ష్యాలను ఎంచుకుంటున్నారని తెలిపారు. ఇప్పటికే ఉద్రిక్తంగా ఉన్న కాశ్మీర్ లోయలో ఈ హత్యలు ఆగ్రహాన్ని రేకెత్తించాయి. దాడులను అడ్డుకోవడంలో పరిపాలన యంత్రాంగం అసమర్థత కారణంగా స్థానికులు భయంతో కాలం గడుపుతున్నారని ప్రతిపక్ష నాయకులు తీవ్రంగా విమర్శిస్తున్నారు. అమాయక ప్రజలు చనిపోతున్నారని, ప్రభుత్వం తన విధానాలను పునఃసమీక్షించాలని మాజీ ముఖ్యమంత్రి, నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఫరూక్ అబ్దుల్లా డిమాండ్ చేశారు. అంతేకాదు, ప్రధాని నరేంద్ర మోదీ కశ్మీర్ లోయలో పర్యటించి, ప్రజలకు భరోసా కల్పించాలని కోరారు. పునరావస కేంద్రాల్లోని డజన్ల కొద్దీ కశ్మీరీ పండిట్లు భయంతో ఇప్పటికే లోయ నుంచి పారిపోయారు. గురువరాం శ్రీనగర్ శివారులోని పాఠశాలలోకి చొరబడిన ఉగ్రవాదులు.. అక్కడ ప్రిన్సిపాల్, ఓ ఉపాధ్యాయుడ్ని కాల్చి చంపిన విషయం తెలిసిందే. స్కూల్‌లోకి ప్రవేశించిన ముష్కరులు.. వారి గుర్తింపు కార్డులను చూపించమని అడిగిన తర్వాత కాల్చి చంపారు. వీరిలో ఒకరు సిక్కు కాగా, ఇంకొకరు హిందువు. అలాగే, అంతకు ముందు మఖన్ లాల్ బింద్రూ అనే కశ్మీర్ పండిట్‌ను హత్య చేశారు. కశ్మీర్‌లో తాజా దాడులకు నిషేధిత లష్కరే తొయిబా అనుబంధ సంస్థ‘ది రిసెస్టెంట్ ఫ్రంట్’హస్తం ఉన్నట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఏడాది జనవరి నుంచి 28 మంది పౌరులను ఉగ్రవాదులు పొట్టనబెట్టుకోగా.. వీరిలో ఏడుగురు ముస్లిమేతరులు ఉన్నారు. ఇక, కశ్మీర్‌లో పరిస్థితులు, ఆపరేషన్ల పర్యవేక్షణకు ఉన్నతాధికారులతో కూడిన బృందాన్ని కేంద్ర హోం శాఖ గురువారం అక్కడకు పంపింది.
By October 11, 2021 at 07:18AM
No comments