Breaking News

China పిల్లలకు హోంవర్క్, ట్యూషన్ల భారం తగ్గించే సంచలన చట్టం!


చైనా కమ్యూనిస్ట్ పార్టీ ఇటీవల తీసుకొచ్చిన చట్టాలపై అంతర్జాతీయ సమాజం ఆందోళన వ్యక్తం చేస్తోంది. క్రమశిక్షణ, జాతీయభావం పేరుతో పౌరులపై ఆంక్షలు విధిస్తోంది. పిల్లల అలవాట్లు, ఆటలపై కూడా కొరడా ఝలిపిస్తోంది. ఇటీవల ఆన్‌లైన్‌ గేమింగ్‌ సమయాన్ని కుదించిన చైనా.. పిల్లలు తప్పుచేస్తే పెద్దలకు శిక్షలు విధించేలా చట్టాన్ని రూపొందించింది. తాజాగా, పిల్లలను ఒత్తిడి నుంచి బయటపడేసేలా హోంవర్క్‌, ట్యూషన్ల భారాన్ని తగ్గించే దిశగా మరో కొత్త చట్టాన్ని తీసుకొచ్చేందుకు చైనా సన్నద్ధమవుతోంది. ఈ మేరకు ప్రభుత్వం తీసుకురాబోయే నిబంధనలన అమలు చేసే బాధ్యత స్థానిక అధికార యంత్రాంగానికి అప్పగించాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది. అలాగే పిల్లలకు సరిపడా విశ్రాంతి లభించేలా చూసుకోవాల్సిన బాధ్యత తల్లిదండ్రులదేనని మరోసారి ఈ చట్టం ద్వారా గుర్తుచేయనుందని సమాచారం. దీంతోపాటు ఇంటర్నెట్‌ వినియోగాన్ని పిల్లలు తగ్గించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీచేయనుంది. ఈ కొత్త చట్టం సత్ఫలితాలిచ్చే అవకాశం ఉన్నట్లు అక్కడి నిపుణులు భావిస్తున్నారు. వీటి వల్ల పిల్లలపై మానసిక ఒత్తిడి తగ్గి.. సృజనాత్మకత పెరుగుతుందని అభిప్రాయపడుతున్నారు. కాగా, 18 ఏళ్లలోపు వారు వారంలో మూడు గంటలు మాత్రమే ఆన్‌లైన్ గేమ్స్ ఆడుకొనేలా నిబంధనలు తీసుకొచ్చింది. సెప్టెంబర్‌ 1 నుంచి శుక్రవారాలు, వీకెండ్స్‌, ప్రభుత్వ సెలవు దినాల్లో మాత్రం రాత్రి 8 గంటల నుంచి 9 గంటల వరకు గేమ్స్‌ ఆడుకొనేలా అవకాశం కల్పిస్తున్నట్టు నేషనల్‌ ప్రెస్‌ అండ్‌ పబ్లికేషన్‌ అడ్మినిస్ట్రేషన్‌ (NPPA) ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కొత్త నిబంధనలతో చైనాలోని టెక్నాలజీ కంపెనీలపై తీవ్ర ప్రభావం పడింది. ఇలాంటి గేమ్‌లను చైనా ఓ మత్తుమందుగా భావిస్తోంది. దీర్ఘకాలంలో వ్యసనంగా మారితే పిల్లల చదువులు, వ్యవహార శైలిపై ప్రభావం పడే అవకాశం ఉందని అంటోంది. అంతేకాదు, గేమింగ్‌ కంపెనీలపై పర్యవేక్షణను మరింత బలోపేతం చేయడంతో పాటు నిబంధనల అమలును పకడ్బందీగా నిర్వహించనున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొనడం గమనార్హం. పిల్లలు తప్పుచేస్తే తల్లిదండ్రులను శిక్షించేలా ‘ఫ్యామిలీ ఎడ్యుకేషన్‌ ప్రమోషన్‌ లా’ పేరుతో ఇప్పటికే ముసాయిదా బిల్లును రూపొందించింది. పిల్లల ప్రవర్తన సరిగా లేకపోయినా, వారు నేరాలకు పాల్పడినా తల్లిదండ్రులను ఈ చట్టం ప్రకారం శిక్షిస్తారు. ఇంటర్నెట్‌ వినియోగం పెరిగిన తర్వాత చైనాలో స్వతంత్ర భావజాలం పెరగడంతో కమ్యూనిస్ట్ ప్రభుత్వానికి భయంపట్టుకుందని విమర్శిస్తున్నారు. కఠిన ఆంక్షలపై ప్రజలు తిరగబడే అవకాశమున్న నేపథ్యంలో ఈ తరహా చట్టాలను తీసుకొస్తోందని ఆరోపిస్తున్నారు.


By October 24, 2021 at 09:28AM


Read More https://telugu.samayam.com/latest-news/international-news/china-passes-law-to-reduce-homework-and-tutoring-pressures-on-children/articleshow/87234088.cms

No comments