మోదీపై విమర్శలు.. బీజేపీ వైఖరికి నిరసనగా సొంత పార్టీ ఎమ్మెల్యే శిరోముండనం!
బీజేపీ ప్రభుత్వ విధానాలపై విమర్శలు గుప్పిస్తూ సొంత పార్టీ ఎమ్మెల్యే శిరోముండనం చేయించుకున్నారు. పార్టీ దుర్మార్గపు పాలనకు ప్రాయశ్చితంగా తాను గుండు గీయించుకున్నట్టు ఆశిష్ దాస్ వెల్లడించారు. మంగళవారం ఆయన పశ్చిమ్ బెంగాల్ రాజధాని కోల్‌కతాలోని కాళీ మాత ఆలయం వద్ద యజ్ఞం నిర్వహించి, శిరో ముండనం చేయించుకున్నారు. త్రిపుర రాజకీయ అరాచకం, గందరోగళం నెలకుందని, రాష్ట్ర ప్రభుత్వ పనితీరుపై ప్రజలు అసంతృప్తిగా ఉన్నారని ఆరోపించారు. తాను బీజేపీలో ఉండలేనని, పార్టీ వీడుతానని తెలిపారు. ఇటీవల పశ్చిమ్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీపై ప్రశంసలు కురిపించిన దాస్.. ఆమె 2024 ఎన్నికల్లో ప్రధాని మోదీకి సరైన ప్రత్యర్ధని కొనియాడారు. అయితే, గత రెండేళ్లుగా త్రిపుర ముఖ్యమంత్రి బిప్లవ్ దేవ్‌పై తీవ్ర విమర్శలు గుప్పిస్తూ ఎమ్మెల్యే ఆశిష్ దాస్ వార్తల్లో నిలుస్తున్నారు. బీజేపీకి రాజీనామా చేసి ఆయన తృణమూల్ కాంగ్రెస్‌లో చేరనున్నారనే ప్రచారం జరుగుతోంది. 2023 ప్రథమార్థంలో త్రిపుర అసెంబ్లీకి ఎన్నికలు జరగనుండగా.. ఆ రాష్ట్రంపై టీఎంసీ దృష్టిసారించింది. ‘ఈ రోజు నేను బీజేపీ ప్రభుత్వ దుర్మార్గపు పాలనకు ప్రాయశ్చిత్తంగా గుండు గీయించుకున్నాను.. నేను పార్టీని వీడాలని నిర్ణయించుకున్నాను.. భవిష్యత్తును కాలమే నిర్ణయిస్తుంది. కానీ, బీజేపీ నాయకత్వంలోని త్రిపురలో జరిగిన అరాచకం, దుష్టపాలన నన్ను కలచివేసింది.. అందువల్ల గత రెండేళ్లుగా ప్రభుత్వం చేసిన తప్పుడు పనులన్నింటినీ విమర్శిస్తున్నాను.. పార్టీ, రాజకీయాలకు అతీతంగా ప్రజల కోసం పని చేస్తున్నాను’ అని ఆశిష్ దాస్ పేర్కొన్నారు. ఇదే సమయంలో ప్రధాని మోదీపై కూడా విమర్శలు గుప్పించారు. ప్రభుత్వ రంగ సంస్థలను ప్రయివేట్ వ్యక్తులకు ప్రధాని దారాధత్తం చేస్తున్నారని ఆరోపించారు. ‘ఒకప్పుడు మోదీ సందేశాలు దేశవ్యాప్తంగా అన్ని వర్గాల ప్రజల మనసులను కదిలించాయి.. తాకాయి. మోదీ ఒకసారి 'నేను తినను.. ఎవర్నీ తిననివ్వను' అని చెప్పారు. కానీ ఇప్పుడు, దేశంలోని అన్ని ప్రభుత్వ సంస్థలూ అమ్మేస్తున్నారు’ అని దుయ్యబట్టారు. మరోవైపు, ఎమ్మెల్యే వ్యాఖ్యలపై బీజేపీ గుర్రుగా ఉన్నట్టు తెలుస్తోంది. అతడిపై చర్యలు తీసుకుంటామని బీజేపీ వర్గాలు సంకేతాలు ఇచ్చాయి. సుదీర్ఘకాలం నుంచి బీజేపీలో కొనసాగుతున్న ఆశిష్ దాస్.. సుర్మా నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించారు.
By October 06, 2021 at 09:35AM
No comments