ఉన్నట్టుండి నల్లగా మారిన నది.. వేలాది చేపలు మృతి.. చైనాపైనే అనుమానాలు!
ఉన్నట్టుండి నది నల్లగా మారిపోయి.. వేలాది జలచరాలు మృత్యువాతపడ్డ ఘటన చైనా సరిహద్దుల్లో సంభవించింది. అరుణాచల్‌ప్రదేశ్ తూర్పు కమెంగ్ జిల్లాలోని శుక్రవారం ఒక్కసారిగా నల్లబారి.. చూస్తుండగానే వేలాది చేపలు మృత్యువాతపడ్డాయి. ఈ ఆకస్మిక పరిణామంతో స్థానికులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. అయితే, నదిలో టీడీఎస్ శాతం భారీ స్థాయికి చేరడంతోనే జలాలు నలుపు రంగులోకి మారాయని ప్రాథమికంగా గుర్తించినట్టు జిల్లా మత్స్య అభివృద్ధి విభాగం అధికారి హలీ తాజో తెలిపారు. ఈ రకమైన నీళ్లలో జలచరాలకు ఏమీ కనిపించదని, పైగా ఆక్సిజన్ పీల్చుకోడానికి ఇబ్బంది పడతాయని వివరించారు. చేపల మృతికి ఇదే కారణమై ఉండొచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. కాగా, నదిలో టీడీఎస్ స్థాయిలు పెరగడానికి చైనాయే కారణమని స్థానికులు ఆరోపిస్తున్నారు. అక్కడ నిర్మాణ రంగ కార్యకలాపాలవల్లే నీటి రంగు నల్లగా మారిందని చెబుతున్నారు. మరోవైపు, ఈ అంశంలో వాస్తవాలను వెలికితీయడానికి వెంటనే నిపుణుల కమిటీని ఏర్పాటు చేయాలని తూర్పు సెప్పా ఎమ్మెల్యే తపుక్ టాకు విజ్ఞప్తి చేశారు. గతంలో ఎప్పుడూ ఇలా జరగలేదని, ఇది ఇలాగే కొనసాగితే.. అందులోని జలచరాలన్నీ తుడిచిపెట్టుకుపోతాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. కాగా, తూర్పు సియాంగ్ జిల్లాలోని పాసిఘాట్ వద్ద ఉన్న సియాంగ్ నది 2017 నవంబరులో ఇలాగే నల్లగా మారింది. చైనా సొరంగం నిర్మాణం కారణంగానే ఈ దుస్థితి ఏర్పడిందని, ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని కోరుతూ అరుణాచల్ ఈస్ట్‌కు చెందిన అప్పటి కాంగ్రెస్ ఎంపీ నినాంగ్ ఎరింగ్.. ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు. అయితే, చైనా ఈ వాదనలను ఖండించింది. ‘వాస్తవానికి నది జలాల్లో టీడీఎస్ లీటరుకు 300-1200 మిల్లీగ్రాముల మధ్య ఉండాలి. కానీ.. ప్రస్తుతం ఏకంగా 6,800 ఎంజీలు ఉన్నట్లు తేలింది’ అని తాజో చెప్పారు. మృత్యువాతపడిన చేపలను తింటే తీవ్ర అనారోగ్య సమస్యలకు అవకాశం ఉన్నందున వాటిని తినొద్దని స్థానికులకు ఆయన విజ్ఞప్తి చేశారు. అటు, అధికార యంత్రాంగం అప్రమత్తమై.. ఈ మేరకు సూచనలు చేసింది. తదుపరి ఆదేశాలు జారీ చేసేవరకు నదిలో చేపలు పట్టొద్దని, చనిపోయిన వాటిని విక్రయించడం, తినడ చేయొద్దని స్పష్టం చేసింది. ఇటీవల, సరిహద్దుల్లో చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ (సీపీఎల్ఏ) కార్యకలాపాలు, ఉద్దేశపూర్వకంగా రెచ్చగొట్టే చర్యలు పెరుగుతున్నాయి. తూర్పున చరిత్రాత్మకంగా కీలకమైన లూంగ్రో లా, జిమిథాంగ్, బుమ్ లా వద్ద చైనా దూకుడుగా వ్యవహరిస్తోంది. భారత్ కూడా వారికి దీటుగానే స్పందించి, ఆయుధాలను, సైన్యాలను మోహరిస్తోంది. దీంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్తతలు ఒక్కసారిగా పెరిగిపోయాయి.
By October 31, 2021 at 10:26AM
No comments