Breaking News

అల్లుడికి అత్త చట్టబద్ధ ప్రతినిదే.. పరిహారానికి అర్హురాలే.. సుప్రీం సంచలన తీర్పు


అల్లుడి ఇంట్లో నివసిస్తున్న అత్త ఆయనకు చట్టబద్ధ ప్రతినిధి అవుతుందని స్పష్టం చేసింది. మోటారు వాహనాల చట్టం కింద పరిహారం పొందడానికి ఆమె అర్హురాలేనని తేల్చిచెప్పింది. ఈ మేరకు జస్టిస్‌ ఎస్‌.ఎ.నజీర్, జస్టిస్‌ కృష్ణ మురారిలతో కూడిన ధర్మాసనం సోమవారం తీర్పు వెలువరించింది. కేరళకు సంబంధించిన కేసులో హైకోర్టు ఇచ్చిన తీర్పును పక్కనబెట్టి.. తాజాగా ఉత్తర్వులు జారీచేసింది. రోడ్డు ప్రమాదంలో అల్లుడు చనిపోవడంతో అత్తను చట్టబద్ద ప్రతినిధిగా పరిగణించలేమన్న బీమా కంపెనీ వాదనను తోసిపుచ్చింది. ‘కూతురు..అల్లుడు దగ్గర అత్త ఆశ్రయం పొందడం భారతీయ సమాజంలో అసాధారణమేమీ కాదు.. వృద్ధాప్యంలో పోషణ కోసం అల్లుడిపైనా ఆధారపడతారు.. అల్లుడికి అత్త చట్టబద్ధమైన వారసురాలేమీ కాదు.. కానీ ఆయన చనిపోతే తప్పకుండా ఇబ్బందులు పడుతుంది. అందువల్ల పరిహారం పొందడానికి మోటారు వాహనాల చట్టంలోని సెక్షన్‌ 166 ప్రకారం ఆమె చట్టబద్ధమైన ప్రతినిధి అవుతుంది’’ అని ధర్మాసనం పేర్కొంది. కేసు వివరాల్లోకి వెళ్తే.. కేరళకు చెందిన ఓ వ్యక్తి 2011లో రోడ్డు ప్రమాదంలో చనిపోవడంతో ఆయన కుటుంబానికి రూ.74,50,971 పరిహారం చెల్లించాలని మోటార్‌ యాక్సిడెంట్‌ క్లెయిమ్స్‌ ట్రైబ్యునల్‌ బీమా సంస్థను ఆదేశించింది. దీన్ని బీమా కంపెనీ హైకోర్టులో సవాల్ చేయడంతో పరిహారాన్ని రూ.48,39,728కు తగ్గించింది. అయితే, అత్తను చట్టబద్ధ ప్రతినిధిగా పరిగణించలేమని తీర్పు వెలువరించింది. ఈ తీర్పుపై మృతుని భార్య సుప్రీంకోర్టులో అప్పీలు చేయడంతో జస్టిస్ నజీర్, జస్టిస్ మురారీల ధర్మాసనం విచారణ చేపట్టింది. మృతుడు అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌గా పనిచేస్తూ నెలకు రూ.83,831 జీతం పొందిన విషయాన్ని ధర్మాసనం పరిగణనలోకి తీసుకుంది. ఆయన 52 ఏళ్ల వయసులో ప్రమాదంలో మరణించడం వల్ల ఆ కుటుంబం నష్టపోయిందని అభిప్రాయపడింది. అందువల్ల మొత్తం రూ.85,81,815 పరిహారంగా చెల్లించాలని ఆదేశించింది. తీర్పు వెలువరించిన తేదీ నుంచి పరిహారం చెల్లించే తేదీ వరకు 7.5 శాతం వడ్డీ కూడా చెల్లించాలని సూచించింది. అల్లునిపై ఆధారపడ్డ అత్త కూడా పరిహారానికి అర్హురాలేనని పేర్కొంది. ‘ఇది బాధితులకు లేదా వారి కుటుంబాలకు ఉపశమనం కలిగించే లక్ష్యంతో రూపొందించిన ప్రయోజనకరమైన చట్టం.. మోటార్ వెహికల్ చట్టంలోని సెక్షన్ 168 ‘కేవలం పరిహారం’ అనే భావనతో వ్యవహరిస్తుంది.. ఇది న్యాయమైన, సహేతుకత, సమానత్వం పునాదిపై నిర్ణయించాలి’ అని వ్యాఖ్యానించింది.


By October 26, 2021 at 12:00PM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/mother-in-law-residing-with-her-son-in-law-is-legal-representative-says-supreme-court/articleshow/87272635.cms

No comments