Breaking News

ప్రియాంకను చూస్తే రాహుల్‌కు వణుకు.. అందుకే అలా.. ప్రశాంత్ కిశోర్ సంచలన వ్యాఖ్యలు


ఎన్నికల వ్యూహకర్త కాంగ్రెస్ పార్టీలో చేరుతారంటూ గత కొన్ని రోజుల నుంచి ప్రచారం సాగుతోంది. ఆయన కాంగ్రెస్‌లో చేరడం మాట అటుంచితే.. తాజాగా రాహుల్ గాంధీని ఉద్దేశించిన పీకే చేసిన వ్యాఖ్యలు ఆ పార్టీలో కొత్త వివాదానికి తెరతీశాయి. తన సోదరి, కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి సామర్థ్యాలను చూసి భయపడుతున్నారని ఓ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రశాంత్ వ్యాఖ్యానించారు. ప్రియాంక అచ్చం తన నానమ్మ, మాజీ ప్రధాని ఇందిరా గాంధీలానే ఉంటారని, ఆమెలో బలమైన నాయకత్వ లక్షణాలున్నాయని అభిప్రాయపడ్డారు. 2017 ఉత్తర్ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ సీఎం అభ్యర్థిగా.. ప్రియాంకను ప్రకటించకపోవడానికి ఇదే కారణమని ఆయన చెప్పుకొచ్చారు.‘ప్రియాంకా గాంధీ.. తన నాయినమ్మ, దేశ మాజీ ప్రధాని ఇందిరా గాంధీని పోలి ఉంటారు.. ఆమెలో బలమైన నాయకత్వ లక్షణాలను ప్రజలు కూడా చూస్తున్నారు.. ప్రియాంకలో ఉన్న ఈ లక్షణాలే.. రాహుల్ను భయపెడుతున్నట్టున్నాయి.. అందుకే 2017 ఉత్తర్ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల కోసం.. కాంగ్రెస్ సీఎం అభ్యర్థిగా ప్రియాంకను ప్రకటించలేదు’ అని పీకే అన్నారు. రాహుల్ గాంధీని తొలిసారిగా పాట్నాలో కలిశానని, అప్పుడే తనను కాంగ్రెస్ కోసం పనిచేయమని కోరారని తెలిపారు. అయితే, బిహార్లో రాజకీయ పరిస్థితులు సక్రమంగా లేవని, ముఖ్యంగా కాంగ్రెస్కు పరిస్థితులు పూర్తిగా ప్రతికూలంగా మారాయని చెప్పానని పేర్కొన్నారు. ఇదిలా ఉండగా, కొద్ది రోజుల కిందట కాంగ్రెస్‌పై ట్విట్టర్‌లో పీకే విమర్శలు గుప్పించారు. ఉత్తర్‌ ప్రదేశ్‌లోని లఖింపూర్‌ ఖేరి హింసాకాండపై ఉద్యమించడం ద్వారా కాంగ్రెస్‌ పార్టీ నాయకత్వంలోని ప్రతిపక్ష పాత్ర వేగంగా బలోపేతం అవుతుందని ఆశపెట్టుకోవడం తొందరపాటు అవుతుందని హెచ్చరించారు. అంతర్గత సమస్యలను పరిష్కరించకుండా కాంగ్రెస్‌ పునరుత్థానం సాధించలేదని వివరించారు. ప్రశాంత్ కిశోర్ ట్వీటప్‌పై కాంగ్రెస్ కూడా దీటుగా కౌంటరిచ్చింది. లఖింపూర్ ఖేరి ఘటన వంటి సున్నితమైన అంశాల్లో లాభనష్టాలను వెతుక్కోవడం నేరమని పేర్కొంది. ఇక, పీకే కాంగ్రెస్లో చేరికపై పలువురు సీనియర్లు వ్యతిరేకత వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ఇప్పుడు ప్రశాంత్ వైఖరి చూస్తే కాంగ్రెస్లో ఆయన చేరిక లేనట్లే కనిపిస్తోంది. దేశంలో అతిపెద్ద రాష్ట్రమైన యూపీలో పూర్వ వైభవం కోసం ప్రయత్నిస్తోన్న కాంగ్రెస్ పార్టీ.. వచ్చే ఏడాది ప్రథమార్థంలో జరగనున్న ఎన్నికల కోసం కసరత్తు ప్రారంభించింది. ఎన్నికలకు ఆరు నెలల సమయం ఉండగా.. 35-40 మందితో తొలి జాబితాను వచ్చే వారం ప్రకటించనున్నట్టు తెలుస్తోంది.


By October 17, 2021 at 04:22PM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/poll-stratagist-prashant-kishore-says-rahul-gandhi-scared-of-priyankas-abilities/articleshow/87082129.cms

No comments