మమ్మల్ని పడగొట్టేందుకు ప్రయత్నించొద్దు.. అమెరికాకు తాలిబన్లు వార్నింగ్!
అఫ్గన్ నుంచి అమెరికా, నాటో దళాలు వైదొలగిన తర్వాత తొలిసారి అగ్రరాజ్యం, తాత్కాలిక ప్రభుత్వం మధ్య దోహా వేదికగా ముఖాముఖి చర్చలు జరిగాయి. ఈ సందర్భంగా తమ ప్రభుత్వాన్ని అస్థిరపరచడానికి ప్రయత్నిస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని అమెరికాను తాలిబన్లు హెచ్చరించారు. చర్చల అనంతరం అఫ్గన్ విదేశాంగ మంత్రి అమిర్ ఖాన్ ముత్తాఖీ మాట్లాడుతూ.. ‘అఫ్గన్‌లో ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు ప్రయత్నిస్తే ఏ ఒక్కరికీ మంచిది కాదని స్పష్టం చెప్పామని’ తెలిపారు. ‘అఫ్గనిస్థాన్‌లో మంచి సంబంధాలు అందరికీ మంచింది.. అఫ్గన్‌లో ఇప్పటికే ఉన్న ప్రభుత్వాన్ని బలహీనపరచడానికి ఏదైనా ప్రయత్నం చేస్తే అది ప్రజా సమస్యలకు దారితీస్తుంది’ అని హెచ్చరించారు. ఖతార్ రాజధాని దోహా వేదికగా అమెరికా, తాలిబన్ తాత్కాలిక ప్రతినిధుల మధ్య రెండు రోజుల పాటు చర్చలు జరిగాయి. ఈ చర్చల్లో అమెరికా విదేశాంగ శాఖకు చెందిన ప్రత్యేక ప్రతినిధి టామ్ వెస్ట్, అమెరికా మానవతా సాయం విభాగం అధికారి సారా చార్లెస్ పాల్గొన్నారు. అఫ్గన్‌స్థాలో కరోనా వ్యాక్సినేషన్‌కు అమెరికా సహకరిస్తుందని చర్చల్లో పాల్గొన్న ప్రతినిధులు హామీ ఇచ్చారని తాలిబన్ మంత్రి ముత్తాఖీ అన్నారు. అయితే, తాలిబన్లతో చర్చలు జరిగిన విషయమై అమెరికా తక్షణమే ధ్రువీకరించలేదు. ‘ చాలా క్లిష్ట సమస్యలను ఎదుర్కొంటున్నప్పుడు ఇరు దేశాలూ ఒకదానితో ఒకటి మంచి సంబంధాలు కలిగి ఉంటాయి.. సహనంతో ముందుకెళ్తాయని వాగ్దానం చేసింది.. కాబట్టి ఈ పరిస్థితి నుంచి అఫ్గన్ బయటపడుతుంది’ అని అన్నారు. అఫ్గన్‌లో రెండు దశాబ్దాల సుదీర్ఘ యుద్ధానికి ముగింపు పలికిన అమెరికా.. ఈ ఏడాది ఆగస్టు 31తో సైన్యాన్ని పూర్తిగా ఉపసంహరించింది. అమెరికా సైన్యం వెనక్కు వెళ్లడంతో తాలిబన్లు మళ్లీ అఫ్గన్‌ను ఆక్రమించుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటుచేశారు. అయితే, తాలిబన్ల ప్రభుత్వాన్ని అంతర్జాతీయ సమాజం అధికారికంగా గుర్తించలేదు. మరోవైపు, ఐఎస్ ఉగ్రవాదుల రూపంలో తాలిబన్లు తీవ్ర ముప్పును ఎదుర్కొంటున్నారు. శుక్రవారం మసీదు వద్ద ఐఎస్-కే ఉగ్రవాదులు మారణహోమం సృష్టించారు. ఐఎస్ ఉగ్రవాదుల జరిపిన ఆత్మాహుతి దాడిలో 60 మంది ప్రాణాలు కోల్పోగా.. వందలాది మంది గాయపడ్డారు. ఇక, అఫ్గన్‌కు అంతర్జాతీయ సాయం నిలిచిపోవడంతో తీవ్ర ఆర్ధిక సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ఆహార వస్తువుల ధరలు అకాశాన్ని అంటుతుండగా.. నిరుద్యోగం తాండవిస్తోంది. ఈ పరిస్థితి నుంచి బయటపడటానికి మానవత్వంతో ఆదుకోవాలని ప్రపంచ దేశాలను తాలిబన్ ప్రభుత్వం కోరుతోంది.
By October 10, 2021 at 08:18AM
No comments