రైతులపైకి దూసుకెళ్లిన కేంద్ర మంత్రి కుమారుడి కారు.. హింసాత్మక ఘటనలో 8 మంది మృతి
నూతన వ్యవసాయ చట్టాలన వ్యతిరేకంగా ఉత్తర్‌ప్రదేశ్‌లో రైతులు చేపట్టిన ఆందోళన పెద్ద ఎత్తున హింసకు దారితీసి 8 మందిని బలితీసుకుంది. లఖింపుర్ ఖేరి జిల్లా బన్బీర్‌పుర్ వద్ద నిరసన తెలుపుతున్న రైతులపైకి కేంద్ర మంత్రి కుమారుడి కారు, మరో వాహనం దూసుకెళ్లడంతో నలుగురు రైతులు ప్రాణాలు కోల్పోగా.. మరికొందరు గాయపడ్డారు. ఈ ఘటనతో అన్నదాతల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. రెండు కార్లను తగలబెట్టి, రైతులు దాడికి పాల్పడటంతో ఓ కారులోని నలుగురు నలుగురు మృతి చెందారు. ఆ ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్తతలు చోటుచేసుకోవడంతో పోలీసులను భారీగా మోహరించారు. కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి అజయ్ మిశ్రా కుమారుడు ఆశిష్ మిశ్రా వాహనం రైతులపైకి దూసుకెళ్లింది. అయితే, ఘటన సమయంలో తన కుమారుడు కారులో లేడని కేంద్ర మంత్రి వెల్లడించారు. రైతులే బీజేపీ బీజేపీ కార్యకర్తలు, కారు డ్రైవరును కొట్టి చంపారని అజయ్ మిశ్రా ఆరోపించారు. కాగా, ఈ ఘటనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన రైతు సంఘాలు.. దీనికి నిరసనగా దేశవ్యాప్తంగా అన్ని జిల్లా కలెక్టర్ కార్యాలయాల ఎదుటు ఆందోళనకు పిలుపునిచ్చాయి. మేజిస్ట్రేట్ కార్యాలయాల ఎదుట సోమవారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట మధ్య ఆందోళన చేపట్టాలని నిర్ణయించాయి. ఈ ఘటనను కాంగ్రెస్ సహా ప్రధాన ప్రతిపక్షాలన్నీ తీవ్రంగా ఖండించాయి. ఘటన గురించి తెలియగానే సంయుక్త కిసాన్ మోర్చా నేత రాకేశ్ తికాయత్‌తోపాటు హరియాణా, పంజాబ్‌లకు చెందిన రైతులు ఉత్తర్‌ప్రదేశ్‌కు చేరుకున్నారు. కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా స్వగ్రామం బన్బీర్‌పుర్‌లో ఆదివారం నిర్వహించిన ఓ కార్యక్రమానికి ఆయనతో పాటు యూపీ డిప్యూటీ సీఎం కేశవ్ ప్రసాద్ మౌర్య హాజరు కావాల్సి ఉంది. ఈ కార్యక్రమంలో తమ నిరసన వ్యక్తం చేయాలని రైతులు నిర్ణయించారు. ఇందులో భాగంగా తికోనియా-బన్బీర్‌పుర్ రోడ్డుపై ఆందోళనకు దిగారు. ఇదే సమయంలో కేశవ్ ప్రసాద్‌కు స్వాగతం పలకడానికి అజయ్ మిశ్రా కుమారుడు ఆశిష్ మిశ్ర వాహన శ్రేణితో అటువైపు రాగా రైతులు నల్ల జెండాలు చూపుతూ నినాదాలు చేశారు. రెండు కార్లు ఉన్నట్టుండి రైతుల మీదకు దూసుకెళ్లాయి. దీంతో రైతుల హాహాకారాలు, రక్తసిక్తమైన రహదారితో ఆ ప్రదేశంలో భీతావహ వాతావరణం నెలకొంది. మంత్రి కుమారుడి అమానుష చర్యపై ఆగ్రహించిన రైతులు ఆయన కారుతో పాటు మరో కారును తగలబెట్టారు. ఈ ఘటనలో నలుగురు రైతులు సహా 8 మంది మరణించారని లఖింపురి ఖేరి జిల్లా మేజిస్ట్రేట్ అర్వింద్ కుమార్ తెలిపారు. కనీసం 8 మంది గాయపడినట్లు తెలుస్తోంది.
By October 04, 2021 at 07:16AM
No comments