గతేడాది 18% పెరిగిన రైతుల ఆత్మహత్యలు.. మూడో స్థానంలో ఆంధ్రప్రదేశ్
వ్యవసాయం రంగం గతేడాది సానుకూల వృద్ధిని నమోదు చేసినా.. మాత్రం 2019 కంటే ఎక్కువగా నమోదయ్యాయి. దేశంలో ఆత్మహత్యలపై నేషనల్ క్రైం రికార్డుల బ్యూరో (ఎన్‌సీఆర్‌బీ) విడుదల చేసిన నివేదిక ప్రకారం.. 2019తో పోల్చితే 2020లో వ్యవసాయ రంగంలో ఆత్మహత్యలు 18 శాతం మేర పెరిగాయి. దేశవ్యాప్తంగా గతేడాది మొత్తం 10,677 మంది రైతులు, కూలీలు బలవన్మరణానికి పాల్పడ్డారు. ఇందులో 4,006 ఆత్మహత్యలతో మహారాష్ట్ర తొలిస్థానంలో నిలిచింది. తర్వాతి స్థానాల్లో కర్ణాటక (2,016), ఆంధ్రప్రదేశ్ (889), మధ్యప్రదేశ్ (735), చత్తీస్‌గఢ్ (537) ఉన్నాయి. రైతుల బలవన్మరణాల్లో 2019లోనూ ఈ నాలుగు రాష్ట్రాలే టాప్-4లో ఉండటం గమనార్హం. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక సహాయానికి భూమిలేని రైతులు అర్హత పొందకపోవడమే ప్రధాన కారణంగా భావిస్తున్నారు. చాలా మంది భూమిలేని రైతులు కౌలుకు తీసుకున్న భూమిలో వ్యవసాయం చేసేందుకు కూడా మార్గం లేకపోవడంతో కూలీలుగా పనిచేయాల్సి వస్తోంది. ఈ నేపథ్యంలో ఆత్మహత్యలకు పాల్పడినట్టు అనుమానిస్తున్నారు. దేశవ్యాప్తంగా మొత్తం 1,53,052 మంది ఆత్మహత్యకు పాల్పడగా.. వీరిలో రైతులు 7 శాతం (10,677) ఉన్నారు. వీరిలో రైతులు 5,579, వ్యవసాయ కూలీలు 5,098 మంది ఉన్నట్టు ఎన్సీఆర్బీ నివేదిక తెలిపింది. 2016 తర్వాత వరుగా మూడేళ్లు తగ్గిన రైతుల ఆత్మహత్యలు.. గతేడాది పెరగడం ఆందోళనకరం. 2016లో అత్యధికంగా 11,379 మంది బలవన్మరణానికి పాల్పడ్డారు. ఆ తర్వాత 2017లో 10,655, 2018లో 10,349, 2019లో 10,281 మంది ఆత్యహత్యలతో చనిపోయినట్టు ఎన్‌సీఆర్బీ నివేదిక తెలిపింది. అయితే, 2019తో పోల్చితే 2020లో రైతుల ఆత్మహత్య తగ్గగా.. కూలీలు సంఖ్య మాత్రం 4,324 నుంచి 5,098కి పెరిగింది. ‘ఈ డేటా ఆత్మహత్య చేసుకున్న వ్యక్తుల వృత్తిని మాత్రమే వర్ణిస్తుంది.. ఆత్మహత్యకు గల కారణానికి సంబంధించి ఎటువంటి సంబంధం లేదు’ అని ఎన్‌సీఆర్బీ వ్యాఖ్యానించింది. మొత్తం 5,579 మంది రైతుల్లో 5,335 మంది పురుషులు, 244 మంది మహిళలు ఉన్నారు. ఇదే కూలీల విషయానికి వస్తే 4,621 మంది పురుషులు, 477 మంది మహిళలు. ఇక, సాగు చట్టాలపై ఆందోళనలు అధికంగా జరుగుతున్న పంజాబ్‌లో 257 మంది, హరియాణాలో 280 మంది బలవన్మరణానికి పాల్పడ్డారు. ఇక, పశ్చిమ్ బెంగాల్, బిహార్, నాగాలాండ్, త్రిపుర, ఉత్తరాఖండ్ రాష్ట్రాలు, చండీగఢ్, ఢిల్లీ, లడఖ్, లక్షద్వీప్, పుదుచ్చేరి కేంద్రపాలిత ప్రాంతాల్లో రైతులు లేదా వ్యవసాయ కూలీల ఆత్మహత్యలు సున్నాగా నమోదయ్యాయి.
By October 29, 2021 at 08:37AM
No comments