Republic Trailer: అజ్ఞానం గూడు కట్టిన చోటే.. మోసం గుడ్లు పెడుతుంది.. చిరంజీవి మెసేజ్ అదుర్స్
మెగా మేనల్లుడు తన విశ్వరూపం చూపించారు. తాజాగా విడుదలైన రిపబ్లిక్ మూవీ ట్రైలర్‌లో రోమాలు నిక్కబొడిచే పవర్‌ఫుల్ డైలాగ్స్ చెప్పి ఆకట్టుకున్నారు. దేవ కట్టా దర్శకత్వంలో సాయి ధరమ్ తేజ్ హీరోగా రాబోతున్న 'రిపబ్లిక్' సినిమాను ప్రపంచవ్యాప్తంగా అక్టోబర్ 1న థియేటర్స్‌లో గ్రాండ్‌గా విడుదల చేస్తున్నారు. ఈ నేపథ్యంలో చిత్ర ప్రమోషన్స్‌లో భాగంగా తాజాగా మెగాస్టార్ చేతుల మీదుగా 'రిపబ్లిక్' ట్రైలర్ రిలీజ్ చేశారు. ఈ ట్రైలర్‌ని తన ట్విట్టర్ ఖాతా ద్వారా పంచుకున్న చిరంజీవి.. సాయి ధరమ్ తేజ్ హెల్త్ అప్‌డేట్ ఇస్తూ చిత్రయూనిట్ మొత్తానికి ఆల్ ది బెస్ట్ చెప్పారు. ''సాయి ధరమ్ తేజ్ త్వరగా కోలుకుంటున్నాడు. రిపబ్లిక్ చిత్రం అక్టోబర్ 1వ తారీఖున విడుదల చేస్తే బాగుంటుందన్న తన కోరిక మేరకు అదే తేదీన చిత్రం విడుదల అవుతుంది. మీ ఆదరణ, అభిమానం, ప్రేమే సాయి ధరమ్ తేజ్‌కి శ్రీరామ రక్ష'' అని చిరు పేర్కొన్నారు. ఇకపోతే ఒక నిమిషం 55 సెకనుల నిడివితో కట్ చేసిన ఈ ట్రైలర్ ఆధ్యంతం పవర్‌ఫుల్ డైలాగ్స్‌తో ఆలోచింపజేస్తోంది. ''సమాజంలో తిరిగే అర్హతే లేని గుండాలు.. పట్టపగలే బాహాటంగా అమాయకుల ప్రాణాలు తీస్తుంటే కంట్రోల్ చేయాల్సిన వ్యవస్థలే వాళ్లకు కొమ్ము కాస్తున్నాయి, మీ భయం, అజ్ఞానం, అమాయకత్వం, విశ్వాసమే ఆ సింహాసనానికి నాలుగు కాళ్లు, అజ్ఞానం గూడు కట్టిన చోటే.. మోసం గుడ్లు పెడుతుంది కలెక్టర్'' అంటూ వస్తున్న డైలాగ్స్ సినిమాపై హైప్ పెంచేశాయి. ''దేనికి భయం, దేనికి భయం'' అంటూ చివరలో సాయి తేజ్ ఇచ్చిన స్టేట్‌మెంట్ సినిమాపై క్యూరియాసిటీని రెట్టింపు చేసింది. రీసెంట్‌గా సెన్సార్ కంప్లీట్ చేసుకున్న ఈ మూవీ U/A సర్టిఫికెట్ పొందింది. పొలిటికల్ నేపథ్యంలో రూపొందిన ఈ సినిమాలో సాయి ధరమ్ తేజ్ సరసన ఐశ్వర్య రాజేష్ హీరోయిన్‌గా నటించగా.. జగపతి బాబు, రమ్యకృష్ణ ముఖ్య పాత్రలు పోషించారు.
By September 22, 2021 at 11:06AM
No comments