Breaking News

India Vaccine భారత్‌కు షాకిచ్చిన యూకే.. కోవిషీల్డ్ తీసుకున్నా టీకా వేసుకోనట్టే.. తీవ్ర విమర్శలు!


యూకే ప్రభుత్వం ఇటీవల వెల్లడించిన కోవిడ్ నిబంధనలపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. భారత్‌లో కోవిషీల్డ్ రెండు డోస్‌ల తీసుకుని తమ దేశానికి వచ్చే ప్రయాణికులను వ్యాక్సిన్ వేసుకోనివారిగానే పరిగణిస్తామని, వీరు 10 రోజులు సెల్ఫ్ ఐసోలేషన్‌లో ఉండాలని యూకే ప్రకటించింది. దీనిపై విమర్శలు రావడంతో బ్రిటన్ ప్రభుత్వం స్పందించింది. భారతీయ అధికారులు జారీ చేసే కోవిడ్-19 వ్యాక్సిన్ సర్టిఫికెట్‌ గుర్తించే ప్రక్రియలో నిమగ్నమై ఉన్నామని యూకే సోమవారం తెలిపింది. అక్టోబర్ 4 నుంచి అమల్లోకి వచ్చే కొత్త నిబంధనలపై భారత్ ఆందోళనల గురించి బ్రిటిష్ హై కమిషన్ ప్రతినిధి స్పందిస్తూ.. ఈ విషయాన్ని పరిశీలిస్తున్నామని, ‘సాధ్యమైనంత త్వరలో’అంతర్జాతీయ ప్రయాణాలను ప్రారంభించడానికి కట్టుబడి ఉన్నామని చెప్పారు. ‘సాధ్యమైనంత త్వరగా అంతర్జాతీయ ప్రయాణాలను ప్రారంభించడానికి యూకే కట్టుబడి ఉంది.. ప్రజల ఆరోగ్యాన్ని కాపాడుతూ సురక్షితంగా, స్థిరమైన మార్గంలో మరింత స్వేచ్ఛగా ప్రయాణించడానికి వీలుకల్పించే తదుపరి దశ’ అని అన్నారు. భారత్‌లోని ప్రజారోగ్య సంస్థ ద్వారా టీకాలు వేసుకున్న వ్యక్తుల సర్టిఫికేషన్‌ను గుర్తించే అంశంపై భారత ప్రభుత్వంతో చర్చిస్తున్నామని అన్నారు. ప్రస్తుతం ఆయా దేశాల్లోని కోవిడ్ తీవ్రతను బట్టి ఆకుపచ్చ, ఎరుపు, అంబర్ మూడు కేటగిరీలుగా విభజించారు. అయితే, వీటన్నింటినీ అక్టోబరు 4 నుంచి రెడ్ జాబితాలో చేర్చనున్నారు. ప్రస్తుతం అంబర్ జాబితాలో భారత్ ఉండగా.. దానిని రద్దు చేయడం వల్ల ప్రయాణికులపై పీసీఆర్ పరీక్షల భారం పడుతుంది. వ్యాక్సినేషన్ దేశాల జాబితాలో భారత్‌ను చేర్చకపోవడంతో కేంద్రం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. తాజా నిబంధనల ప్రకారం భారత్‌లో వినియోగిస్తున్న ఆక్స్‌ఫర్డ్-ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్ కోవిషీల్డ్ తీసుకున్నా తప్పనిసరిగా పీసీఆర్ పరీక్ష చేయించుకుని, హోం ఐసోలేషన్‌లో ఉండాలి. ఆఫ్రికా, దక్షిణ అమెరికా, యూఏఈ, టర్కీ, ఇండియా, థాయ్‌లాండ్, రష్యా తదితర దేశాల్లో ఎవరైనా ఒక వ్యక్తి.. రెండు డోసుల వ్యాక్సిన్‌ను తీసుకున్నా సరే.. సదరు వ్యక్తి యూకే ప్రభుత్వం దృష్టిలో వ్యాక్సిన్ తీసుకోనట్లే. కాబట్టి సదరు వ్యక్తి బ్రిటన్ వెళ్లిన తర్వాత తప్పని సరిగా అక్కడి నిబంధనల ప్రకారం క్వారెంటైన్‌లో ఉండాల్సి ఉంటుంది. కాగా.. ఈ నిబంధనలు భారత ప్రయాణికులకు ఇబ్బందికరంగా మారాయి. ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ అభివృద్ది చేసిన ఆస్ట్రాజెనికా టీకాను భారత్‌లోని సీరం ఇన్‌స్టిట్యూట్.. కొవిషీల్డ్ పేరుతో ఇండియాలో పంపిణీ జరుగుతోంది. ఈ క్రమంలో కొవిషీల్డ్ వ్యాక్సిన్ దాదాపు ప్రపంచ దేశాలు గుర్తించి.. ఈ టీకాను తీసుకున్న ప్రయాణికులకు కొవిడ్ నిబంధనలను కూడా సరళతరం చేస్తున్నాయి. అయితే బ్రిటన్ మాత్రం ఇందుకు విరుద్ధంగా వ్యవహరిస్తోంది. పూర్తి స్థాయిలో వ్యాక్సిన్ తీసుకున్న ప్రయాణికులను కూడా వ్యాక్సిన్ తీసుకోని వారిగా గుర్తిస్తూ ఇబ్బందులకు గురిచేస్తోంది.


By September 21, 2021 at 12:17PM


Read More https://telugu.samayam.com/latest-news/international-news/indian-authorities-amid-criticism-of-new-british-travel-rules/articleshow/86390562.cms

No comments