Breaking News

Ida Hurricane అమెరికాలో ఐడా బీభత్సం.. కనీసం 41 మంది మృతి


‘ఐడా’ హరికేన్‌ దెబ్బకు అగ్రరాజ్యం అమెరికాలోని పలు రాష్ట్రాలు భయంతో వణుకుతున్నాయి. ‘ఐడా’ బీభత్సం నుంచి లూసియానా రాష్ట్రం తేరుకోక ముందే పెను తుఫాను ప్రభావం న్యూయార్క్‌, న్యూ జెర్సీలపై పడగవిప్పింది. భారీ వరదలతో న్యూయార్క్, దాని పరిసరాల్లో ఒక్క రోజులోనే కనీసం 41 మంది ప్రాణాలు కోల్పోయారు. న్యూయార్క్ నగరంలో 11 మంది, న్యూజెర్సీ రాష్ట్రంలో 23 మంది చనిపోయారు. కింది అంతస్తుల్లో నివసిస్తున్నవారు వరదలకు పలువురు కొట్టుకుపోయారు. న్యూయార్‌లో ‘ఆకస్మిక వరదల అత్యయిక స్థితి’ని అమెరికా ప్రకటించింది. సబ్‌వే స్టేషన్‌లు, ట్రాక్‌లపై వరద నీరు భారీగా చేరడంతో రవాణా వ్యవస్థ స్తంభించింది. న్యూయార్‌ నగరంలోని సెంట్రల్‌ పార్క్‌ వద్ద బుధవారం రాత్రి ఒక్క గంటలోనే రికార్డు స్థాయిలో 8.91 సెంటీమీటర్ల వర్షపాతం నమోదనట్టు జాతీయ వాతావరణ సేవల కార్యాలయం తెలిపింది. న్యూజెర్సీలోని కర్నీలో ‘యూఎస్‌ పోస్టల్‌ సర్వీస్‌’ భవన పైకప్పు కూలింది. న్యూజెర్సీలో ప్రచండ గాలులు, టోర్నడోలూ బీభత్సం సృష్టించాయి. న్యూజెర్సీలోని 21 కౌంటీల్లో ప్రభుత్వం అత్యయిక స్థితి ప్రకటించింది. ప్రజలు ఇళ్లలోనే ఉండాలని, అత్యవసర వాహనాలు మాత్రమే రోడ్లపైకి రావచ్చని పేర్కొంది. పెన్సిల్వేనియాలోని ఫిలడెల్ఫియాలోనూ భారీ వరదలు సంభవించాయి. తుఫాను కారణంగా లూసియానా రాష్ట్రంలో నిలిచిపోయిన విద్యుత్‌ సరఫరాను ఇప్పటికీ పునరుద్ధరించలేదు. అనేక కార్లు కొట్టుకుపోయాయి. కార్యాలయాలు, ఇళ్లలోకి భారీగా బురద, వరద నీళ్లు చేరాయి. ‘తనకు 50 ఏళ్లని.. ఇప్పటి వరకూ తన జీవితంలో ఇంతటి భారీ వర్షం చూడలేదు.. అడవిలో ఉన్నట్టుంది.. ఉష్ణమండలలో కురిసిన వర్షంలా ఉందని నమ్మశక్యంగా లేదు.. ఈ ఏడాది అంతా చాలా వింతగా ఉంది’ అని మన్‌హట్టన్‌లోని ఓ రెస్టారెంట్ యజమాని మెటోడిజా మిహాజ్లోవ్ తెలిపారు. ఆయన రెస్టారెంట్‌లోకి మూడు అంగుళాల మేర వరద నీరు చేరింది. భారీ వర్షంతో లాగౌర్డియా, జాన్ ఎఫ్ కెన్నెడీ విమానాశ్రయాలను మూసివేసి, వందలాది విమానాలను రద్దుచేశారు. ఆకస్మిక వరదలకు తీవ్రంగా ప్రభావితమైన లూసియానాలో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ శుక్రవారం పర్యటించనున్నారు. వరదలపై బైడెన్ మాట్లాడుతూ.. ‘ ఈ సమయంలో మేమంతా ఐక్యంగా ఉన్నాం.. సహాయానికి దేశం సిద్ధంగా ఉంది’ అని అన్నారు.


By September 03, 2021 at 08:37AM


Read More https://telugu.samayam.com/latest-news/international-news/at-least-41-dead-as-hurricane-ida-brings-flash-flooding-to-northern-us/articleshow/85887228.cms

No comments