Breaking News

Covid-19కు ఎర్ర చీమల చట్నీ.. సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!


బ్రిటిష్ చెఫ్ గోర్డాన్ రామ్‌సే మెనూలోని ‘ఎర్ర చీమల చట్నీ’ అంతర్జాతీయంగా ఒకప్పుడు క్రేజ్ సొంతం చేసుకుంది. తాజాగా, కరోనా వైరస్ నివారణకు ‘ఎర్ర చీమల చట్నీ’ని ఉపయోగించేలా ఆదేశాలు జారీ చేయాలంటూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఒడిశాలోని గిరిజన తెగకు చెదిన ఓ వ్యక్తి దాఖలు చేసిన ఈ పిటిషన్‌పై విచారణ సందర్భంగా సర్వోన్నత న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది. సంప్రదాయ జ్ఞానం, ఇంటి చిట్కాలను కరోనా నివారణలో ఉపయోగించాలని ఆదేశించలేమని పేర్కొంటూ పిటిషన్‌ను కొట్టివేసింది. ‘మన ఇళ్లలో బోల్డంత సంప్రదాయ విజ్ఞానం ఉంది. ఈ చిట్కాలను మనం సొంతంగా ఉపయోగించుకోవచ్చు. దాని పర్యవసానాన్ని వాడినవారే అనుభవించాల్సి ఉంటుంది.. మీరు ఉపయోగించాలనుకుంటే అది మీ ఇష్టం.. అయితే, రాజ్యాంగబద్ధమైన న్యాయస్థానంగా దీనిని దేశవ్యాప్తంగా అందరూ ఆచరించాలని మాత్రం మేం ఆదేశించలేం’ అని జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ హిమా కోహ్లీతో కూడిన ధర్మాసనం వ్యాఖ్యానించింది. నివారణకు వ్యాక్సిన్ తీసుకోవాలని పిటిషనర్‌ను కోరింది. ఒడిశాలోని బారిపడకు గిరిజన తెగకు చెందిన పిటిషనర్ నయాధర్ పఢియల్‌ తరఫున న్యాయవాది అనిరుధ్ సంగనేరియ వాదనలు వినిపించారు. తాము దాఖలుచేసిన పిటిషన్‌ను ఒడిశా హైకోర్టు కొట్టివేయడంతో సుప్రీంలో ఛాలెంజ్ చేశామని తెలిపారు. కొవిడ్ రెమిడీగా ఎర్ర చీమల చట్నీని ఉపయోగించాలన్న ప్రతిపాదనపై మూడు నెలల్లోగా నిర్ణయం తీసుకోవాలంటూ ఆయుష్ మంత్రిత్వశాఖ డైరెక్టర్ జనరల్, కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రిసెర్చ్ (సీఎస్ఐఆర్)ను ఒడిశా హైకోర్టు ఆదేశించడంతోనే సమస్య ప్రారంభమైందని ధర్మాసనం పేర్కొంది. దీనికి తాము ముగింపు పలకాలనుకుంటున్నామని స్పష్టం చేస్తూ పిటిషన్‌ను కొట్టివేసింది. పిటిషనర్‌ టీకా వేసుకోవాలని సూచించింది. దీనికి స్పందించిన ఆయన తరఫు లాయర్.. ‘ఇప్పటికే తన క్లయింట్ టీకా రెండు డోస్‌లు వేసుకున్నాడు మై లార్డ్.. బూస్టర్ డోస్ వేసుకోవాలనే ప్లానింగ్‌లో ఉన్నారు’ అని తెలిపారు. ఎర్రచీమలు, పచ్చిమిరపకాయలతో కలిపి చేసే చట్నీని ఒడిశా, చత్తీస్‌గఢ్‌ సహా పలు రాష్ట్రాల్లోని గిరిజనులు ఔషధంగా భావిస్తారు. ఇది ఫ్లూ, దగ్గు, సాధారణ జలుబు, ఆయాసం, శ్వాసకోశ సమస్యలతోపాటు మరెన్నింటికో ఇది దివ్యౌషధంగా పనిచేస్తుందని వారు నమ్ముతారు. ఎర్ర చీమల చట్నీలో ఫార్మిక్ యాసిడ్, ప్రొటీన్, కాల్షియం, విటన్ బి12, జింక్ వంటివి ఉంటాయని, కాబట్టి దీనికి కొవిడ్‌ను కూడా నివారించే గుణముందని పిటిషన్ పేర్కొన్నారు. బ్రిటన్‌కు చెందిన చెఫ్ గోర్డాన్ రామ్‌సే భారతీయ ఆహారంపై 2010లో డాక్యుమెంటరీ రూపొందించే క్రమంలో దేశంలో పర్యటించారు. ఈ క్రమంలో చత్తీస్‌గఢ్‌లోని గురించి విని, ఆశ్చర్యపోయాడు. దీనిని తన డాక్యుమెంటరీలో వివరించారు.


By September 10, 2021 at 07:55AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/cant-order-use-of-red-ant-chutney-as-covid-cure-says-supreme-court/articleshow/86085786.cms

No comments