Breaking News

శశిథరూర్‌పై అనుచిత వ్యాఖ్యలు.. దుమారం రేగడంతో దిగొచ్చిన రేవంత్ రెడ్డి


సీనియర్ నేత, ఎంపీ శశిథరూర్‌పై తెలంగాణ పీసీపీ అధ్యక్షుడు అనుచిత వ్యాఖ్యలు చేయడంతో దుమారం రేగింది. పార్లమెంటరీ ఐటీ స్థాయీ సంఘం చైర్మన్ హోదాలో ఇటీవల హైదరాబాద్ వచ్చిన తెలంగాణ ప్రభుత్వాన్ని అభినందించారు. కేసీఆర్ ప్రభుత్వంపై శశిథరూర్ ప్రశంసలు కురిపించడాన్ని జీర్ణించుకోలేని రేవంత్ రెడ్డి.. ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌‌తో మాట్లాడుతూ విమర్శలు గుప్పించారు. ఆయన ఓ ‘గాడిద’అని సంబోధించి, పార్టీ నుంచి బహిష్కరించాలని వ్యాఖ్యానించారు. రేవంత్ వ్యాఖ్యలపై కాంగ్రెస్‌లోని పలువురు నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తన వ్యాఖ్యలపై దుమారం రేగడంతో వాటిని ఉపసంహరించుకుంటున్నట్టు రేవంత్ వెల్లడించారు. శశిథరూర్‌పై చేసిన వ్యాఖ్యలకు తాను చింతిస్తున్నట్టు తెలిపారు. తాను అత్యంత గౌరవించే వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది శశిథరూర్ మాత్రమేనని స్పష్టం చేశారు. తన వ్యాఖ్యలపై శశిథరూర్‌కు వివరణ ఇచ్చినట్టు చెప్పారు. కాంగ్రెస్‌లో అందరూ విలువలు, విధానాలతో పనిచేస్తామని వివరించారు. అటు, రేవంత్ క్షమాపణలపై కేంద్ర మాజీ మంత్రి శశిథరూర్ స్పందించారు. తనపై చేసిన వ్యాఖ్యలకు చింతిస్తున్నట్టు రేవంత్ చెప్పారని అన్నారు. తెలంగాణ సహా దేశవ్యాప్తంగా కాంగ్రెస్ బలోపేతానికి అందరం కలిసి పనిచేస్తామన్నారు. అంతకు ముందు రేవంత్‌ వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేత మనీష్ తివారీ ట్విట్టర్‌లో తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ‘డియర్ రేవంత్.. డాక్టర్ శశి థరూర్ అత్యంత విలువైన మీ సహచరుడు.. ఆయన ప్రకటన గురించి మీకు కొన్ని సందేహాలు ఉంటే ఆయనతో మాట్లాడి ఉంటే బాగుండేది. కాంగ్రెస్ అధిష్ఠానం మీ పదాలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తుంది’ అని ట్వీట్ చేశారు. కాంగ్రెస్‌కు చెందిన మరో సీనియర్ నేత రాజీవ్ అరోరా సైతం థరూర్‌పై రేవంత్ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నానని, వెంటనే ఉపసంహరించుకోవాలని కోరారు. ఇద్దరు నాయకులూ ఒకే వర్గానికి చెందినవారని, ఇంగ్లీషులో నిష్ణాతులు అంటే ఒకరు పరిజ్ఞానం ఉన్న వ్యక్తి అని అర్ధం కాదని రేవంత్ రెడ్డి విలేకరులతో అన్నారు. శశిథరూర్ పార్టీకి బాధ్యతలను గుర్తు చేస్తున్నారని కూడా ఆయన అన్నారు. ఇదిలా ఉండగా, ప్రత్యర్థులను పొగడటం శశిథరూర్‌కు కొత్తకాదు. రెండేళ్ల కిందట ప్రధాని నరేంద్ర మోదీ‌పై కాంగ్రెస్ నేతలు చేసిన విమర్శలను తప్పుబట్టారు. మోదీని రాక్షసుడిగా చిత్రీకరించడం సమర్థవంతమైన వ్యూహం కాదని జైరామ్ రమేష్ చేసిన ప్రకటనకు మద్దతు ఇచ్చిన తర్వాత కేరళ కాంగ్రెస్ నేతల ఆగ్రహాన్ని చవిచూశారు. ‘మోదీని ప్రశంసించాలనుకునే వారు బీజేపీలో చేరాలి. మోదీని ప్రశంసించడం ద్వారా బీజేపీ పాలనలో చాలా త్వరగా మంత్రి అవుతారని ఏ కాంగ్రెస్ నాయకుడూ అనుకోరాదు’ అని పార్టీ కేరళ నేత మురళీధరన్ అన్నారు.


By September 17, 2021 at 08:12AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/telangana-congress-chief-revanth-reddy-remarks-on-shashi-tharoor-irk-party-leaders/articleshow/86281373.cms

No comments