Breaking News

‘వ్యక్తిత్వ వికాసానికి మార్గం- మాతృభాష’ తానా సాహిత్య సదస్సు విజయవంతం


ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) విభాగం ప్రపంచ సాహిత్య వేదిక ఆధ్వర్యంలో ‘నెల నెలా తెలుగు వెలుగు’ సదస్సును ప్రతి నెలా ఆఖరి ఆదివారం నిర్వహిస్తోంది. ఈ నెలకు సంబంధించి సెప్టెంబర్ 26న ‘వ్యక్తిత్వ వికాసానికి మార్గం ’ అంశంపై సదస్సు వర్చువల్‌లో విజయవంతంగా జరిగింది. పాలకమండలి అధ్యక్షుడు బండ్ల హనుమయ్య స్వాగతోపన్యాసం చేశారు. ఈ సందర్భంగా తెలుగు భాషకు ఎందరో సాహితీవేత్తలు చేసిన ఎనలేని సేవలను గుర్తుచేసుకున్నారు. సాహితీమూర్తులు తరతరాలుగా మనకందించిన తెలుగు భాష, సాహిత్య సిరిసంపదలు ఎన్నటికి తరగని గని వంటివని, వాటిని భద్రంగా భావితరాలకు అందజేయాల్సిన బాధ్యత ప్రస్తుతం తరంపై ఉందన్నారు. ఈ విషయంలో తానా అన్ని వేళలా ముందుంటుందని ఆయన తెలియజేశారు. ఈ సమావేశంలో ‘వ్యక్తిత్వ వికాసానికి మార్గం-మాతృభాష’ అనే అంశంపై జరిగిన ఈ సమావేశంలో పాల్గొన్న ముఖ్య అతిథులకు నిర్వాహకులు డాక్టర్ ప్రసాద్ తోటకూర స్వాగతం పలికారు. తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ చిట్ల పార్థసారథి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. రిటైర్డ్ ఐఆర్ఎస్, అధికారి మేడిశెట్టి తిరుమల కుమార్, రిటైర్డ్ ఐఏఎస్ నందివెలుగు ముక్తేశ్వరరావు, తమిళనాడు డైరెక్టర్ ఆఫ్ ఎన్విరాన్‌మెంట్ పోలూరి రాజేశ్వరి, తెలంగాణ బీసీ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం, డాక్టర్ పట్నాల సుధాకర్, బెంగాల్ డీజీపీ బొప్పూడి నాగ రమేశ్ సహా పలువురు ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లు విశిష్ట అతిథులుగా హాజరయ్యారు. వీరిలో చాలా మంది తెలుగు మాధ్యమం, ఆంగ్ల మాధ్యమంలో చదువుకుని, సివిల్స్‌ను కూడా తెలుగు భాషలో రాసి విజయం సాధించి, వివిధ హోదాలలో రాణించారు. వీరంతా పిల్లలు ప్రాథమిక స్థాయిలో మాతృభాషలో చదువుకోవడం వల్ల వారికి అవగాహనా శక్తి పెరిగి, మానసిక వికాసం కలుగుతుందన్నారు. తద్వారా ఒక మంచి పునాది ఏర్పడి, ఆ తర్వాత అవసరాన్ని బట్టి ఎన్ని భాషలనైనా నేర్చుకోవడం సులభం అవుతుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. నేటి పోటీ ప్రపంచంలో ఆంగ్ల భాష ప్రాధాన్యతను ఎవ్వరూ విస్మరించలేనిదన్నారు. విద్యార్ధులు ఎన్ని భాషలు నేర్చినా ఆంగ్లంలో మంచి పట్టు సంపాదించాల్సిన అవసరం ఉన్నా తెలుగు భాష పట్ల నిర్లక్ష్యం తగదు అని స్పష్టం చేశారు. డాక్టర్ తోటకూర ప్రసాద్ వీరందరి అభిప్రాయాలతో ఏకీభవించారు. వారి వారి మాతృభాషలలో చదువుకున్న ఇతర రాష్ట్రాలకు చెందిన అఖిల భారత సర్వీసుల అధికారులు తెలుగు రాష్ట్రాలలో పనిచేస్తూ అవసరాన్ని బట్టి తెలుగును సులభంగా నేర్చుకోగల్గడం ఒక ప్రత్యక్ష ఉదాహరణ అన్నారు. పసితనంలో మాతృభాషలో చదువుకున్నవారి మానసిక వికాసం మెరుగుగా ఉంటుందనే విషయాన్ని మానసిక శాస్త్రవేత్తలు కూడా ధ్రువీకరిస్తున్నారని తెలిపారు. ప్రభుత్వాలు, ప్రసార మాధ్యమాలు, సంస్థలు, విద్యాలయాలు, తల్లిదండ్రులు, తెలుగు భాషాభిమానులు అందరూ కలసి పిల్లలకు బాల్యదశ నుంచే తెలుగు భాషపై అవగాహన, ఆసక్తి పెంపొందించే దిశగా కృషి చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఈ విషయంలో ఒక కార్యాచరణతో ముందుకు వెళ్లాల్సిన భాద్యత అందరిదీ అని తోటకూర ప్రసాద్ అన్నారు. తానా ప్రపంచ సాహిత్య వేదిక సమన్వయకర్త చిగురుమళ్ల శ్రీనివాస్ మాట్లాడుతూ.. ఈ నాటి సాహిత్య సమావేశం చాలా అర్ధవంతమైనది, అవసరమైనదని తమ అమూల్యమైన అభిప్రాయాలను వెలిబుచ్చిన అతిథులు, కార్యక్రమం విజయవంతం కావడానికి తోడ్పడిన మీడియా, కార్యకర్తలకు ప్రత్యేక కృతజ్ఞతలను తెలియజేశారు. సాహిత్య సదస్సు పూర్తి కార్యక్రమాన్ని ఈ కింది యూట్యూబ్ లింక్‌లో చూడవచ్చును.


By September 28, 2021 at 07:21AM


Read More https://telugu.samayam.com/latest-news/nri/mother-tongue-is-key-success-to-personality-development-program-orgnized-by-tana-prapancha-sahitya-vedika/articleshow/86573308.cms

No comments