మా నిఘా వైఫల్యమే.. కాబూల్ డ్రోన్ దాడిపై ఎట్టకేలకు తప్పు ఒప్పుకున్న అమెరికా
అఫ్గనిస్థాన్ రాజధాని కాబుల్‌లో గత నెల 29న జరిపిన డ్రోన్ దాడికి సంబంధించి అమెరికా ఎట్టకేలకు తన తప్పును ఒప్పుకుంది. ఆ డ్రోన్ దాడిలో కేవలం సాధారణ పౌరులే చనిపోయినట్లు తమ అంతర్గత సమీక్షలో తేలిందని శుక్రవారం వెల్లడించింది. కాబుల్ విమానాశ్రయంవైపు పేలుడు పదార్థాలతో దూసుకొస్తున్న వాహనంపై తాము డ్రోన్ దాడి చేశామని, అందులో ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాది హతమయ్యాడని అమెరికా బలగాలు తొలుత వాదించాయి. ఆ దాడిలో చిన్నారులు సహా సాధారణ పౌరులే ప్రాణాలు కోల్పోయారన్న వార్తలను ఇన్నాళ్లూ ఖండించాయి. ఆగస్టు 29న అమెరికా జరిపిన డ్రోన్ దాడిలో చిన్నారులు సహా 10 మంది పౌరులు చనిపోయారు. అఫ్గనిస్థాన్‌లో 20 ఏళ్ల అమెరికా యుద్ధానికి ఈ దాడి ఒక భయంకరమైన ఘటన.. కాబూల్ విమానాశ్రయంవైపు దూసుకొస్తున్న ఐఎస్ ఆపరేషన్ విషయంలో అమెరికా నిఘా వర్గాలు సహేతుకమైన నిశ్చయంతో ఉన్నాని యూఎస్ సెంట్రల్ కమాండ్ జనరల్ కెన్నెత్ మెకెంజీ అన్నారు. ఈ దాడి ఓ విషాదకరమైన తప్పిందమని ఆయన విచారం వ్యక్తం చేశారు. డ్రోన్ దాడిలో చనిపోయినవారి కుటుంబసభ్యులు, బంధువులకు అమెరికా రక్షణ శాఖ మంత్రి లాయిడ్ ఆస్టిన్ క్షమాపణలు చెప్పారు. ‘డ్రోన్ దాడిలో చనిపోయినవారి కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నాను.. "మేము క్షమాపణలు కోరుతున్నాం.. ఈ భయంకరమైన తప్పు నుంచి నేర్చుకోవడానికి మేం ప్రయత్నిస్తాం’ అని అన్నారు. దాడిలో ప్రాణాలు కోల్పోయినవారి కుటుంబాలకు ఏ విధంగా న్యాయం చేయాలనేది ప్రభుత్వం పరిశీలిస్తోందని మెకెంజీ తెలిపారు. ‘ఆగస్టు 29న అమెరికా దళాలు ఎనిమిది గంటల పాటు ఓ ప్రాంతంలో గమనించి తెల్ల టయోటా వాహనాన్ని గుర్తించి, అక్కడ నుంచి కాబూల్ విమానాశ్రయంపై దాడికి ఐఎస్ ఉగ్రవాదులు ప్రయత్నిస్తున్నారని భావించారు.. మేము ఎంచుకున్న లక్ష్యం ఉన్న ప్రాంతంలో దాని కదలిక ఆధారంగా కారుపై దాడిచేశాం... ఈ విషయంలో నిఘా వర్గాల అంచనా విఫలమయ్యింది’ అన్నారు. ఆగస్టు 26న ఐఎస్-కే ఫిదాయిలు కాబూల్ విమానాశ్రయం వద్ద ఆత్మాహుతి దాడికి పాల్పడిన ఘటనలో 13 మంది అమెరికా సైనికులు సహా 180 మంది వరకూ ప్రాణాలు కోల్పోయారు. కాబూల్‌ను తాలిబన్లు ఆక్రమించుకున్న తర్వాత దేశం విడిచి వెళ్లాలనే తాపత్రయంలో పెద్ద ఎత్తున విమానాశ్రయానికి చేరుకున్న అఫ్గన్లు.. ఈ సమయంలో ప్రాణాలు పోయినా వెనుకాడలేదు.
By September 18, 2021 at 12:04PM
No comments