Breaking News

భవానీపూర్‌లో పోటీకి సిద్ధం.. దీదీకి మరోసారి సువేందు సవాల్!


బెంగాల్‌లోని మూడు అసెంబ్లీ స్థానాలకు సెప్టెంబరు 30 ఉప-ఎన్నిక జరగనుండగా.. ముఖ్యమంత్రి మమతా బెనర్జీ భవానీపూర్ నుంచి పోటీచేయనున్నారు. ఈ ఏడాది ఏప్రిల్-మే నెలలో జరిగిన పశ్చిమ్ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ 213 స్థానాల్లో విజయం సాధించి వరుసగా మూడోసారి అధికారం చేపట్టినా.. మమతా మాత్రం నందిగ్రామ్‌లో ఓటమి చూవిచూశారు. ఈ నేపథ్యంలో తన సొంత నియోజవర్గం భవానీపూర్ నుంచి దీదీ ఈసారి తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ఇదిలా ఉండగా, నందిగ్రామ్‌లో మమతా బెనర్జీని ఓడించిన నేత, ఒకప్పుడు కుడిభుజంగా ఉన్న నేత మరోసారి సవాల్ విసిరారు. పార్టీ అధిష్ఠానం ఆదేశిస్తే భవానీపూర్ నుంచి బీజేపీ అభ్యర్థిగా మమతపై పోటీచేస్తానని ప్రకటించారు. నాడియాలో ఆదివారం జరిగిన ఓ కార్యక్రమంలో సువేందు మాట్లాడుతూ.. నందిగ్రామ్‌లో ఏం జరిగిందో తెలుసుగా.. 1956 ఓట్లతో సీఎం నా చేతిలో ఓడిపోయారని గుర్తుచేశారు. భవానీపూర్‌లో పోటీచేయాలని అధినాయకత్వం కోరితే తప్పకుండా బరిలోకి దిగుతానని ప్రకటించారు. అయితే, బెంగాల్ బీజేపీ అధ్యక్షుడు దిలీప్ ఘోష్ మాత్రం భవానీపూర్ నుంచి సువేందు అధికారి పోటీచేయరని తెలిపారు. మూడు స్థానాల్లో పోటీచేసే బీజేపీ అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ కొనసాగుతోందని పేర్కొన్నారు. బీజేపీ ఎన్నికల కమిటీ మంగళవారం సమావేశమై అభ్యర్థులను ఖరారుచేయనుందని దిలీప్ ఘోష్ చెప్పారు. మరోవైపు, భవానీపూర్ నుంచి సెప్టెంబరు 8న మమతా బెనర్జీ నామినేషన్ దాఖలు చేయనున్నారు. గతంలో ఈ నియోజకవర్గం నుంచే పలుసార్లు ఆమె విజయం సాధించారు. బీజేపీ బెంగాల్ వ్యవహారాల సహ- ఇంఛార్జ్ అమిత్ మాలవీయ మాట్లాడుతూ.. నందిగ్రామ్‌లో ఫలితమే పునరావృతమవుతుందని, మమతా బెనర్జీకి పరాభవం తప్పదని జోస్యం చెప్పారు. ‘ఓటమి తప్పదని భావించి మమతా బెనర్జీ భవానీపూర్‌ను వదలిపెట్టి నందిగ్రామ్‌కు పారిపోయారు.. బీజేపీ అభ్యర్థి సువేందు అధికారి చేతిలో ఓడిపోయారు. ఆమె ఇప్పుడు భవానీపూర్ నుంచి విజయం సాధిస్తానని ఆశిస్తున్నారు? ఈ ఉప ఎన్నికలో నందిగ్రామ్‌‌లో పట్టిన గతి పడుతుంది. ఇది బీజేపీ గెలుపు కోసం చేసే పోటీ’ అని ట్వీట్ చేశారు.


By September 07, 2021 at 07:16AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/if-the-party-asks-me-to-contest-from-bhowanipore-i-will-ready-says-suvendu-adhikari/articleshow/85995980.cms

No comments