Breaking News

పైలట్ తప్పిదం వల్లే కోజికోడ్ విమాన ప్రమాదం.. ఎయిరిండియా సంచలన నివేదిక


గతేడాది కోజికోడ్ విమానాశ్రయంలో ఘోర ప్రమాదం సంభవించి 21 మంది దుర్మరణం చెందిన విషయం తెలిసిందే. గత ఆగస్టు 7న దుబాయ్‌ నుంచి వచ్చిన ఎయిరిండియా విమానం కోజికోడ్‌ విమానాశ్రయంలో ల్యాండ్‌ అయ్యే సమయంలో అదుపు తప్పి రన్‌వేను దాటి వెళ్లిపోయి లోయలో పడింది. ఈ ఘటనలో విమానం ముక్కలు కావడంతో ఇద్దరు పైలట్లు సహా 21 మంది ప్రాణాలు కోల్పోయారు. తాజాగా, ఈ విమాన ప్రమాదంపై నివేదికను కేంద్ర పౌరవిమానయాన శాఖ బహిర్గతం చేసింది. విమాన ఆపరేటింగ్‌లో పైలట్ ప్రమాణ విధానాన్ని పాటించకపోవడమే ప్రమాదానికి కారణమని ప్రభుత్వ నివేదిక పేర్కొంది. ‘పైలట్ ప్రామాణిక ఆపరేటింగ్ విధానాన్ని పాటించకపోవడే ప్రమాదానికి కారణం.. అతను స్థిరమైన విధానాన్ని కొనసాగించాడు.. ‘గో అరౌండ్’ సూచనలు చేసినప్పటికీ రన్‌వేకి సగం దూరంలోని టచ్‌డౌన్ జోన్ దాటి నియంత్రణ కోల్పోయాడు’ అని 257 పేజీల నివేదికను విమాన ప్రమాద దర్యాప్తు బృందం సమర్పించింది. విమానాన్ని పైలట్లు సురక్షితంగా నిలిపివేయలేకపోతున్నారని భావిస్తే ల్యాండింగ్‌‌కు ముందు లేదా తర్వాత నిలిపివేయడాన్ని 'గో అరౌండ్' అంటారు. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్‌కు తమ నిర్ణీత ల్యాండింగ్‌ని నిలిపివేసే పైలట్ నిర్ణయాన్ని ఇది తెలియజేస్తుంది. ప్రమాదాలపై దర్యాప్తు చేసే పౌర విమానయాన మంత్రిత్వ శాఖకు చెందిన ఎయిర్‌క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో.. కోజికోడ్ ప్రమాదంలో వ్యవస్థాగత వైఫల్యాల పాత్రను విస్మరించలేమని కూడా తన నివేదికలో పేర్కొంది. ‘రన్‌వే 10 కి చేరుకోవడానికి ముందు పైలట్ ఇన్ కమాండ్ వర్షం, ఈదురు గాలులు పడుతున్నా రన్‌వే‌పై ల్యాండింగ్‌కు తగిన సూచనలు చేయలేదు.. ల్యాండింగ్ దూరం విస్మరించారు. వాతావరణ పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నప్పుడు ఒకవేళ రెండోసారి ల్యాండింగ్‌కు ప్రయత్నించి విఫలమయితే ప్రత్యామ్నాయ రన్‌వే డైవర్షన్‌కు చాలా అనుకూలంగా ఉంటాయి.. దీనిని పూర్తిగా ఉల్లంఘించారు’ అని తెలిపింది. ‘సిబ్బందికి అనుభవం ఉంది.. భారతీయ రుతుపవనాల పరిస్థితులలో తరచుగా పనిచేస్తున్నారు.. కోజికోడ్ ప్రతికూల వాతావరణ ప్రామాణిక ఆపరేటింగ్ విధానాల గురించి వారికి తెలుసు.. రన్‌వే 28 లో 'మిస్డ్ అప్రోచ్' తర్వాత దారి మళ్లించకూడదని పైలట్ ఇన్ కమాండ్ నిర్ణయం తీసుకుంది’ అని పేర్కొంది. దుబాయ్‌‌లో బయలుదేరిన బోయింగ్ 737 విమాన ప్రయాణం కోజికోడ్‌ వరకు సజావుగానే సాగింది. కొజికోడ్ విమానాశ్రయంలోని టేబుల్ టాప్ విమానాశ్రయంలో ల్యాండ్ అయిన తర్వాత రన్‌వే మీద నుంచి జారీ లోయలోకి దూసుకెళ్లింది. అయితే ఈ ప్రమాదానికి ముందు విమానాన్ని సురక్షితంగా దింపడానికి పైలట్ రెండు సార్లు ప్రయత్నించినట్లు ఆ మ్యాప్‌ వెల్లడించింది. పైలట్ అంతగా ప్రయత్నించినా.. ప్రమాదం మాత్రం తప్పలేదు. ఈ విషయాన్ని స్వీడన్‌కు చెందిన ఫ్లైట్‌ట్రాకర్ 24 అనే సంస్థ ట్రాకింగ్ సమాచారాన్నంతా ఒక మ్యాప్‌ రూపంలో అందించింది.


By September 12, 2021 at 09:47AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/pilot-error-led-to-air-india-express-crash-in-kozhikode-of-kerala-says-report/articleshow/86133608.cms

No comments