Breaking News

తానా ఆధ్వర్యంలో తెలంగాణ భాషా దినోత్సవ వేడుకలు.. వర్చువల్‌గా పాల్గొన్న పలువురు ప్రముఖులు


ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) సాహితీ విభాగం తానా ప్రపంచ సాహిత్య వేదిక ఆధ్వర్యంలో ప్రజాకవి కాళోజీ నారాయణ రావు గారి జయంతి సందర్భంగా తెలంగాణా భాషా దినోత్సవ వేడుకలను వర్చువల్‌‌గా నిర్వహించారు. తానా ప్రపంచ సాహిత్య వేదిక కోసం ప్రముఖ తెలుగువేదకవి జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు రచించిన తెలుగు వైభవ గీతానికి సంగీత దర్శకులు నేమాని పార్థసారథి స్వరకల్పనలో అమర గాయకులు ఎస్పీ బాలసుబ్రమణ్యం ఆలపించిన ప్రత్యేక దృశ్య గీతంతో సభను ప్రారంభించారు. తానా అధ్యక్షులు లావు అంజయ్య చౌదరి సాహితీవేత్త కాళోజికి ఘన నివాళులర్పించారు. తెలంగాణా భాషా దినోత్సవ వేడుకలను జరుపుకుంటున్న బషాభిమానులందరికీ శుభాకాంక్షలు తెలిపారు. సమావేశం పాల్గొనే విశిష్ఠ అతిథులకు స్వాగతం పలికి సభను ప్రారంభించారు. తానా ప్రపంచ సాహిత్య వేదిక సమన్వయకర్త చిగురుమళ్ల శ్రీనివాస్ మాట్లాడుతూ.. తెలంగాణ వ్యాప్తంగా తెలంగాణా భాషా దినోత్సవ వేడుకలను వైభవంగా జరుపుకుంటున్న ఈ తరుణంలో విదేశంలో ఉంటూ కూడా మాతృభాష మీద మమకారంతో వైవిధ్యభరితంగా ఈ వేడుకలను తానా జరుపుకోవడం విశేషం అన్నారు. తానా ప్రపంచ సాహిత్య వేదిక నిర్వాహకులు డాక్టర్ ప్రసాద్ తోటకూర మాట్లాడుతూ.. కాళోజీ నారాయణరావు సాహిత్య సేవను గుర్తుచేసుకున్నారు. తెలుగు, ఉర్దూ, హిందీ, మరాఠీ, కన్నడ, ఆంగ్ల భాషల్లో రచయితగా ప్రఖ్యాతిగాంచిన కవి.. సమకాలీన సామాజిక సమస్యలపై నిర్మొహమాటంగా, నిక్కచ్చిగా, కటువుగా స్పందిస్తూ తెలంగాణా ప్రజల ఆర్తి, ఆవేదన, ఆగ్రహాన్ని తన రచనలలో పొందుపరచి, నిజాం ప్రభుత్వ దమన నీతి, నిరంకుశత్వం, అరాచక పాలనకు వ్యతిరేకంగా తన కలాన్ని ఎత్తి గళాన్ని విన్పించారు.. పాలకులపై అక్షరాయుధాలను సంధించి ప్రజాకవిగా కీర్తిగడించిన స్వాతంత్ర్య సమరయోధుడు, తెలంగాణా ఉద్యమకారుడు కాళోజీ నారాయణ రావు’ అన్నారు. ఆయన జయంతిని తెలంగాణా భాషా దినోత్సవంగా జరుపుకోవడం ముదావహం అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సాంస్కృతిక సలహాదారు డాక్టర్ కేవీ రమణాచారి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అందరికీ తెలంగాణా భాషా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన ఆయన.. తానా చేస్తున్న భాషా సేవకు తన సందేశంలో ధన్యవాదాలు తెలియజేశారు. తెలుగు భాషకోసం, తెలంగాణా సంస్కృతి పరిరక్షణ కోసం తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని ముఖ్య అతిథిగా పాల్గొన్న టీఆర్ఎస్ ఎమ్మెల్యే, తెలంగాణా సాంస్కృతిక సారధి రసమయి బాలకిషన్ అన్నారు. విశిష్ఠ అతిథిగా పాల్గొన్న ఆకాశవాణి డైరెక్టర్ జనరల్ నూకల వేణుధర్ రెడ్డి తెలంగాణాలో జన్మించిన సాహితీవేత్తలను గుర్తుచేసుకుంటూ ప్రజలందరికి తెలంగాణా భాషా దినోత్సవ శుభాకాంక్షలను తెలియజేశారు. మాజీ ప్రధాని పీవీ నరసింహారావు గారి కుమార్తె ప్రముఖ విద్యావేత్త, చిత్రకారిణి, ఎమ్మెల్సీ సురభి వాణీ దేవి ముఖ్య అతిథిగా పాల్గొని తమ తండ్రి, కుటుంబ నేపథ్యం, రాజకీయ ప్రస్థానం, సాహిత్యాభిలాష, స్నేహితులతో ఆయన మెలిగిన తీరును ఎంతో హృద్యంగా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో సురవరం ప్రతాపరెడ్డి కుమారుడు డాక్టర్ సురవరం కృష్ణ వర్ధన్, రచయిత, గాయకుడు సుద్దాల అశోక్ తేజ, రచయత్రి డాక్టర్ పాకాల లక్ష్మి, కవి దుర్గయ్య కుమారులు, పద్మభూషణ్ సి నారాయణ రెడ్డి మనవడు సందడి లయ చరణ్, దాశరథి రంగాచార్య కుటుంబం తరపున మడిపల్లి దక్షిణా మూర్తి పాల్గొన్నారు. తెలంగాణా గడ్డపై జన్మించిన ఎంతోమంది లబ్ద ప్రతిష్టులై విశిష్ట సాహితీవేత్తలు, ఆ నాటి సామాజిక పరిస్ధితులు, వారి జీవన విధానం సహా రచయితలతో వారి అనుబంధం, సాహిత్య సృష్టి పుస్తకాలలో లభ్యంకాని ఎన్నో ఆసక్తికరమైన విషయాలను ఈ సభలో వారి కుటుంబ సభ్యులే పాల్గొని పంచుకోవడం సాహిత్య చరిత్రలోనే ఒక సరికొత్త కోణమని డాక్టర్ తోటకూర ప్రసాద్ ధన్యవాదములు తెలియజేశారు.


By September 10, 2021 at 09:57AM


Read More https://telugu.samayam.com/latest-news/nri/tana-celebrations-telangana-bhasha-dinotsavam-occasion-of-kaloji-narayana-rao-jayanthi/articleshow/86087367.cms

No comments