Breaking News

అఫ్గన్‌లో అనూహ్య పరిణామం: తాలిబన్ కూటమిలో ఘర్షణ.. బరాదర్‌కు గాయాలు!


అఫ్గనిస్థాన్‌ను ఆక్రమించుకున్న తాలిబన్ల మధ్య విబేధాలు తలెత్తాయా? అంటే అవుననే సమాధానం వినబడుతోంది. తమ మిత్రపక్షం హక్కానీ నెట్‌వర్క్, తాలిబన్లకు మధ్య శుక్రవారం రాత్రి ఘర్షణ చోటుచేసుకున్నట్టు తెలుస్తోంది. ఈ ఘర్షణలో సహ-వ్యవస్థాపకుడు ముల్లాహ్ అబ్దుల్ ఘనీ బరాదర్‌కు గాయాలైనట్టు సమాచారం. ఈ గొడవ కారణంగానే పాకిస్థాన్ గూఢచారి సంస్థ ఐఎస్ఐ చీఫ్ లెఫ్టినెంట్ జనరల్ ఫైజ్ హమీద్ హుటాహుటిన శనివారం అఫ్గనిస్థాన్‌కు చేరుకున్నారని స్థానిక మీడియాలో ప్రచారం జరుగుతోంది. కాబూల్ విమానాశ్రయంలో దిగిన తర్వాత మీడియాతో మాట్లాడుతూ.. ‘ఆందోళన అక్కర్లేదు.. అంతా సర్దుకుంటుంది’ అని హమీద్ వ్యాఖ్యానించారు. ఒకవేళ మీరు తాలిబన్ నాయకత్వంతో భేటీ అవుతారా? అని ప్రశ్నించగా... పక్కనే ఉన్న పాక్ రాయబారి మన్సూర్ అహ్మద్ ఖాన్‌ వైపు చూస్తూ ‘నేను ఇప్పుడే వచ్చాను కదా.. అఫ్గన్‌లో శాంతి, స్థిరత్వం కోసం మేము పనిచేస్తాం’అని సమాధానం ఇచ్చారు. అఫ్గన్‌ను తాలిబన్లు స్వాధీనం చేసుకున్న తర్వాత పాక్‌కు చెందిన ఓ ఉన్నతస్థాయి వ్యక్తి అక్కడ పర్యటించడం ఇదే మొదటిసారి. హైబతుల్లా అఖుంద్‌జాదాను అత్యున్నత నాయకుడిగా ఎన్నుకోవడంపై మిత్రపక్షాల మధ్య వివాదం మరింత తీవ్రం కావడంతో తాలిబాన్ నేతలు తొందరపడినట్టు తెలుస్తోంది. బరాదర్, అనస్ హక్కానీ మధ్య ఆధిపత్య పోరు ఫలితంగా శుక్రవారం రాత్రి కాబూల్‌లో కాల్పులు జరిగాయని పంజ్‌షీర్‌కు చెందిన ఓ వ్యక్తి ట్వీట్ చేసినట్టు ఏఎన్ఐ వార్తా సంస్థ పేర్కొంది. అమెరికాకు చెందిన 19fortyfive.com అనే వెబ్‌సైట్‌లో ప్రముఖ్య సంస్థ అధికారి మైఖేల్ రాబిన్ తెలిపిన ప్రకారం.. సెప్టెంబరు 3న ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయాలనుకున్న తాలిబన్‌ల లక్ష్యం నెరవేరలేదు.. ఎందుకంటే అఖుంద్‌జాదాను అత్యున్నత నేతగా హక్కానీ, ఇతర మిత్రపక్షాలు అంగీకరించలేదు అని పేర్కొంది. ప్రభుత్వ ఏర్పాటులో జాప్యానికి తాలిబన్ల మధ్య విభేదాలు తారాస్థాయికి చేరాయనడానికి సంకేతమని ఆయన అన్నారు. కొత్తగా ఏర్పడిన అఫ్గన్ సంక్షోభంలో ఐఎస్ఐ బహిరంగ జోక్యం ఉన్నట్లు స్పష్టమవుతోంది. దీనిపై అఫ్గన్ మాజీ వైస్ ప్రెసిడెంట్ అమ్రుల్లా సలేహ్ బ్రిటన్‌కు చెందిన డైలీ మెయిల్‌‌తో మాట్లాడుతూ.. తాలిబన్లను ఐఎస్ఐ నడిపిస్తోందని ఆరోపించారు. తాలిబాన్ ప్రతినిధికి పాక్ రాయబార కార్యాలయం ప్రతి గంటకు ఆదేశాలు అందుతాయి అని అన్నారు.


By September 06, 2021 at 07:40AM


Read More https://telugu.samayam.com/latest-news/international-news/afghanistan-crisis-talibans-mullah-baradar-hurt-in-clash-with-haqqanis-says-report/articleshow/85965509.cms

No comments