Breaking News

నరేంద్రగిరి కేసులో విస్తుపోయే విషయాలు.. సూసైడ్ నోట్‌తో శిష్యుడి కుట్ర బట్టబయలు


అఖిల భారతీయ అఖాడా పరిషత్‌ అధ్యక్షుడు మహంత్‌ నరేంద్రగిరి అనుమానాస్పద మృతి అనంతరం విస్తుపోయే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఉత్తర్‌ప్రదేశ్‌ ప్రయాగ్‌రాజ్‌లోని బాఘంబరి మఠం అతిథి గృహంలో సోమవారం ఆయన పైకప్పునకు వేలాడుతూ కనిపించారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు గదిని పరిశీలించగా 8 పేజీల లేఖ ఒకటి లభించింది. అది మహంత్‌ నరేంద్ర రాసినదిగా ప్రయాగ్‌రాజ్‌ పోలీస్‌ ఇన్‌స్పెక్టర్‌ జనరల్‌ కె.పి.సింగ్‌ తెలిపారు. తొలుత ఆయన మృతిని పోలీసులు ఆత్మహత్యగా భావించగా... సూసైడ్ నోట్‌‌లోని అంశాలను పూర్తిగా పరిశీలించి, అనంతరం ఆశ్రమంలోని శిష్యులను విచారించగా పలు అనుమానాస్పద విషయాలు వెలుగులోకి వచ్చాయి. తన శిష్యుడు ఆనంద్‌ గిరి బ్లాక్‌మెయిల్‌ చేయడంతో మనస్తాపం చెంది ఆత్మహత్యకు పాల్పడినట్లు నరేంద్రగిరి సూసైడ్‌ నోట్‌లో పేర్కొన్నట్లు పోలీసులు వెల్లడించారు. ‘ఆనంద్‌గిరి కారణంగా తీవ్ర మనోవేదనకు గురయ్యా. సెప్టెంబర్‌ 13వ తేదీ రోజునే తనవు చాలించాలనుకున్నా. కానీ ధైర్యం సరిపోలేదు. కంప్యూటర్‌ సాయంతో.. ఓ మహిళతో నేను కలిసి ఉన్నట్లు ఫోటో మార్ఫింగ్ చేసినన్ను బ్లాక్‌మెయిల్‌ చేసేందుకు ఆనంద్‌గిరి సిద్ధమైనట్లు నాకు తెలిసింది. ఇది నన్ను కలవరపెడుతోంది. ఇప్పటివరకు ఎంత గౌరవంగా జీవించాను. అపఖ్యాతితో జీవించలేను. అందుకే తనువు చాలిస్తున్నా’ అని నరేంద్రగిరి మృతదేహం వద్ద లభించిన సూసైడ్‌ నోట్‌లో ఉన్నట్లు పోలీసులు పేర్కొన్నారు. తన ఆత్మహత్యకు శిష్యుడు ఆనంద్‌గిరితో పాటు మరో ఆధ్య తివారి, అతడి కుమారుడు సందీప్‌ తివారి కారణమని నరేంద్రగిరి సూసైడ్‌ నోట్‌లో రాసినట్లు పోలీసు వర్గాలు వెల్లడించాయి. ‘నా మరణానికి కారణమైన వారిపై ప్రయాగ్‌రాజ్‌ పోలీసులు చర్యలు తీసుకోవాలి. అప్పుడే నా ఆత్మ శాంతిస్తుంది’ అని నరేంద్రగిరి సూసైడ్‌ నోట్‌లో రాసినట్లు పోలీసులు తెలిపారు. నరేంద్రగిరి మరణంపై, ఆయన ఆత్మహత్య లేఖపై పలువురు సాధువులు అనుమానాలు వ్యక్తంచేయడంతో కేసు దర్యాప్తునకు యూపీ ప్రభుత్వం సిట్‌ ఏర్పాటు చేసింది. వెంటనే రంగంలోకి దిగిన సిట్‌ పోలీసులు సోమవారం రాత్రి హరిద్వార్‌లో ఆనంద్‌గిరిని అరెస్టుచేశారు. ఆయనపై ఐపీసీ 360 సెక్షన్‌ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


By September 22, 2021 at 08:31AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/mahant-narendra-giri-blames-accused-anand-giri-several-others-in-suicide-note/articleshow/86416239.cms

No comments