ట్రైబ్యునళ్లలో ఖాళీల భర్తీ.. కేంద్రం తీరుపై మరోసారి చీఫ్ జస్టిస్ ఘాటు వ్యాఖ్యలు
ట్రైబ్యునళ్లలో నియమాకాల భర్తీ వ్యవహారంలో మరోసారి కేంద్రంపై సర్వోన్నత న్యాయస్థానం తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. ఈ అంశంపై బుధవారం జరిగిన విచారణలో ప్రభుత్వం తీరు సంతృప్తికరంగా లేదని ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం ఘాటు వ్యాఖ్యలు చేసింది. ఖాళీల భర్తీ, సభ్యుల ఎంపిక విధానం కూడా గందరగోళంగా ఉందని మండిపడింది. నియమాకాలు అర్థం కావడంలేదని, మనం ప్రజాస్వామ్య దేశంలో ఉన్నామని సీజేఐ వ్యాఖ్యానించారు. ‘జాతీయ కంపెనీ లా ట్రైబ్యునల్ (ఎన్‌సీఎల్టీ) నియమాకాలు చూస్తే చాలా సిఫార్సులు ఉన్నాయి.. కానీ, భర్తీలో నిబంధనలు పాటించలేదు.. ఇదేమి ఎంపిక? ఇన్‌కమ్ ట్యాక్స్ అప్పిలేట్ ట్రైబ్యునల్ (ఐటీఏటీ) సభ్యుల భర్తీ తీరు కూడా అలాగే ఉంది.. తీసుకున్న ఈ నిర్ణయాలపై మేం తీవ్ర అసంతృప్తిగా ఉన్నాం.. ఎన్‌సీఎల్టీ ఎంపిక కమిటీలో నేనూ సభ్యుడిగా ఉన్నాను.. జ్యుడీషియల్ సభ్యులు 11 మంది, టెక్నికల్ సభ్యుల 10 మంది నియమాకం కోసం మొత్తం 544 మందిని ఇంటర్వ్యూ చేశాం... వీరిలో కొంత మందిని మాత్రమే ప్రభుత్వం నియమించింది.. మిగతావారిని వెయిటింగ్ లిస్ట్‌లో ఉంచింది’ అని జస్టిస్ ఎన్వీ రమణ వ్యాఖ్యానించారు. ఖాళీల భర్తీకి రెండేళ్లు తీసుకున్నారని, ఆలస్యానికి కరోనా సహా అనేక సాకులు చెబుతున్నారని చీఫ్ జస్టిస్ మండిపడ్డాడు. నియామకాలు రాజ్యాంగ నిబంధనలకు లోబడి ఉండాలి... ఒక ఏడాది పనిచేయడానికి జ్యుడీషియరీ నుంచి ఎవరైనా వస్తారా? అని ప్రశ్నించారు. ట్రైబ్యునళ్లలో పదవుల భర్తీలో జాప్యం వల్ల ఖాళీల సంఖ్య పెరుగుతుందని పేర్కొన్నారు. అంతేకాదు, ట్రైబ్యునళ్ల నియామకాల భర్తీలో ప్రతిసారీ ఇలాగే ప్రవర్తిస్తున్నారని జస్టిస్ ఎన్వీ రమణ వ్యాఖ్యానించారు. కోర్టు దిక్కరణ పిటిషన్ విచారణ సందర్భంగా ఏదో ఒకటి చెప్పడం అలవాటైపోయిందని అన్నారు. ఈ సందర్భంగా అన్ని అంశాలను పరిగణలోకి తీసుకుని వారంలో కౌంటర్ దాఖలు చేస్తామని అడ్వకేట్ జనరల్ చెప్పగా.. అదొక్కటే సమస్యకు పరిష్కారం కాదని ఎన్‌వి రమణ అభిప్రాయం వ్యక్తం చేశారు. ప్రభుత్వం నియామకాలు చేపట్టడం ఒక్కటే పరిష్కారమని సూచించారు. సమస్యలు అందరికీ తెలుసునని, కావాల్సింది పరిష్కారమని ఉద్ఘాటించారు. ఇప్పటికే చాలా సహనంతో ఉన్నామని, మరికొంత ఓపిక పట్టగలమని అన్నారు. కోర్టు ఉత్తర్వులు రాకముందే నియామకాలు చేపడితే అందరికీ మంచిదన్నారు. రెండువారాల్లో స్పష్టత ఇవ్వకపోతే తగిన ఆదేశాలు జారీ చేస్తామని జస్టిస్ ఎన్వీ రమణ ధర్మాసనం స్పష్టం చేసింది. జాతీయ గిరిజన కమిషన్ నియామకంలో ఇలాగే వ్యవహరించారని కేంద్రం తీరును తప్పుబట్టారు. డిఆర్టీ కేసుల విషయంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలు కోల్‌కతా వెళ్లాల్సి వస్తోందన్నారు. అక్కడైనా శాశ్వత సభ్యులున్నారా? జబల్‌పూర్ నుంచి ఇంఛార్జ్‌గా వ్యవహరిస్తున్నారని అసహనం వ్యక్తం చేశారు. ఇలాగే చేస్తే.. సమస్యల పరిష్కారం ఎప్పటికి సాధ్యం అవుతుందని నిలదీశారు. అటార్నీ కోరిన విధంగా రెండు వారాలు వాయిదా వేస్తామని, అప్పటిలోగా నియామకాలను పూర్తిచేయాలని స్పష్టం చేశారు. ఇదొక్కటే సమస్యకు పరిష్కారమని జస్టిస్ ఎన్‌వి రమణ అన్నారు. ‘నియమాక పత్రాలతో రావాలని.. ఒకవేళ ఎవరినైనా నియమించకపోతే సహేతుకమైన కారణం ఉండాలి’ అని అన్నారు.
By September 16, 2021 at 07:16AM
No comments