Breaking News

కశ్మీర్ వేర్పాటువాద నేత గిలానీ మృతదేహంపై పాకిస్థాన్ జెండా!


ఇటీవల కన్నుమూసిన వేర్పాటువాద నేత మృతదేహంపై పాక్ జెండాతో కప్పి ఉంచిన వీడియోలు ఇంటర్నెట్‌లో దర్శనమివ్వడం కలకలం రేగుతోంది. అంత్యక్రియలకు ముందు ఆయన మృతదేహంపై కప్పి ఉండగా.. చుట్టూ చాలా మంది గుమిగూడి ఉన్నట్టు వీడియోలో కనిపిస్తోంది. ఈ ఘటనపై తీవ్రంగా స్పందించిన జమ్మూ కశ్మీర్ పోలీసులు.. ఉపా చట్టం కింద కేసు నమోదుచేశారు. ఇది తీవ్రవాదాన్ని ప్రోత్సహించేలా ఉందని పోలీసులు పేర్కొన్నారు. సయ్యద్ అలీ షా గిలానీ (92) బుధవారం సాయంత్రం కన్నుమూసిన విషయం తెలిసిందే. ఆయన మరణంతో కశ్మీర్‌లో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా ఇంటర్నెట్ సేవలను అధికారులు రెండు రోజుల పాటు నిలిపివేశారు. అయితే, శనివారం రాత్రి ఇంటర్నెట్ పునరుద్ధరించిన తర్వాత గిలానీపై పాక్ జెండాను కప్పి ఉంచి వీడియోలు బయటకు వచ్చాయి. ఓ వీడియో ప్రకారం సయ్యద్ అలీ షా గిలానీ నివాసంలో ఆయన మృతదేహంపై పాక్ జెండా కప్పి ఉంచగా.. ఆయన చుట్టూ చాలా మంది వీరిలో ఎక్కువ మహిళలు గుమిగూడి ఉన్నారు. గదిలో గందరగోళం నెలకుని.. నినాదాలు వినబడుతున్నాయి.. ఇదే సమయంలో పోలీసులు తలుపులు నెట్టడం.. మధ్య మహిళలు ప్రతిఘటించినట్లు కనిపిస్తుంది. సాయుధ పోలీసులు ఆ గదిలోకి ప్రవేశించడం... ఆ గోడలపై మతపరమైన శ్లోకాలు రాసి ఉన్నాయి. గిలానీ అంత్యక్రియలను గురువారం తెల్లవారకముందే పూర్తిచేశారు. పోలీసులు బలవంతంగా మృతదేహాన్ని తరలించి, అంత్యక్రియలకు మమ్మల్ని కూడా అనుమతించలేదని గిలానీ కుటుంబసభ్యులు ఆరోపించారు. తాజా ఘటనపై జాతి వ్యతిరేక చర్యలకు పాల్పడినట్టు ఎఫ్ఐఆర్ నమోదుచేశామని జమ్మూ కశ్మీర్ డీజీపీ దిల్బాగ్ సింగ్ తెలిపారు. గిలానీ ఇంటి వద్ద సీనియర్ పోలీస్ అధికారి, ఇతర పోలీసులతో దురుసగా ప్రవర్తించారని, భారత్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారని ఆయన చెప్పారు. ‘ముఖ్యంగా గిలానీ సాహబ్, ఆయన కుటుంబంతో పోలీసులు నిరంతరం టచ్ ఉన్నందున, ఆయన ఇంటి వద్ద ఇలాంటి వికృత ప్రవర్తనను మేము ఎన్నడూ ఊహించలేదు. వాస్తవానికి, గిలానీ సాహాబ్‌ను చివరిసారిగా మా అధికారి కలిసినప్పుడు అతడికి ఒక పుస్తకాన్ని బహుమతిగా ఇచ్చారు’ అని పేర్కొన్నారు. గిలానీ కుటుంబసభ్యుల వాదన మరోలా ఉంది. పోలీసులే మహిళతో అసభ్యంగా ప్రవర్తించి, బలవంతంగా మృతదేహాన్ని తీసుకెళ్లారని ఆరోపిస్తున్నారు.


By September 05, 2021 at 06:56AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/kashmir-separatist-syed-ali-shah-geelanis-body-in-pak-flag-police-case-filed/articleshow/85940265.cms

No comments