Breaking News

వరించిన అదృష్టం.. వలలో అరుదైన చేపలు.. రాత్రికి రాత్రే కోటీశ్వరుడైన మత్స్యకారుడు!


వేటతో జీవనం గడిపే మత్స్యకారులకు వలకు ఒక్కోసారి అదృష్టం కలిసి వచ్చి అరుదైన చేపలు చిక్కుతాయి. దీంతో వారు లక్షాధికారులయిన సందర్భాలున్నాయి. తాజాగా, మహారాష్ట్రకు చెందిన ఓ మత్స్యకారుడికి అదృష్టం కలిసి వచ్చింది. అతడి వలకు అరుదైన చేపలు చిక్కగా.. వాటిని వేలంలో అమ్మి రాత్రికి రాత్రే కోటీశ్వరుడయ్యాడు. ఏటా వర్షాకాలంలో సముద్రంలో చేపల వేటపై ప్రభుత్వం నిషేధం విధిస్తుంది. ఈ నేపథ్యంలో పాల్ఘార్ జిల్లా ముర్బె గ్రామానికి చెందిన మత్స్యకారుడు చంద్రకాంత్‌ ఇంటివద్దే ఖాళీగా గడిపాడు. ఇటీవల నిషేధం ముగియడంతో ఆగస్టు 28న చంద్రకాంత్ సముద్రంలోకి చేపల వేటకకు వెళ్లాడు. మొత్తం 25 వలలు విసిరి వేచిచూస్తుండగా ఆ సమయంలో అతడి వలలో చాలా బరువు ఉండటం గమనించాడు. తోటి మత్స్యకారులతో కలిసి వలను ఒడ్డుకు చేర్చగా.. అందులోని మత్స్య సంపదను చూసి వారు ఒక్కసారిగా షాక్ అయ్యారు. వలలో 157 ఘోల్ చేపలు ‘హార్ట్ ఆఫ్ గోల్డ్’ చూసి ఆశ్చర్యపోయారు. ఇంత పెద్ద సంఖ్యలో ఈ చేపలను చూసి అందరూ ఆనందంతో గంతులు వేశారు. ఆ దృశ్యాలను మొబైల్‌లో చిత్రీకరించారు. ఘోల్‌ చేప తినడానికి మహారుచిగా ఉండడమే కాదు.. ఖరీదైన ఔషధాల తయారీలోనూ వినియోగిస్తారు. ఈ చేపకు విదేశాల్లో మంచి గిరాకీ ఉంది. దీంతో ఈ చేపలు వేలంలో రూ.1.33 కోట్లకు అమ్ముడయ్యాయి. కొంతమంది వీటిని బంగారు గుండె కలిగిన చేపలు అని కూడా పిలుస్తారు. ఈ చేపల కారణంగా చంద్రకాంత్ కోటీశ్వరుడయ్యాడు. ఇలా మత్స్యకారుల వలకు అరుదైన చేపలు లభించడం మొదటిసారి కాదు. గతంలో కూడా అరుదైన చేపలు వలకు చిక్కడంతో మార్కెట్‌లో ఎక్కువ ధరకు విక్రయించి లక్షాధికారులయ్యారు. తాజాగా 157 చేపలు రూ.1.33 కోట్లకు అమ్ముడుపోవడంతో ఒక్కో చేప రూ.87,000 పలికింది.


By September 02, 2021 at 08:38AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/fisherman-nets-ghol-fish-and-earns-rs-1-33-crore-in-auction-in-maharashtra-palghar/articleshow/85855487.cms

No comments