Breaking News

అలా చేసుండకపోతే గల్వాన్, డోక్లామ్‌లో భారత్ ఓడిపోయేది.. ఆర్మీ వైస్ చీఫ్ సంచలన వ్యాఖ్యలు


ఒకవేళ సాయుధ బలగాల కోసం భారత్ తగినంత ఖర్చుచేసుండకపోతే గల్వాన్, డోక్లామ్ యుద్ధంలో దేశం ఓడిపోయి ఉండేదని ఆర్మీ స్టాఫ్ వైస్ చీఫ్ లెఫ్టినెంట్ జనరల్ సీపీ మెహంతీ వ్యాఖ్యానించారు. సాయుధ బలగాలపై ఖర్చు విషయంలో జరుగుతున్న చర్చపై జనరల్ మెహంతీ స్పందిస్తూ.. ‘ఒకవేళ టిబెట్‌లో బలమైన సైన్యం ఉంటే.. వాళ్లు ఎప్పుడూ దాడి చేసుండేవారు కాదు’ అని అన్నారు. డోక్లామ్, గల్వాన్‌లో ఘటనలు దేశ ప్రతిష్ఠను పెంచడమే కాదు, అంతర్జాతీయంగా భారత్‌ స్థాయిని నిలబెట్టిందన్నారు. ‘సాయుధ బలగాల కోసం దేశం ఖర్చుచేయకపోతే కార్గిల్, డోక్లామ్ యుద్ధంలో ఓడిపోయేవాళ్లం.. జమ్మూ కశ్మీర్‌లోని అంతర్గత భద్రత ఆందోళనకరంగా ఉండేది.. ఈశాన్య రాష్ట్రాల్లో పరిస్థితి గందరగోళమయ్యేది.. నక్సల్స్ మరింత విస్తరించేవారు’ అని లెఫ్టినెంట్ జనరల్ మెహంతి ఆదివారం జరిగిన ఓ కార్యక్రమంలో ఈ వ్యాఖ్యలు చేశారు. ‘ఒక పెద్ద దేశానికి వ్యతిరేకంగా భద్రత గొడుగుగా నేడు ప్రతి ఒక్కరూ స్థిరమైన భద్రత కలిగిన దేశంగా భారత్ గురించి మాట్లాడుతున్నారు’ అని తెలిపారు. సాయుధ దళాలు భారత సమైక్యతకు చిహ్నమని, కుల, మత, జాతి, ప్రాంతాలకు అతీతమని అన్నారు. అంతేకాదు, సైనిక దళాలల్లో ఎటువంటి రాజకీయ ఆకాంక్షలు లేవు.. దేశంలో రాజకీయాలను గౌరవిస్తాయన్నారు. ‘కొన్ని చోట్ల ఉదాహరణగా తీసుకుంటే సైనిక నేతలకు రాజకీయ ఆకాంక్షలున్నాయి.. కానీ, భారత సైన్యంలో అటువంటి ఆకాంక్షలు లేవు.. ఇక్కడ మేము రాజకీయాలను గౌరవిస్తాం’ అని జనరల్ మెహంతి స్పష్టం చేశారు. గతేడాది జూన్ 15న గల్వాన్ లోయలో భారత్, చైనాల మధ్య ఘర్షణ చోటుచేసుకుని, 20 మంది సైనికులు అమరలయ్యారు. అటు, చైనాకు కూడా భారీ ప్రాణనష్టం జరిగింది. మొత్తం 40 మందికిపైగా చనిపోయినా పరువుపోతుందని డ్రాగన్ మేకపోతు గాంభీర్యం ప్రదర్శించింది.


By September 27, 2021 at 07:43AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/if-india-had-not-invested-in-security-would-have-lost-galwan-doklam-says-army-vice-chief/articleshow/86545033.cms

No comments