Breaking News

వానల కోసం నగ్నంగా బాలికలు ఊరేగింపు.. వారి వెనుకే మహిళలు భజనలు!


వర్షాల కోసం వరుణ దేవుడిని ప్రార్థిస్తూ బాలికలను నగ్నంగా వీధుల్లో ఊరేగించిన ఆటవిక ఘటన మధ్యప్రదేశ్‌లో వెలుగు చూసింది. బుందేల్‌ఖండ్ రీజియన్ దమోహ్‌ జిల్లాలోని బనియా గ్రామంలో ఆదివారం చోటుచేసుకున్న ఈ ఘటన ప్రస్తుత కాలంలో కొనసాగుతున్న అంధవిశ్వాసాలకు అద్దం పడుతోంది. వర్షాలు ముఖం చాటేసి కరవు పరిస్థితులు ఏర్పడినప్పుడు వరుణ దేవుడ్ని ప్రసన్నం చేసుకోవడానికి బనియా గ్రామస్థులు ఓ ఆచారాన్ని పాటిస్తారు. బాలికలను నగ్నంగా మార్చి, కప్పను కట్టిన ఓ కర్రను వారి భుజాలపై పెట్టి, వీధుల్లో తిప్పుతూ మహిళలు భజనలు చేస్తారు. అలా ఆరుగురు బాలికలను ఆదివారం నగ్నంగా తిప్పుతుండగా తీసిన వీడియోలు కలకలం సృష్టించాయి. దీనిపై జాతీయ బాలల హక్కుల పరిరక్షణ సంఘం (ఎన్‌సీపీసీఆర్‌) స్పందించింది. ఘటనపై నివేదిక సమర్పించాలని జిల్లా అధికారులను ఆదేశించింది. దమోహ్ జిల్లా ఎస్పీ డీఆర్ తెనివార్ మాట్లాడుతూ.. వర్షాలు కురవాలని వరుణుడ్ని ప్రార్ధిస్తూ బాలికలను నగ్నంగా ఊరేగించిన ఘటన గురించి పోలీసులకు సమాచారం వచ్చిందన్నారు. ఈ ఘటనపై విచారణ కొనసాగుతోందని, కారణమైన వారిపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఎన్సీపీసీఆర్ ఆదేశాలతో స్థానిక అధికారులు ఈ ఘటనపై నివేదిక సమర్పించనున్నారని దమోహ్ జిల్లా కలెక్టర్ కృష్ణ చైతన్య తెలిపారు. ఈ అనాగరిక చర్యలో బాలికల తల్లిదండ్రుల పాత్ర ఉందని, మూఢనమ్మకం గురించి వారికీ తెలుసన్నారు. ఈ ఘటనపై గ్రామస్థులెవరూ తమకు ఫిర్యాదు చేయలేదని ఆయన పేర్కొన్నారు. ఇటువంటి సందర్భాలలో గ్రామస్థులకు మూఢనమ్మకాల గురించి అధికారులే అవగాహన కల్పించగలరని, ఈ చర్యలు ఆశించిన ఫలితాలను ఇవ్వలేవని వారికి తెలియజేయగలరని అన్నారు. బాలికలు నగ్నంగా కప్పలు కట్టిన కావిళ్లను భుజాన వేసుకుని ఒకరి పక్కన ఇంకొకరు నడుస్తుంటే.. కొంత మంది మహిళలు వారి వెనుక భజనలు చేస్తూ ఉన్నట్టు వీడియో క్లిపింగ్‌లో ఉంది. వర్షాలు లేక పంటలు ఎండిపోతున్నాయని, వరుణ దేవుడి కరుణ కోసం ఇలా చేస్తుంటామని వీడియో రికార్డింగ్ చేస్తున్న వ్యక్తితో ఓ మహిళ చెప్పింది. ఊరేగింపు సమయంలో గ్రామస్థుల నుంచి బియ్యం సేకరించి, వాటిని స్థానిక ఆలయంలో వండి నైవేద్యం పెడతామని పేర్కొంది.


By September 07, 2021 at 08:30AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/girls-paraded-naked-during-ritual-for-rain-in-madhya-pradesh/articleshow/85996714.cms

No comments