Breaking News

ఆ పేర్లను ఉగ్రవాద జాబితా నుంచి తొలగించాల్సిందే.. అమెరికాకు తాలిబన్లు డిమాండ్


అఫ్గనిస్థాన్‌లో తాలిబన్లు, తమ మిత్రపక్షం హక్కానీ నెట్‌వర్క్‌తో కలిసి తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. హక్కానీ నెట్‌వర్క్‌కు చెందిన సిరాజుద్దీన్‌ హక్కానీ సహా పలువురికి క్యాబినెట్ పదవులు దక్కాయి. అమెరికా నిషేధిత ఉగ్రవాదుల జాబితాలో ఉన్న వీరంతా అఫ్గన్ మంత్రులుగా నియమితులు కావడం గమనార్హం. ఈ నేపథ్యంలో నిషేధిత జాబితా నుంచి వారిని తొలగించాలని తాలిబన్లు డిమాండ్‌ చేస్తున్నారు. అమెరికా ప్రస్తుత వైఖరి.. దోహా ఒప్పందాన్ని ఉల్లంఘించడమేనని, ఈ తీరు ఆమోదయోగ్యం కాదని వారు పేర్కొన్నారు. ‘హక్కానీ నెట్‌వర్క్‌ ప్రస్తుతం ఇస్లామిక్ ఎమిరేట్‌లో ఒక భాగం. దీనికి ప్రత్యేక పేరు, సంస్థ అంటూ లేదు. నిషేధిత జాబితాను సవరించకపోవడం అంటే.. అమెరికా మా అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటున్నట్టు లెక్క... మేం దీన్ని అంగీకరించబోం.. దౌత్యచర్చలతో వీలైనంత త్వరగా ఈ సమస్యను పరిష్కరించాలి’ అని పేర్కొంది. అమెరికా సైన్యం వైదొలగిన 10 రోజుల తర్వాత తొలిసారి కాబూల్ నుంచి అమెరికన్లు సహా 200 మందితో కూడిన విమానం బయలుదేరడానికి కొద్ది గంటల ముందే తాలిబన్లు ఈ ప్రకటన చేయడం గమనార్హం. కొత్త క్యాబినెట్‌లోని అఫ్గన్ ప్రధాని ముల్లా మహ్మద్‌ హసన్‌ అఖుండ్ సహా దాదాపు 14 మంది సైతం ఐరాస భద్రతా మండలి ప్రకటించిన నిషేధిత జాబితాలోని వ్యక్తులే కావడం గమనార్హం. ప్రపంచవ్యాప్తంగా తీవ్రమైన నేర, ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడినవారిని ఈ జాబితాలోకి చేర్చుతారు. దోహా వేదికగా జరిగిన అఫ్గన్ శాంతి ఒప్పందంలో తాలిబన్లకు ప్రభుత్వంలో భాగస్వామ్యం కల్పిస్తామని అమెరికా హామీ ఇచ్చింది. అయితే, అల్‌ఖైదా, ఐఎస్ వంటి ఉగ్రవాద సంస్థలను అనుమతించకూడదని స్పష్టం చేసింది. హక్కానీ నెట్‌వర్క్‌ ఉగ్రసంస్థ అధినేత సిరాజుద్దీన్‌ హక్కానీకి అత్యంత కీలకమైన హోం శాఖ బాధ్యతలు అప్పగించారు. తాలిబన్లతో పాటు అల్‌-ఖైదాతో అతడికి సన్నిహిత సంబంధాలున్నాయి. అతడిపై అమెరికా ఇప్పటికే 50 లక్షల డాలర్ల రివార్డు ప్రకటించింది. అఫ్గన్‌లో అమెరికా, నాటో దళాలపై జరిగిన పలు బాంబు డాలు వెనుక సిరాజుద్దీన్‌ హస్తం ఉంది. 2008లో అప్పటి అఫ్గన్‌ అధ్యక్షుడు హమీద్‌ కర్జాయ్‌ని హత్య చేసేందుకు కుట్ర పన్నినవారిలో ఈయన ఒకరు కావడం గమనార్హం.


By September 10, 2021 at 08:31AM


Read More https://telugu.samayam.com/latest-news/international-news/haqqani-on-us-terror-list-is-violation-of-doha-pact-says-taliban/articleshow/86086243.cms

No comments