ఏపీ, ఒడిశాలకు పొంచి ఉన్న ముప్పు.. తీరం దిశగా దూసుకొస్తున్న ‘గులాబ్’
తూర్పు మధ్య, ఈశాన్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా రూపాంతరంగా చెంది.. శనివారం తెల్లవారుజామున తీవ్ర వాయుగుండంగా మారింది. రాబోయే 12 గంటల్లో మరింత బలపడి తుఫానుగా మారుతుందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. ఇది పశ్చిమ వాయువ్య దిశగా గంటకు ఆరు కిలోమీటర్ల వేగంతో కదులుతోందని తెలిపింది. ప్రస్తుతం తూర్పు-ఆగ్నేయంగా ఒడిశాలోని గోపాల్‌పూర్‌కు 580 కి.మీ.. కళింగపట్నానికి 660 కి.మీ. తూర్పుగా కేంద్రీకృతమై ఉంది. ఆదివారం నాటికి తుఫానుగా మారనుండగా, దీనికి గులాబ్‌గా నామకరణం చేయనున్నారు. ఆ తర్వాత 24 గంటల్లో పశ్చిమ వాయువ్యంగా పయనించి, దక్షిణ ఒడిశాలోని గోపాల్‌పూర్, ఉత్తర కోస్తాలో విశాఖపట్నం మధ్య.. కళింగపట్నానికి సమీపాన తీరం దాటుతుందని తెలిపింది. వాయుగుండం ప్రభావంతో కోస్తా తీరం వెంబడి గంటకు 50-60 కి.మీ.వేగంతో బలమైన గాలులు వీస్తాయని పేర్కొంది. రెండు రోజుల పాటు మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లరాదని హెచ్చరించింది. శనివారం ఏపీలోని కోస్తాంధ్ర, ఒడిశాలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని ఐఎండీ తెలిపింది. ఆదివారం ఉత్తర కోస్తాంధ్ర, దక్షిణ ఒడిశాలో చాలాచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు.. కొన్ని ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని హెచ్చరించింది. తెలంగాణ, ఛత్తీన్‌గఢ్‌లోనూ కొన్నిచోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. సెప్టెంబరు 27న మాత్రం ఛత్తీస్‌గడ్, ఒడిశా, తెలంగాణలో కొన్నిచోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు, పశ్చిమ్ బెంగాల్ తీర ప్రాంతాల్లో భారీ వర్షాలు నమోదయ్యే అవకాశముంది. వాయుగుండం ప్రభావంతో శనివారం తీరం వెంబడి గంటకు 50-60 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని, ఇవి ఒక్కోసారి 70 కిలోమీటర్ల వేగం కూడా ఉంటుందని అంచనా వేసింది. అయితే, ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశా తీరంలో మాత్రం శనివారం సాయంత్రం నుంచి ఆదివారం అర్ధరాత్రి వరకూ గంటకు 90 కి.మీ. వేగంతో బలమైన గాలులు వీయనున్నట్టు తెలిపింది. రాగల 12 గంటల్లో సముద్రం అల్లకల్లోలంగా మారుతుందని, సోమవారం వరకూ ఈ పరిస్థితి కొనసాగుతుందని ఐఎండీ వెల్లడించింది.
By September 25, 2021 at 08:45AM
No comments