Breaking News

అఫ్గనిస్థాన్‌కు సాయం చేస్తాం, కానీ...: ఐరాసలో భారత్ కీలక ప్రకటన


అఫ్గన్ ప్రజలకు భారత్ మద్దతుగా నిలుస్తుందని విదేశాంగ మంత్రి ఎస్ జై శంకర్ ఉద్ఘాటించారు. సాధారణ వాణిజ్య విమాన కార్యకలాపాలు సహా ఎటువంటి అవరోధం, నిర్బంధం లేకుండా మానవతాదృక్పథంతో అఫ్గనిస్థాన్‌కు ప్రత్యక్ష సంబంధాలను కల్పించడం అత్యవసరమని అన్నారు. అఫ్గన్ పరిస్థితులపై సోమవారం జరిగిన ఐరాస అత్యున్నతస్థాయి సమావేశంలో ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అఫ్గన్ భూభాగాన్ని ఉగ్రవాద కార్యకలాపాలకు ఉపయోగించరాదని ఇటీవల ఐరాస భద్రతా మండలి 2593 తీర్మానం నొక్కిచెప్పిందన్నారు. తాలిబన్ పాలిత అఫ్గనిస్థాన్‌కు భారత్ ఎటువంటి ఆర్ధిక సాయం చేస్తామని హామీ ఇవ్వలేదని తెలిపారు. గత 20 ఏళ్లలో మొదటిసారి అఫ్గన్‌కు భారతదేశం అందించే ఆర్ధిక, అభివృద్ధి సాయం గురించి మంత్రి వివరించారు. పొరుగు దేశంగా అఫ్గన్‌లో పరిణామాలను అవగాహన చేసుకుని పరిశీలిస్తున్నామని పేర్కొన్నారు. కాబూల్ విమానాశ్రయంలో సాధారణ పరిస్థితులు నెలకొల్పి వాణిజ్య కార్యకలాపాలు ప్రారంభించాలని కోరామని, దీని వల్ల అఫ్గన్ ప్రజలకు సహాయ సామాగ్రి అందుతుందన్నారు. మానవతా సహాయానికి అడ్డంకిగా మారిన ప్రయాణం విషయంలో సురక్షితమైన మార్గం తక్షణమే పరిష్కరించాలని సూచించారు. అఫ్గన్‌లో 72 నుంచి 97 శాతం మంది అఫ్గన్ ప్రజలు పేదరికంలోకి వెళ్లిపోయే ప్రమాదం ఉందని ఇటీవల యూఎన్‌డీపీ నివేదిక తెలిపిందన్నారు. ‘ రాజకీయ, ఆర్థిక, సామాజిక, భద్రతా పరిస్థితులలో భారీగా మార్పులు చోటుచేసుకున్నాయి.. తత్ఫలితంగా మానవతా అవసరాలు చాలా ముఖ్యం’ అని తాలిబన్ల గురించి ప్రస్తావించకుండా పరోక్ష వ్యాఖ్యలు చేశారు. అఫ్గన్‌ను తాలిబన్లు ఆక్రమించుకునే వరకూ అక్కడ 34 ప్రావిన్సుల్లోనూ భారత్ అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగాయి. ఈ సమావేశంలో బ్రిటన్ విదేశాంగ మంత్రి డోమినిక్ రాబ్ మాట్లాడుతూ.. అఫ్గన్‌లో పరిస్థితులతో పాటు ప్రాంతీయ స్థిరత్వం ఆందోళన కలిగిస్తున్నాయని తెలిపారు. ‘మేము తాలిబన్ల నేరుగా ఎటువంటి సహాయం చేయబోం.. అందువల్ల సహాయ సంస్థలు స్వేచ్ఛగా, సురక్షితంగా వ్యవహరించడం చాలా ముఖ్యం’ అన్నారు. అంతేకాదు, అఫ్గన్ ప్రజలు స్వేచ్ఛగా తమకు నచ్చినచోటుకు వెళ్లేందుకు అనుమతించాలని సూచించారు.


By September 14, 2021 at 07:13AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/we-offers-support-to-afghanistan-but-doesnt-pledge-money-says-india-at-un/articleshow/86187385.cms

No comments