Breaking News

దేశవ్యాప్తంగా కొనసాగుతున్న భారత్ బంద్.. ఎక్కడికక్కడే ఆందోళనలు, నిరసనలు


కేంద్ర ప్రభుత్వం గతేడాది తీసుకొచ్చి నూతన సాగు చట్టాలను వ్యతిరేకిస్తూ రైతులు దేశవ్యాప్తంగా ఆందోళనలు కొనసాగిస్తున్నారు. ఈ చట్టాలకు రాష్ట్రపతి ఆమోదం తెలిపి సరిగ్గా సోమవారానికి (సెప్టెంబరు 27) ఏడాది పూర్తయిన సందర్భంగా సంయుక్త కిసాన్‌ మోర్చా (ఎస్‌కేఎం) ఆధ్వర్యంలో 500కు పైగా రైతు, ప్రజాసంఘాలు భారత్‌ బంద్‌కు పిలుపునిచ్చాయి. 40 రైతు సంఘాల ఉమ్మడి వేదిక ఎస్కేఎం పిలుపుతో ఈ బంద్‌కు దేశంలోని కాంగ్రెస్, వామపక్షాలు సహా 19 రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు మద్దతు ప్రకటించాయి. ఉదయం 6 గంటల నుంచి మొదలైన బంద్ సాయంత్రం 4 గంటల వరకు బంద్ కొనసాగుతుంది. కాంగ్రెస్ సహా వామపక్షాలు, ఆంధ్రప్రదేశ్‌, ఒడిశా, కేరళ, పంజాబ్, తమిళనాడు ప్రభుత్వాలు మద్దతు ప్రకటించాయి. ఆల్‌ ఇండియా బ్యాంక్‌ ఆఫీసర్స్‌ కాన్ఫెడెరేషన్‌ కూడా బంద్‌లో పాల్గొంటోంది. బంద్‌ దృష్ట్యా ఢిల్లీలో భద్రతను కట్టుదిట్టం చేశారు. రాజధాని సరిహద్దుల్లో అదనపు బలగాలను మోహరించారు. జాతీయ రహదారులపై వాహనాలను తిరగనివ్వబోమని ఎస్కేఎం వెల్లడించింది. సోమవారం ఉదయం ఢిల్లీ-మీరట్ ఎక్స్‌ప్రెస్‌వేను ఘాజీపూర్ వద్ద ఆందోళనకారులు నిర్బంధించారు. దీంతో యూపీ నుంచి వచ్చే వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. అత్యవసర సేవల మినహా మిగతా అన్ని సేవలను అడ్డుకుంటున్నారు. ఢిల్లీలోని ఇండియా గేట్‌, విజయ్‌ చౌక్‌ సహా ముఖ్యమైన కూడళ్లలో బందోబస్తు ఏర్పాటు చేశారు. నిరసన శిబిరాల నుంచి రైతులు దిల్లీలోకి రాకుండా పోలీసులు చర్యలు చేపట్టారు. హరియాణాలోని శంభు సరిహద్దులను రైతులు నిర్బంధించారు. ధర్నాకు దిగిన రైతులు కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. రైతుల భారత్ బంద్‌‌లో శాంతియుతంగా పాల్గొని విజయవంతం చేయాలని పార్టీ శ్రేణులకు పంజాబ్ ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడు నవజోత్ సింగ్ సిద్ధూ పిలుపునిచ్చారు. ‘యుద్ధం సరైందా.. తప్పా అనేది తటస్థంగా ఉండలేరు.. రాజ్యాంగ విరుద్ధమైన మూడు నల్ల చట్టాలకు వ్యతిరేకంగా ప్రతి కాంగ్రెస్ కార్యకర్త తమ శక్తితో పోరాడాలని మేం కోరుతున్నాం’అన్నారు. ఏపీ ప్రభుత్వం భారత్‌ బంద్‌కు సంఘీభావం ప్రకటించింది. ఆర్టీసీ బస్సులను ఆదివారం అర్ధరాత్రి నుంచి సోమవారం మధ్యాహ్నం వరకు నిలిపివేస్తున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. అటు, ఉపాధ్యాయ సంఘాల విజ్ఞప్తి మేరకు పాఠశాలలకూ సెలవు ప్రకటించారు. భారత్ బంద్‌ సందర్భంగా రాష్ట్రంలో పలుచోట్ల విపక్షాలు నిరసన కార్యక్రమాలు చేపట్టాయి. బంద్‌ కారణంగా తెలంగాణలోనూ పలు జిల్లాల్లో ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. హనుమకొండలో వామపక్షాల నేతలు బస్సులను అడ్డుకున్నారు. దీంతో వామపక్ష నేతలు, పోలీసుల మధ్య తోపులాట చోటుచేసుకుంది. అనంతరం పలువురు నేతలను పోలీసులు అరెస్ట్‌ చేశారు.


By September 27, 2021 at 09:08AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/farmers-bharat-bandh-begins-across-country-traffic-affected-in-some-places/articleshow/86546313.cms

No comments