Breaking News

700 మంది తాలిబన్లు హతం.. బందీగా మరో వెయ్యి మంది: పంజ్‌షీర్ సైన్యం ప్రకటన


లోయపై పట్టుసాధించామని తాలిబన్లు చేసిన ప్రకటనలో నిజం లేదని తెలుస్తోంది. పంజ్‌షీర్ సైన్యం, ఫైటర్ల మధ్య భీకరపోరు కొనసాగుతోంది. ఎట్టిపరిస్థితుల్లో తాలిబన్ మూకలకు లొంగిపోయే ప్రసక్తేలేదని స్థానిక నేత అహ్మద్‌ మసూద్‌ నేతృత్వంలోని నేషనల్‌ రెసిస్టెన్స్‌ ఫ్రంట్‌ (ఎన్‌ఆర్‌ఎఫ్‌) ప్రకటించింది. ఇదే సమయంలో తాలిబన్లకు పంజ్‌షేర్‌లో గట్టి ఎదురుదెబ్బే తగిలింది. తాలిబన్‌‌కు చెందిన 700 ఫైటర్లను హతమార్చినట్లు ఎన్‌ఆర్‌ఎఫ్‌ తెలిపింది. పంజ్‌షేర్‌లో తమ పోరు వేగం తగ్గిందని స్వయంగా తాలిబన్లు వెల్లడించడం వారికి అక్కడ తీవ్ర ప్రతిఘటన ఎదురైనట్లు స్పష్టమవుతోంది. పంజ్‌షీర్‌లోని పలు జిల్లాల్లో తాలిబన్లు, స్థానిక బలగాల మధ్య హోరాహోరీ పోరు కొనసాగుతోంది. రాజధాని బజారక్‌లోకి ప్రవేశించి గవర్నర్‌ కార్యాలయాన్ని స్వాధీనం చేసుకున్నట్ుట తాలిబన్‌ అధికార ప్రతినిధి బిలాల్‌ కరీమీ ప్రకటించారు. మొత్తం ఎనిమిది జిల్లాల్లో నాలుగు తమ వశమయ్యాయని తెలిపారు. పంజ్‌షీర్‌లో పోరాటం కొనసాగుతోంద తాలిబన్‌‌కు చెందిన ఓ అధికారి తెలిపారు. అయితే బజారక్‌ రోడ్లు, గవర్నర్‌ కార్యాలయం ఆవరణలో స్థానిక సైన్యం మందుపాతరలు అమర్చాయని చెప్పారు. ఫలితంగా తమ ఆక్రమణ వేగం తగ్గిందన్నారు. పంజ్‌షీర్‌లో తమ పట్టు సడల్లేదని ఎన్‌ఆర్‌ఎఫ్‌ బలగాలు స్పష్టం చేశాయి. ప్రావిన్సు వ్యాప్తంగా జరిగిన పోరాటంలో 700 మందికి పైగా తాలిబన్‌ సభ్యులను మట్టుబెట్టామని... మరో 1,000 మందిని అదుపులోకి తీసుకున్నామని పేర్కొన్నాయి. దష్తె రెవాక్‌ ప్రాంతంలో తమ బలగాలు చుట్టుముట్టడంతో వందల మంది తాలిబన్లు వాహనాలను వదిలి పారిపోయారని తెలిపారు. పర్యాన్‌ జిల్లాలో చెలరేగిన తీవ్రస్థాయి ఘర్షణ శనివారం రాత్రి నుంచి ఆదివారం ఉదయం వరకు కొనసాగిందని వెల్లడించాయి. తాలిబన్లకు లొంగిపోయే ప్రసక్తే లేదని అఫ్గన్ ఆపద్ధర్మ అధ్యక్షుడు అమ్రుల్లా సలేహ్‌ పునరుద్ఘాటించారు. ఒకవేళ వారితో పోరాటంలో తాను గాయపడితే.. తన తలలో రెండుసార్లు కాల్పులు జరపాలని ఓ సైన్యాధికారికి సూచించినట్లు తెలిపారు. బ్రిటన్‌కు చెందిన డెయిలీ మెయిల్ ప్రత్రిక తాజాగా రాసిన వ్యాసంలో సలేహ్‌ పలు కీలక విషయాలు వెల్లడించారు. అఫ్గాన్‌ తాలిబన్ల వశమవ్వడానికి ముందు చోటుచేసుకున్న పరిణామాలను వివరించారు. మరోవైపు, తాలిబన్ సహ వ్యవస్థాపకుడు ముల్లా బరాదర్ నాయకత్వంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటుపై సందిగ్ధత కొనసాగుతోంది. తాలిబన్ మిత్రపక్షాల మధ్య శుక్రవారం రాత్రి ఈ అంశంపై వివాదం మొదలై ఘర్షణకు దారితీసినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ ఘర్షణలో బరాదర్‌ గాయపడినట్టు తెలుస్తోంది. మరోవైపు, ఆయనకు సంబంధించిన పాక్ పాస్‌పోర్ట్ ఫోటో సోషల్ మీడియాలో దర్శనమిచ్చింది. దీంతో పాక్, తాలిబన్ల మధ్య సంబంధాలు మరోమారు బహిర్గతమయ్యాయి. ముల్లా బరాదర్ దగ్గర పాకిస్తాన్ పాస్‌పోర్ట్ ఉన్నదని గతంలోనే వార్తలు వచ్చాయి.


By September 06, 2021 at 08:16AM


Read More https://telugu.samayam.com/latest-news/international-news/over-700-taliban-killed-in-holdout-panjshir-claim-resistance-forces-nrf/articleshow/85965970.cms

No comments