Breaking News

సరిహద్దుల్లో శత్రువులకు ఇక కాలరాత్రులే.. 118 అత్యాధునిక యుద్ధ ట్యాంకులకు ఆర్డర్


సైనిక సామర్థ్యాన్ని మరింత బలోపేతం చేసే దిశగా కేంద్రం మరో కీలక నిర్ణయం తీసుకుంది. అత్యాధునిక 118 అర్జున్‌ మెయిన్‌ బ్యాటిల్‌ ట్యాంక్‌ (ఎంబీటీ)ల తయారీకి చర్యలు ప్రారంభించింది. మొత్తం రూ.7,523 కోట్లతో అర్జున్ Mk-1A ట్యాంకులను కొనుగోలు చేయనుంది. ఈ యుద్ధ ట్యాంకుల కొనుగోలుకు చెన్నై ఆవడిలోని హెవీ వెహికల్స్‌ ఫ్యాక్టరీ (HVF)కి ఈ మేరకు ఆర్డర్‌ ఇచ్చింది. MBT MK-1A కొత్త వేరియంట్ అర్జున్‌ ట్యాంక్‌ దాడిచేసే సామర్ధ్యం పెంచడం, వేగంగా తరలించడం, శత్రు ట్యాంకులను ఎదుర్కోవడం సహా 72 అత్యాధునిక ఫీచర్లతో రూపుదిద్దుకోనుంది. పూర్తిస్థాయి స్వదేశీ పరిజ్ఞానంతో 118 మెయిన్‌ బ్యాటిల్‌ ట్యాంక్‌ (MBT) అర్జున్ Mk-1A భారత సైన్యానికి సరఫరా చేసేందుకు చెన్నైలోని ఆవడిలో ఉన్న హెవీ వెహికల్స్ ఫ్యాక్టరీకి ఆర్డర్‌ చేసినట్టు కేంద్ర రక్షణశాఖ ఓ ప్రకటనలో వెల్లడించింది. రూ.7,523 కోట్ల విలువైన ఈ ప్రాజెక్టు రక్షణ రంగంలో 'మేక్ ఇన్ ఇండియా' కార్యక్రమానికి మరింత ప్రోత్సాహాన్నివ్వడం సహా ఆత్మనిర్భర్ భారత్‌లో గొప్ప ముందడుగని రక్షణశాఖ పేర్కొంది. ఈ ట్యాంకులు రాత్రి సమయాల్లోనూ కచ్చితంగా లక్ష్యాలను చేరుకోవడంతో పాటు క్లిష్టమైన వాతావరణ పరిస్థితుల్లో శత్రుసేనల కదలికలను గుర్తించి వారిని కట్టడి చేయడంలో కీలకంగా పనిచేయగలవని తెలిపింది. ప్రస్తుతం భారత సైన్యం వినియోగిస్తున్న అర్జున్‌ MBTని అప్‌గ్రేడ్‌ చేస్తూ అధునాతన ఫీచర్లతో దేశ రక్షణ పరిశోధనాభివృద్ధి సంస్థ (డీఆర్‌డీవో) దీన్ని అభివృద్ధి చేసింది. ఈ ఏడాది ఫిబ్రవరి 14న ప్రధాని నరేంద్ర మోదీ ఈ అర్జున Mk-1A ట్యాంక్‌ని ఆర్మీ చీఫ్‌ ఎంఎం నరవణెకు చెన్నైలో అందించిన విషయం తెలిసిందే. ‘MK-1A ఖచ్చితమైన, ఉన్నతమైన ఫైర్‌ పవర్, అన్ని ప్రదేశాల్లోనూ పనిచేయగలదు.. అధునాతన సాంకేతిక వ్యవస్థ శ్రేణితో అజేయమైన బహుళ- రక్షణ సామర్థ్యం కలిగి ఉంది.. ఇది పగలు, రాత్రి పరిస్థితులలో డైనమిక్, స్థిరమైన లక్ష్యంతో శత్రువులపై దాడిచేస్తుంది’ అని పేర్కొంది. హెవీ వెహికల్ ఫ్యాక్టరీకి ఈ ఆర్డర్ MSMEలతో సహా 200 మంది భారతీయ వ్యాపారులకు రక్షణ పరికరాల తయారీలో ఒక పెద్ద మార్గాన్ని చూపుతుంది.. సుమారు 8,000 మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని తెలిపింది. ‘అత్యాధునిక రక్షణ సాంకేతికతలలో స్వదేశీ సామర్థ్యాన్ని ప్రదర్శించే ప్రధాన ప్రాజెక్ట్ ఇది’ అని మంత్రిత్వ శాఖ వివరించింది.


By September 24, 2021 at 08:45AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/defence-ministry-places-7523-crore-order-for-118-arjuna-mk-1a-tanks/articleshow/86470687.cms

No comments