Taliban అఫ్గన్‌లో ఏం జరిగిందో చూశారుగా.. మా సహనాన్ని పరీక్షించొద్దు.. మాజీ సీఎం సంచలన వ్యాఖ్యలు
అఫ్గనిస్థాన్ పరిస్థితులను ఉదహరిస్తూ కేంద్ర ప్రభుత్వంపై జమ్మూ కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా చర్చనీయాంశమవుతున్నాయి. కుల్గాం జిల్లాలో శనివారం జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ సీఎం.. ర్యాలీని ఉద్దేశించి ప్రసంగించారు. తాలిబన్ల దెబ్బకు శక్తివంతమైన అమెరికా సైతం పలాయనం చిత్తగించిందని, కశ్మీర్ ప్రజల సహనాన్ని పరీక్షించొద్దని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఆర్టికల్ 370 పునరుద్దరణ విషయంలో ఇప్పటికీ అవకాశం ఉందని, వాజ్‌పేయి మాదిరిగా చర్చలు ప్రారంభించాలని సూచించారు. ‘‘కశ్మీర్ ప్రజలు ఇబ్బందులను భరించాలంటే ధైర్యం కావాలి.. ఏ రోజైతే వారిలో సహనం నశిస్తుందో.. మీరు నాశనం అవుతారు.. మా సహనాన్ని పరీక్షించొద్దు. అఫ్గనిస్థాన్‌లో ఏం జరుగుతోందో చూస్తున్నారుగా.. శక్తివంతమైన అమెరికా ఆ దేశం విడిచివెళ్లాల్సి వచ్చింది’’ అని కేంద్ర ప్రభుత్వాన్ని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ‘‘మీకు ఇంకా అవకాశం ఉంది. కశ్మీర్ ప్రజలతో చర్చించండి.. మాజీ ప్రధాని వాజ్‌పేయి మాదిరిగా శాంతి స్థాపన ప్రక్రియను పునః ప్రారంభించండి. ఆర్టికల్ 370ను పునరుద్ధరించండి’’ అని ముఫ్తీ డిమాండ్ చేశారు. ఇదే సమయంలో బీజేపీపై విమర్శలు గుప్పించారు. స్వాతంత్రం వచ్చేటప్పటికి ఒకవేళ ఉండుంటే కశ్మీర్ ఈ రోజున భారత్‌తో ఉండేది కాదని మండిపడ్డారు. అన్నివైపుల నుంచి కశ్మీరీల ఉనికి కాపాడేలా ప్రత్యేక హోదా కల్పిస్తామని జమ్మూ కశ్మీర్ నాయకత్వానికి 1947లో మాజీ ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ హామీ ఇచ్చారని మెహబూబా ముఫ్తీ పేర్కొన్నారు. ‘కశ్మీర్‌లో పరిస్థితులను ఒకవేళ బీజేపీ సరిగ్గా అవగాహన చేసుకోకపోతే దేశం మతపరంగా ముక్కలైపోతుంది.. ఇక్కడ ప్రజల గొంతుక నొక్కేయడానికి వ్యవస్థల దుర్వినియోగానికి పాల్పడుతోంది’ అని ముఫ్తీ ఆరోపించారు. మరోవైపు, అఫ్గన్ ప్రజలకు వ్యతిరేకంగా ఎటువంటి చర్యలకు పాల్పడవద్దని తాలిబన్లను కోరుతున్నానని ఆమె విజ్ఞప్తి చేశారు. మాజీ సీఎం ముఫ్తీ వ్యాఖ్యలపై కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ స్పందించారు. ప్రస్తుత సమయంలో ఇలాంటి ప్రకటనలు చేయడం మానుకోవాలని ఆమె సూచించారు. జమ్మూ- కశ్మీర్ ఎల్లప్పుడూ భారత్‌లో అంతర్భాగమేనని సీతారామన్ పునరుద్ఘాటించారు. ముఫ్తీ ఇక్కడ తాలిబన్ల పాలన కోరుకుంటున్నారని బీజేపీ జమ్మూ- కశ్మీర్ అధ్యక్షుడు రవీందర్ రైనా విమర్శించారు. ‘‘ప్రధాని నరేంద్ర మోదీ.. జో బైడెన్ కాదు. స్థానికంగా ఉగ్రవాదులను ఏరివేస్తాం’’ అని అన్నారు.
By August 22, 2021 at 06:50AM
No comments