Panjshir అక్కడ అడుగుపెట్టాలంటే భయపడుతున్న తాలిబన్లు.. ఆ పేరు వింటే వెన్నులో వణుకు!
అమెరికా, మిత్రరాజ్యాల సైన్యం అఫ్గనిస్థాన్ నుంచి వైదొలగిన కొద్ది రోజులకే మెరుపు వేగంతో మొత్తం దేశాన్ని హస్తగతం చేసుకున్నారు. అయితే, ఒక్క పంజ్‌షిర్ ప్రాంతంలోకి మాత్రం తాలిబన్‌లు అడుగుపెట్టడానికి భయపడుతున్నారు. ఎలాగైనా అక్కడ అడుగు పెట్టాలని ఇరవయ్యేళ్లకుపైగా విశ్వప్రయత్నాలు చేస్తున్నా తాలిబన్లకు సాధ్యపడటంలేదు. తాలిబన్ల దురాక్రమణపై సింహంలా గర్జిస్తున్న పంజ్‌షీర్‌లో గెరిల్లా పోరాటంలో అహ్మద్ షా మసూద్ కీలకంగా వ్యవహరించారు. హిందూకుష్ పర్వత శ్రేణులకు సమీపంలో కాబుల్‌కు ఉత్తరాన 150 కి.మీల దూరంలో పంజ్‌షిర్ ప్రావిన్సుల్లో దాదాపు లక్షకు పైగా జనాభా ఉంటారు. ఇక్కడ తజిక్ జాతికి చెందిన ప్రజలే అత్యధికం. పంజ్‌షిర్ అంటే సంస్కృతంలో ఐదు సింహాలు అని అర్థం. ఈ ప్రాంతానికి ఆ పేరు ఎందుకు వచ్చిందో తెలుసుకోవాలంటే 11వ శతాబ్దానికి వెళ్లాల్సిందే. అప్పట్లో వరద నీటిని అడ్డుకొనేందుకు ఐదుగురు సోదరులు ప్రయత్నించారని, మహ్మద్ గజనీకి వారు ఓ ఆనకట్టను నిర్మించారని స్థానిక చరిత్రలు పేర్కొంటున్నాయి. అక్కడి ప్రజల్లో పోరాట పటిమకు తోడు అడవులు ఆ ప్రాంతానికి పెట్టని కోటలా రక్షణగా నిలవడం అదనపు బలం శతాబ్దాలుగా పంజ్‌షిర్‌లో అటు విదేశీ బలగాలు, ఇటు తాలిబన్లు కాలుమోపలేకపోయారు. తెగింపునకు మారుపేరైన అక్కడ ప్రజలు.. అనేక తిరుగుబాట్లకు ఈ ప్రాంతం వేదికగా నిలిచింది. గతంలో తాలిబన్ల పాలనను అంతం చేయడంలోనూ వీరిదే కీలక పాత్ర. అక్కడి ప్రజల్లో ఉన్న ఉద్యమస్ఫూర్తిని మరింతగా రగిలించి, దిశనిర్దేశం చేసిన వారిలో తాలిబన్ వ్యతిరేక నాయకుడు అహ్మద్ షా మసూద్ అగ్రగణ్యులు. కేవలం రాజకీయ నేత మాత్రమే కాదు.. మిలటరీ కమాండర్ అయిన అహ్మద్ మసూద్.. 1979-1989 మధ్య సోవియట్ సేనలను తీవ్రంగా ప్రతిఘటించారు. అనంతరం 1990లలో ప్రత్యర్థులకు వ్యతిరేకంగా ప్రభుత్వ సైనిక విభాగానికి నాయకత్వం వహించారు. ఆ తర్వాత అఫ్గన్ తాలిబన్‌ల చేతుల్లోకి వెళ్లిన తర్వాత అరాచక పాలనకు వ్యతిరేకంగా తుది శ్వాస వరకు పోరాడారు. ఉత్తర కూటమిని ఏర్పాటు చేసి, 2001లో ఐరోపాలో పర్యటించి తాలిబాన్లకు పాకిస్థాన్ మద్దతు లేకుండా ఒత్తిడి చేయాలంటూ యూరోపియన్ పార్లమెంట్ నేతలను కోరారు. తాలిబన్ పాలనలో అఫ్గన్ ప్రజలు భయంకరమైన పరిస్థితులు ఎదుర్కొంటున్నారని, మానవతా దృక్పథంతో సాయం చేయాలని కూడా అభ్యర్థించారు. తాలిబన్లు, ఆల్‌ఖైదా ఉగ్రవాదులు కలిసి జర్నలిస్ట్‌లుగా మారు వేషాల్లో వచ్చి ఆయనను 2001 సెప్టెంబరు 9న ఇంటర్వ్యూ చేశారు. ఈ సమయంలో వారు జరిపిన ఆత్మాహుతి దాడిలో ప్రాణాలు కోల్పోయారు. ఆ తర్వాత రెండు రోజులకే అమెరికాపై ఒసామా బిన్ లాడెన్ దాడులకు తెగబడ్డాడు. ఇదే చివరకు అమెరికా, నాటో దళాలు అఫ్గన్‌పై దాడి చేయడం, మసూద్ దళాలతో ఆ బలగాల స్నేహానికి దారితీసింది. ఆ తర్వాత నార్తర్న్ కూటమి తాలిబన్ల రాక్షస పాలనకు వ్యతిరేకంగా రెండు నెలల పాటు పోరాటం జరిపింది. డిసెంబర్ 2001 నాటికి తాలిబన్ల అరాచక పాలన అంతం చేసి విజయం సాధించింది. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన హమీద్ కర్జాయ్.. అహ్మద్ షా మసూద్‌ను నేషనల్ హీరోగా ప్రకటించడంతో పాటు ఆయన మరణం రోజును సెలవు దినంగా నిర్ణయించారు. ప్రస్తుతం పంజ్‌షిర్ ప్రాంతమే అఫ్గన్ రాజకీయ వ్యూహాలకు కేంద్రబిందువుగా మారుతోంది. అహ్మద్ షా మసూద్ తనయుడు అహ్మద్ మసూద్, అఫ్గన్ ఉపాధ్యక్షుడు అమ్రుల్లా సలేహ్, బిస్మిల్లాఖాన్ మొహమ్మది తదితర కీలక నేతలు తాలిబన్లను సవాల్ చేస్తున్నారు. ఆ దిశగా పోరాటానికి సమాయత్తం కావడం గమనార్హం. తాలిబన్లు కాబుల్‌ను కైవసం చేసుకున్న మరుక్షణమే అధ్యక్షుడు అష్రఫ్ ఘనీ ప్రాణభయంతో దేశం విడిచి పారిపోగా.. అమ్రుల్లా సలేహ్ మాత్రం తాలిబన్లకు తలవంచేది లేదని ధైర్యంగా ప్రకటించారు.
By August 20, 2021 at 07:43AM
No comments