Breaking News

old nangal incident బాలిక ఫోటోను రాహుల్ షేర్ చేయడంపై బాలల హక్కుల కమిషన్ సీరియస్.. నోటీసులు


హత్యాచారానికి గురైన ఢిల్లీ దళిత బాలిక వివరాలను కాంగ్రెస్ ఎంపీ ట్విట్టర్‌లో పోస్ట్ చేయడం వివాదాస్పదమవుతోంది. ఈ నేపథ్యంలో ట్విట్టర్ ఇండియాకు జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ (ఎన్సీపీసీఆర్) గురువారం నోటీసులు జారీచేసింది. రాహుల్ గాంధీ పోస్ట్ చేసిన ఫోటోను తొలగించాలని బాలల హక్కుల కమిషన్ ట్విట్టర్ ఇండియాను ఆదేశించింది. ఢిల్లీ కంటోన్మెంట్‌లోని ఓల్డ్ నంగల్ గ్రామానికి చెందిన బాధితురాలి కుటుంబాన్ని కలిసిన తర్వాత రాహుల్ గాంధీ బుధవారం ఫోటోను ట్విట్టర్‌లో పోస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఇందులో రాహుల్ సహా బాధితురాలి తల్లిదండ్రులు ఉన్నారు. వాహనం లోపల కూర్చుని వారితో రాహుల్ మాట్లాడుతున్నట్టు ఇందులో కనబడుతోంది. ‘బాధిత బాలిక తల్లిదండ్రుల ఫోటోను ట్విట్టర్‌లో షేర్ చేసి వివరాలను వెల్లడించడం పోక్సో చట్టాన్ని ఉల్లంఘించడమే.. దీనిని తీవ్రంగా పరిగణించిన ఎన్సీపీసీఆర్... రాహుల్ గాంధీకి నోటీసులు జారీచేసి ఫోటోను తొలగించాలని ట్విట్టర్ ఇండియాను ఆదేశించాం’ అని ఎన్సీపీసీఆర్ ట్విట్టర్‌లో పేర్కొంది. ఆ ఫోటోలో ఆమె తల్లిదండ్రులను చూపించడం ద్వారా ‘బాలిక గుర్తింపును వెల్లడించడమే’ అని ట్విట్టర్ ఇండియా రెసిడెంట్ గ్రీవెన్స్ అధికారికి జారీచేసిన నోటీసులో పేర్కొంది. అంతేకాదు, ఏ మీడియా సంస్థ లేదా ఏ విధంగానూ బాధితురాలి ఐడెంటింటీని తెలిపే సమాచారం లేదా ఫోటోలు, మరింకేదైనా సమాచారం వెల్లడించడం జువైనల్ జస్టిస్, పోక్సో చట్టం ప్రకారం నేరం అని గుర్తుచేసింది. కొద్దిరోజుల క్రితం ఢిల్లీలోని ఓల్డ్ నంగల్ శ్మశానవాటికలో తొమ్మిదేళ్ల బాలికపై ఓ పూజారి, ముగ్గురు వ్యక్తులు కలిసి సామూహిక లైంగిక దాడికి పాల్పడి చంపేశారు. ఈ కేసులో బాధితురాలి తల్లి ఇచ్చిన ఫిర్యాదుతో ఢిల్లీ పోలీసులు నలుగురు నిందితులను అరెస్ట్ చేశారు. వీరిపై ఐపీసీ 302, 376, 506 సెక్షన్లతో పాటు పోక్సో చట్టం, ఎస్సీ-ఎస్టీ చట్టం కింద కేసులు నమోదు చేశారు. అయితే తల్లిదండ్రుల అనుమతి తీసుకోకుండా బాలిక మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించడం సంచలనంగా మారింది. ఈ నేపథ్యంలో బాధితురాలి కుటుంబ సభ్యులను రాహుల్ గాంధీ పరామర్శించారు. బాలిక కుటుంబానికి తాము మద్దతుగా ఉంటామని చెప్పిన రాహుల్.. ఆ కుటుంబాన్ని పరామర్శించిన ఫోటోలను సోషల్‌మీడియా ద్వారా పంచుకున్నారు.


By August 05, 2021 at 07:01AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/child-rights-body-ncpcr-notice-on-rahul-gandhi-photo-of-dalit-girls-family/articleshow/85057133.cms

No comments