Kandahar అఫ్గన్‌లో కొనసాగుతున్న తాలిబన్ల ఆక్రమణ.. కాందహార్, హేరట్‌లపై పట్టు
అఫ్గనిస్థాన్ నుంచి అమెరికా సైన్యాల ఉపసంహరణతో మరోసారి పట్టుసాధిస్తున్నారు. ఇప్పటికే అఫ్గన్‌లోని 65 శాతం భూభాగాన్ని ఆక్రమించుకున్నారు. తాజాగా రాజధాని కాబుల్‌కు సమీపంలోని, హేరత్ నగరాలను హస్తగతం చేసుకున్నారు. రెండో అతిపెద్ద నగరం కాందహార్, మూడో అతిపెద్ద నగరమైన హేరత్‌ను తాలిబన్లు ఆక్రమించుకోవడంతో ఉత్తర, దక్షిణ, పశ్చిమ ప్రాంతాలు దాదాపు అఫ్గన్ ప్రభుత్వం చేజారిపోయాయి. మరికొద్ది రోజుల్లోనే రాజధాని కాబూల్‌ను స్వాధీనం చేసుకుంటారని అమెరికా నిఘా వర్గాలు హెచ్చరిస్తున్నాయి. ఇప్పటికే పది రాష్ట్రాల రాజధానులు తాలిబన్ల అధీనంలోకి వెళ్లాయి. కాందహార్, హేరాత్‌ను స్వాధీనం చేసుకోడానికి ముందు ఘాజ్నీని కోల్పోవడం అఫ్గాన్ సేనలకు వ్యూహాత్మకంగా గట్టి ఎదురుదెబ్బే. కాబుల్-కాందహార్ జాతీయ రహదారిపై ఉన్న ఈ నగరం... దేశ రాజధానిని, దక్షిణాది రాష్ట్రాలతో కలుపుతుంది. ఘాజ్నీ తాలిబన్ల చేతిలోకి వెళ్లడంతో అఫ్గాన్ సైనికుల రవాణా కష్టతరమవుతుంది. మరోవైపు దక్షిణాది ప్రాంతాలపై పట్టు సాధించడం తాలిబన్లకు సులభమవుతుంది. హెల్మాండ్ ప్రావిన్స్‌లోని లష్కర్ గాహ్ పోలీసు హెడ్ క్వార్టర్స్‌ను తాలిబన్లు స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం ఈ భవనం వెలుపల సైనికులు మోహరించారు. నెల రోజుల్లో కాబుల్‌పై తాలిబన్ల నుంచి తీవ్ర ఒత్తిడి ఎదురుకానుందని... పరిస్థితే ఇలాగే కొనసాగితే కొన్ని నెలల్లోనే అఫ్గాన్‌పై తాలిబన్లు పూర్తిపట్టు సాధిస్తారని అమెరికా సైనిక నిఘా అధికారులు అంచనా వేశారు. దీంతో కాబుల్ సహా మరికొన్ని నగరాలను కాపాడుకునేందుకే అక్కడ ప్రభుత్వం పరిమితం కావచ్చని విశ్లేషించారు. హేరట్‌ను తాలిబన్లు స్వాధీనం చేసుకోవడంతో అఫ్గన్ సైన్యాలు గురువారం అక్కడ నుంచి వైదొలగాయి. ఇరాన్ సరిహద్దుకు సమీపంలో ఉన్న పురాతన సిల్క్ రోడ్ సిటీ నుంచి సైన్యం బ్యారక్‌లకు వెనక్కు వెళ్లింది. మరింత విధ్వంసాన్ని నివారించడానికి మేము నగరాన్ని విడిచిపెట్టాల్సి వచ్చిందని సైన్యంలోని సీనియర్ అధికార వర్గాలు తెలిపాయి. అటు, సైనికులు ఆయుధాలను వీడి ముజాయిద్దీన్‌లో చేరారంటూ తాలిబన్ల అధికార ప్రతినిధి ట్వీట్ చేశారు. ఘాజ్నీ పట్టణంపై తాలిబన్లు పట్టుసాధించారని అఫ్గన్ హోం మంత్రి గురువారం ధ్రువీకరించారు. శత్రువుల ఈ నగరాన్ని ఆక్రమించరాని హోం శాఖ అధికార ప్రతినిధి మిర్వాయిస్ స్టాయినిక్‌జై వెల్లడించారు. మరోవైపు దేశంలో హింసను అదుపులోకి తెచ్చేందుకు అఫ్గన్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తాలిబన్లతో అధికారం పంచుకునేందుకు సిద్ధమైంది. ఈ మేరకు ఖతార్‌లోని అఫ్గన్ ప్రభుత్వ ప్రతినిధులు తాలిబన్ల ముందు ఈ ప్రతిపాదన ఉంచినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. దేశంలో శాంతిని నెలకొల్పే ఉద్దేశంతో మధ్యవర్తిగా ఉన్న ఖతార్‌కు ఈ ప్రతిపాదన ఉంచినట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. అఫ్గానిస్థాన్‌లోని ఇప్పటికే కీలక ప్రాంతాలు తాలిబన్ల వశమైన నేపథ్యంలో కాబూల్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
By August 13, 2021 at 08:33AM
No comments