Breaking News

CJI చట్టాలను ఎందుకు చేస్తున్నారో తెలియడం లేదు.. జస్టిస్ ఎన్వీ రమణ సంచలన వ్యాఖ్యలు


సర్వోన్నత న్యాయస్థానం ప్రాంగణంలో 75వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని భారత ప్రధాన న్యాయమూర్తి జాతీయ జెండాను ఎగురవేశారు. సుప్రీంకోర్టు బార్‌ అసోసియేషన్‌ ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో చీఫ్ జస్టిస్ మాట్లాడుతూ.. చట్టసభల తీరుపై విమర్శనాత్మక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం చట్టసభల్లో శాసనాలపై అర్ధవంతమైన చర్చలు జరగడంలేదని ఆయన అభిప్రాయపడ్డారు. నిర్మాణాత్మక చర్చలు జరగకపోవడంతో చట్టాల్లో లోపాలు, సందిగ్ధతలు నెలకుని ప్రభుత్వాలకు నష్టం, ప్రజలకు కష్టం మిగులుతోందని అన్నారు. ‘‘మనం ఇంతవరకు ఏం సాధించాం, ఏం సాధించలేకపోయాం అన్న విషయాలను సమీక్షించుకోవాలి.. స్వాతంత్య్రోద్యమానికి న్యాయవాదులే నేతృత్వం వహించారు. అప్పట్లో మహాత్మా గాంధీ, సర్దార్‌ వల్లభ్‌బాయ్ పటేల్‌, జవహర్‌లాల్ నెహ్రూ, బాబూ రాజేంద్రప్రసాద్‌ ఇలా ఏ యోధుడి పేరు చెప్పినా అందరూ న్యాయరంగం నుంచి వచ్చిన వారే.. దేశం కోసం కేవలం వృత్తినేకాకుండా సర్వస్వాన్ని త్యాగం చేశారు. తొలి లోక్‌సభ, రాజ్యసభలతోపాటు, రాష్ట్రాల అసెంబ్లీలు న్యాయవాదులతో నిండిపోయి ఉండేవి. కానీ కాలక్రమంలో దురదృష్టవశాత్తు చట్టసభల్లో ఎలాంటి మార్పులు సంతరించుకున్నాయో అందరూ చూస్తున్నారు. అప్పుడు చట్టాలపై సభలో చర్చలు చాలా నిర్మాణాత్మకంగా జరిగేవి.. పారిశ్రామిక వివాదాల చట్ట సవరణపై జరిగిన చర్చలో తమిళనాడుకు చెందిన సీపీఎం సభ్యుడు రామమూర్తి ఆ బిల్లులోని నిబంధనలు కార్మికులపై ఎలాంటి ప్రభావం చూపుతాయో వివరిస్తూ మాట్లాడటం నేను చూశాను.. అప్పట్లో విభిన్న చట్టాలపై విస్తృతంగా చర్చించేవారు.. దానివల్ల ఆ చట్టాలకు భాష్యం చెప్పే అవకాశం కోర్టులకు తక్కువగా ఉండేది. చట్టాల ఉద్దేశం, వాటిని ఎందుకు తీసుకొచ్చారన్న అంశాలు అప్పట్లో స్పష్టంగా ఉండేవి.. ప్రస్తుతం చేసే చట్టాల్లో చాలా లోపాలు, ఎన్నో సందిగ్ధతలు ఉంటున్నాయి. చట్టాల్లో స్పష్టత కొరవడుతోంది.. ఎందుకోసం చట్టాలు చేస్తున్నారన్నదీ తెలియకుండా ఉంది.. అవి చాలా వివాదాలు, అసౌకర్యాలకు దారితీస్తున్నాయి. ఫలితంగా ప్రభుత్వానికి నష్టం.. ప్రజలకు కష్టం మిగులుతోంది. చట్టసభల్లో మేధావులు, లాయర్లు లేకపోవడంవల్ల ఇలాంటివి జరుగుతున్నాయి. ఇంతకుమించి చెప్పడానికేమీలేదు’’ అని వ్యాఖ్యానించారు. దేశానికి స్వాతంత్ర వచ్చిన తర్వాత ఈ 75 ఏళ్లలో సుప్రీంకోర్టు పాత్రపై జస్టిస్‌ రమణ సంతృప్తి వ్యక్తం చేశారు. ఇదిలా ఉండగా, జస్టిస్ ఎన్వీ రమణ వ్యాఖ్యలపై కేంద్ర న్యాయశాఖ మంత్రి ట్విట్టర్‌లో స్పందించారు. చట్టాలపై చర్చ జరగకపోవడానికి ప్రతిపక్షాలే కారణమని ఆయన ఆరోపించారు. ‘పార్లమెంట్‌లో చర్చపై గౌరవనీయులైన భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ ఆందోళనను తాను అర్ధం చేసుకున్నాను.. నేను తొలిసారి పార్లమెంట్‌లోకి అడుగుపెట్టిన తర్వాత సీనియర్ల నుంచి చాలా నేర్చుకున్నాను.. ప్రస్తుతం యువ ఎంపీలు ఆపేయమంటున్నారు’ అని ట్వీట్ చేశారు.


By August 16, 2021 at 07:43AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/chief-justice-nv-ramana-sensational-comments-on-debate-in-parliament/articleshow/85358608.cms

No comments