ఆ గుడిలో మద్యం, కోడి మాంసంతో నైవేద్యం.. మగాళ్లు మాత్రమే అర్హులు!
వర్షాలు కురవాలని వేడుకుంటూ మద్యం, మాంసం నైవేద్యంగా సమర్పించే వింత సంప్రదాయం తమిళనాడులోని ఓ ఆలయంలో కొనసాగుతోంది. అంతేకాదు, ఇక్కడ వేడుకల్లో మగవాళ్లు మాత్రమే పాల్గొనడం మరో ప్రత్యేకత. వర్షాలు సమృద్ధిగా కురవాలని ఈ వేడుకను ఏటా నిర్వహిస్తారు. తమిళనాడులోని మదురై జిల్లా మేలూరు సమీపంలోని ఎట్టిమంగళంలోని ప్రాచీనమైన సక్కివీరన్ ఆలయంలో ఈ ఆచారం తరతరాలుగా కొనసాగుతోంది. ఆలయానికి భక్తులు సమర్పించే కోళ్లను బలిచ్చి, మట్టి పాత్రల్లో మాంసం వండుతారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో మద్యం సీసాలను వరుసగా ఉంచుతారు. ఆలయ పూజారి ప్రత్యేక పూజల అనంతరం ఆ మద్యం బాటిళ్లను భక్తులకు అందజేస్తారు. అయితే, మద్యం అలవాటు ఉన్న భక్తులకు మాత్రమే వాటిని అందజేయడం విశేషం. అనంతరం అందరూ ఆలయ ప్రాంగణంలోని మద్యం సేవించి నైవేధ్యంగా సమర్పించిన కోడి మాంసాన్ని తింటారు. ఇలా చేస్తే వర్షాలు సమృద్ధిగా కురుస్తాయని తమ పూర్వీకులు చెప్పేవారని, తాము కూడా ఆ వేడుకలను కొనసాగిస్తున్నామని స్థానికులు తెలిపారు. తిరుమంగళం తాలుకా వడక్కంపట్టి గ్రామంలో ఉన్న మునీశ్వరుడి ఆలయంలో 'మటన్ బిర్యానీ' ప్రసాదంగా పెడుతుంటారు. అక్కడ గత 85 ఏళ్లుగా ఈ ఆనవాయితీ కొనసాగుతోంది. ఏటా జనవరి 25న మునీశ్వరుడి ఆలయంలో ఉత్సవాలు నిర్వహిస్తుంటారు. ఇందులో భాగంగా 2000కేజీల బాస్మతి రైస్, దానికి సరిపడా మటన్‌తో రుచికరమైన బిర్యానీ తయారుచేస్తారు. ఆరోజు ఆలయానికి వచ్చే భక్తులందరికీ ఇదే బిర్యానీని ప్రసాదంగా అందజేస్తారు.
By August 10, 2021 at 11:46AM
No comments