Breaking News

ఆ విషయంలో వెనక్కి తగ్గేదిలేదు: తాలిబన్ల దురాక్రమణపై బైడెన్ కీలక ప్రకటన


అఫ్గానిస్థాన్‌లో మళ్లీ తాలిబన్ల రాజ్యం ఏర్పడటానికి తీసుకున్న నిర్ణయాలే కారణమని ప్రపంచ వ్యాప్తంగా విమర్శలు వస్తున్న సంగతి తెలిసిందే. అమెరికా-నాటో దళాల ఉపసంహరణ ద్వారా తాలిబన్ల చేతికి దేశాన్ని అప్పజెప్పాడంటూ అఫ్గన్‌ ప్రభుత్వం-ప్రజలు సైతం బైడెన్‌పై దుమ్మెత్తి పోశారు. మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సైతం బైడెన్‌పై తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు. ఈ నేపథ్యంలోనే అగ్రరాజ్య అధ్యక్షుడు ఈ అంశంపై తొలిసారి నోరు విప్పారు. సోమవారం వైట్‌హౌస్‌ నుంచి జాతినుద్దేశించి మాట్లాడిన .. అఫ్గాన్‌ నుంచి సైనిక బలగాల ఉపసంహరణ నిర్ణయం సరైందేనని సమర్థించుకున్నారు. ఆ నిర్ణయానికి తాను కట్టుబడి ఉంటానని స్పష్టం చేశారు. తాము ఊహించిన దానికంటే వేగంగా తాలిబన్లు అఫ్గాన్‌ ప్రభుత్వాన్ని పడగొట్టారని బైడెన్ వ్యాఖ్యానించారు. తన ముందు రెండు మార్గాలు ఉన్నాయని, ఈ ఏడాది అమెరికా దళాలను అఫ్గాన్‌ నుంచి వెనక్కి రప్పించడం లేదా మరిన్ని సైనిక దళాలను అఫ్గాన్‌కు పంపి మూడో దశాబ్దంలో కూడా యుద్ధాన్ని కొనసాగించడం అని అన్నారు. అయితే గతంలో చేసిన తప్పులను తాను చేయకూడదని నిర్ణయించుకున్నానని, అందుకే సైనిక బలగాల ఉపసంహరణ నిర్ణయానికే కట్టుబడి ఉన్నానన్నారు. ఈ నిర్ణయం అమెరికాకు సరైందనేనని, అమెరికాపై ఉగ్రదాడులను నిరోధించడమే మా లక్ష్యమని బైడెన్‌ స్పష్టం చేశారు. ఆఫ్గనిస్తాన్‌లో అమెరికా ప్రజలపై తాలిబన్లు దాడి చేస్తే తీవ్ర పరిస్థితులు ఉంటాయని బైడెన్‌ హెచ్చరించారు. ఆ దేశంలో జాతి నిర్మాణం తమ బాధ్యత కాదని, అమెరికాపై ఉగ్రవాదులను నిరోధించడమే లక్ష్యమని స్పష్టం చేశారు. 20 ఏళ్ల క్రితం ఆఫ్ఘనిస్థాన్‌లో ఆల్‌ఖైదాను అంతం చేశామని, బిన్‌ లాడెన్‌ను పట్టుకునేందుకూ వెనక్కి తగ్గలేదన్నారు. రెండు దశాబ్దాలుగా అఫ్గన్‌ సైన్యానికి శిక్షణ ఇచ్చినా, ప్రభుత్వానికి మనోధైర్యం అందించినా.. వాళ్లు సరైన సమయంలో పోరాట శక్తిని ప్రదర్శించలేకపోయారని బైడెన్ వ్యాఖ్యానించారు. ప్రస్తుతం ఆఫ్ఘనిస్థాన్‌లో పరిణామాలను నిశితంగా పరిశీలిస్తున్నామని, అవసరమైతే అప్ఘన్‌‌లో ఉగ్రవాదంపై పోరాటం చేస్తామన్నారు. అఫ్గన్‌ ప్రజలకు అమెరికా సహకారం ఎప్పుడూ ఉంటుంది అని బైడెన్‌ స్పష్టం చేశారు.


By August 17, 2021 at 08:33AM


Read More https://telugu.samayam.com/latest-news/international-news/us-president-joe-biden-says-he-stands-squarely-behind-afghanistan-decision/articleshow/85389983.cms

No comments