Breaking News

లక్నో చెంప దెబ్బ ఘటన: క్యాబ్ డ్రైవర్ సంచలనం.. అదిరిపోయే ట్విస్ట్


లక్నోలో నడిరోడ్డుపై ఓ యువతి క్యాబ్ డ్రైవర్‌ను చెంప దెబ్బలు కొట్టిన ఘటన సంచలనమైనంది. వాహనాలు వెళ్తుండగానే.. రోడ్డు దాటుతున్న ప్రియదర్శిని అనే యువతి.. క్యాబ్ తనను ఢీకొట్టబోయిందనే కారణంతో డ్రైవర్‌ను కార్లో నుంచి బయటకు లాగి మరీ చేయి చేసుకుంది. అడ్డుకోబోయిన మరో వ్యక్తిపై సైతం ప్రతాపం చూపించింది. కాగా ఈ ఘటనలో శాంతికి భంగం కలిగించారంటూ.. పోలీసులు ముందుగా క్యాబ్ డ్రైవర్‌, అతడి స్నేహితులపైనే కేసు నమోదు చేయడం గమనార్హం. వీడియో, సీసీటీవీ ఫుటేజీ బయటకు వచ్చాక.. అసలు తప్పు ఆ యువతిదేనని తేలింది. సోషల్ మీడియాలో అరెస్ట్ లక్నో గర్ల్ అంటూ పెద్ద ఎత్తున నెటిజన్లు పోస్టులు చేశారు. ఒత్తిడి పెరిగిపోవడంతో పోలీసులు ఆ యువతిపై కేసు నమోదు చేశారు. ఈ ఘటనపై క్యాబ్ డ్రైవర్ మాట్లాడుతూ.. ‘‘తను కార్లో నుంచి నా ఫోన్‌ను లాగేసుకుంది. దాని ముక్కముక్కలుగా పగలగొట్టింది. కారు సైడ్ మిర్రర్లను సైతం పగలగొట్టింది. మమ్మల్ని ఇద్దర్నీ పోలీసు స్టేషన్‌కు తీసుకొచ్చారు. పోలీసులు నాపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. కానీ తనపై ఎలాంటి చర్యా తీసుకోలేదు. పోలీసులు నాకు 24 గంటలపాటు ఆహారం పెట్టలేదు. ఆ మహిళ చెప్పిందే విన్నారు, కానీ.. నా తప్పేంటి సార్.. అని పదే పదే అడిగినా పట్టించుకున్న నాథుడు లేడు. నేనో పేద క్యాబ్ డ్రైవర్‌ను. నాకు ఏం అక్కర్లేదు. నా ఆత్మగౌరవాన్ని నాకు తిరిగిస్తే చాలు. నాకు న్యాయం కావాలి’’ ఈ ఘటనపై యువతి స్పందిస్తూ.. ‘‘క్యాబ్ డ్రైవర్ కారును జీబ్రా క్రాసింగ్ వైట్ లైన్ మీదకు పోనిచ్చాడు. ఇది నిబంధనలను ఉల్లంఘించడం కాదా...? సీసీటీవీ ఫుటేజీని పరిశీలించండి. తప్పెవరిదో తేల్చండి. ఒకవేళ నేను చనిపోయి ఉంటే.. పోస్టుమార్టం చేసి నా బాడీని ఇంటికి పంపించేవారా..?’’ అని వాపోయింది. ఈ విషయమై నెటిజన్లు స్పందిస్తూ.. ఒక వేళ క్యాబ్ డ్రైవర్‌దే తప్పని అనుకున్నా సరే.. అలా నడి రోడ్డుపై చేయి చేసుకోవడం ఎంత వరకు సబబు అని ప్రశ్నిస్తున్నారు.


By August 04, 2021 at 08:39AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/lucknow-cab-driver-sensational-comments-on-woman-beating-issue/articleshow/85027142.cms

No comments