Breaking News

విమానం గాల్లో ఉండగా అఫ్గన్ మహిళకు ప్రసవవేదన.. పైలట్ సమయస్ఫూర్తితో దక్కిన రెండు ప్రాణాలు


అఫ్గనిస్థాన్‌ను తాలిబన్ల ఆక్రమించుకోవడంతో.. 90వ దశకంలో వారి అరాచకాలు గుర్తుకొచ్చి ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. మళ్లీ దుర్మార్గపు పాలన మొదలు కావడంతో దేశాన్ని విడిచిపెట్టేందుకు అఫ్గన్లు వెనుకాడటం లేదు. సర్వస్వాన్ని వదిలి తమ తర్వాత తరాల్ని కాపాడుకోడానికి విదేశాలకు పయనమవుతున్నారు. గతవారం రోజులుగా కాబూల్ విమానాశ్రయంలో వేలాది మంది అఫ్గన్లు పడిగాపులు కాస్తూ దొరికిన విమానం ఎక్కేస్తున్నారు. దేశం విడిచి వెళ్లాలనే తాపత్రయంలో తమ ప్రాణాలను కూడా లెక్కచేయడం లేదు. ఈ నేపథ్యంలో శనివారం అఫ్గన్‌కు చెందిన ఓ నిండు గర్భిణి.. అమెరికా ఎయిర్‌ఫోర్స్‌ సీ-17 విమానం ఎక్కారు. శరణార్థులు ఎక్కిన ఈ విమానం జర్మనీలోని అమెరికాకు చెందిన రామ్‌స్టెయిన్‌ బేస్‌కు వెళ్తోంది.విమానం టేకాఫ్ అయిన తర్వాత భూమి నుంచి 8500 మీటర్ల ఎత్తుకు చేరుకోవడంతో ‘లో ఎయిర్‌ ప్రెషర్‌’ ఏర్పడింది. దీంతో గర్బిణికి పురిటి నొప్పులు మొదలయి.. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఎదురవడంతో ఆమె పరిస్థితి ఆందోళనకరంగా మారింది. దీంతో తక్షణమే అప్రమత్తమైన పైలట్‌.. వెంటనే విమానాన్ని తక్కువ ఎత్తుకు దింపారు. లోపల వాయు పీడనాన్ని పెంచి.. ఆమె ప్రాణాలను నిలబెట్టారు. రామ్‌స్టెయిన్‌లో ల్యాండ్‌ అయ్యాక వైద్య సిబ్బంది హుటాహుటిన ఆమె వద్దకు చేరుకున్నారు. విమానంలోనే ఆ మహిళకు ప్రసవం చేయగా.. పండంటి ఆడపిల్లకు జన్మనిచ్చింది. అనంతరం తల్లీ బిడ్డలను చికిత్స కోసం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా వెల్లడించిన అమెరికా ‘ఎయిర్‌ మొబిలిటీ కమాండ్‌’ అధికారులు.. ఇద్దరి పరిస్థితి నిలకడగా ఉందని తెలిపారు. ‘ఆగస్టు 21న అమెరికా వైమానిక దళం విమానం సీ-17లో ప్రయాణిస్తున్న అఫ్గన్ మహిళ, ఆమె కుటుంబానికి 86 మెడికల్ గ్రూప్ వైద్య సిబ్బంది సహాయం చేశారు. జర్మనీలోని రామ్‌స్టెయిన్ ఎయిర్ బేస్‌లో ల్యాండ్ అయిన కొద్ది క్షణాల్లో విమానంలోనే ఆమె బిడ్డను ప్రసవించింది.. విమానం బయలుదేరి మధ్య ఆసియాలో ఇంటర్మీడియట్ స్టేజ్‌‌కు చేరుకున్నప్పుడు ఆమె ప్రసవ వేదనకు గురయ్యింది. దీంతో కమాండర్ విమానంలో గాలి పీడనాన్ని పెంచడానికి తక్కువ ఎత్తుకు దిగాలని నిర్ణయించుకున్నారు.. ఇది ఆమె ప్రాణాలను కాపాడటానికి సహాయపడింది’ అని అన్నారు. ఈ ట్వీట్‌పై నెటిజన్ల ప్రశంసలు కురిపిస్తున్నారు. సైనికాధికారుల సమయస్ఫూర్తిని కొనియాడుతూ కామెంట్లు పెడుతున్నారు.


By August 23, 2021 at 06:57AM


Read More https://telugu.samayam.com/latest-news/international-news/pregnant-woman-makes-it-to-us-airforce-evacuation-flight-from-afghanistan-gives-birth-onboard/articleshow/85550956.cms

No comments