Breaking News

అధికారం ఉందని ఇష్టారీతిన అరెస్ట్‌లు కుదరవు.. సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు!


చట్టం ప్రకారం అధికారం ఉందని చెప్పి ఇష్టారీతిన అరెస్టులు కుదరవని సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. రొటీన్‌ వ్యవహారంగా భావించి అరెస్టులు చేస్తే అది వ్యక్తుల గౌరవ ప్రతిష్ఠలకు చెప్పలేనంత హాని కలిగించినట్టవుతుందని పేర్కొంది. వ్యక్తిగత స్వేచ్ఛ చాలా ముఖ్యమైనదని, ఇది రాజ్యాంగం ప్రసాదించిన హక్కని ఉద్ఘాటించింది. యూపీకి చెందిన సిద్ధార్థ అనే వ్యాపారవేత్త బెయిల్ పిటిషన్‌పై విచారణ సందర్భంగా జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్, జస్టిస్ హృషీకేశ్‌ రాయ్‌ల ద్విసభ్య ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది. ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి విచారణకు గైర్హాజరు కారని దర్యాప్తు అధికారి భావిస్తే, అలాంటి వారిని అరెస్టు చేయాల్సిన అవసరం లేదని ధర్మాసనం తెలిపింది. తీవ్రమైన నేరానికి పాల్పడినప్పుడు, సాక్షులను ప్రభావితం చేస్తారని భావించినప్పుడే అరెస్టులు చేయాల్సి ఉంటుందని వ్యాఖ్యానించింది. అరెస్టు చేయడం చట్టబద్ధమే కాబట్టి అరెస్టు చేస్తామంటే కుదరదని తేల్చి చెప్పింది. ‘అధికారం కలిగి ఉండటం.. ఆ అధికారాన్ని న్యాయ బద్ధంగా ఉపయోగించడం మధ్య తేడాను గమనించాలి’ అని సూచించింది. నిందితులు దర్యాప్తునకు సహకరిస్తుంటే అరెస్టు చేయాల్సిన అవసరం ఏముందని నిలదీసింది. ఏయే సందర్భాల్లో అరెస్టులు చేయాలనేదానిపై 1994లోనే సర్వోన్నత న్యాయస్థానం తీర్పు ఇచ్చిందని, కానీ కొన్ని ట్రయల్‌ కోర్టులు కూడా అరెస్టులు చేయాలని పట్టుపడుతున్నాయని వ్యాఖ్యానించింది. వ్యాపారవేత్త సిద్ధార్థపై ఏడేళ్ల కిందట నమోదైన కేసులో ముందస్తు బెయిల్‌‌కు ప్రయత్నించగా.. అలహాబాద్‌ హైకోర్టు తిరస్కరించింది. దీంతో నిందితుడు సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. విచారణకు హాజరయి, ఛార్జ్‌షీట్ కూడా నమోదయిన తరువాత మళ్లీ అరెస్టు చేయాల్సిన అవసరం ఏముందని ధర్మాసనం ప్రశ్నించింది. ఐపీసీ సెక్షన్‌ 170ను పోలీసులు, కోర్టులు తప్పుగా అన్వయిస్తున్నాయంటూ నిందితుడి తరఫు న్యాయవాది చేసిన వాదనతో ధర్మాసనం ఏకీభవించింది. ఈ సెక్షన్‌లోని ‘కస్టడీ’ అన్న పదాన్ని ‘అరెస్టు’గా అర్థం చేసుకుంటున్నాయంటూ అంగీకరించింది. కస్టడీ అంటే ఛార్జ్‌షీట్ దాఖలు సమయంలో నిందితుడిని కోర్టు ముందుంచడమేనని వివరించింది. కస్టడీ అంటే జ్యుడీషియల్‌ కస్టడీయో, పోలీసు కస్టడీయో కాదని స్పష్టం చేసింది. ఛార్జ్‌షీట్ సమర్పించడానికి ముందు నిందితుడిని తప్పకుండా అరెస్టు చేయాల్సి ఉంటుందని ట్రయల్‌ కోర్టులు చెప్పడం కూడా సరికాదని అభిప్రాయపడింది. అనంతరం ఈ కేసులో నిందితుడు సిద్ధార్థకు ముందస్తు బెయిల్‌‌ను ధర్మాసనం మంజూరు చేసింది.


By August 21, 2021 at 10:39AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/if-arrest-is-made-routine-it-could-cause-incalculable-harm-says-supreme-court/articleshow/85508071.cms

No comments