Breaking News

జూలో గొడవపడ్డ సందర్శకులు.. అవాక్కయిన జంతువులు.. అదే రోజు రాత్రి అవి కూడా..


జూలో ఆనందంగా గడపడానికి వచ్చిన పర్యాటకులు.. గొడవకు దిగి ఒకరిపై ఒకరు దాడిచేసుకున్నారు. మహిళలు జుట్లు పీక్కుని, కిందపడిపోయి తన్నుకున్నారు. ఇద్దరి మధ్య జరిగిన వాగ్వాదం చిలికిచిలికి గాలివానలా మారినట్టు రెండు కుటుంబాలు తీవ్రస్థాయిలో కొట్టుకునే వరకు దారితీసింది. ఈ ఘటనతో ఇతర పర్యాటకులు విస్మయానికి గురికాగా.. చివరికి అక్కడే ఉన్న జంతువులు కూడా ఈ ఘర్షణను చూస్తూ గుడ్లప్పగించాయి. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఈ ఘటన రాజధాని బీజింగ్‌లోని వైల్డ్లైఫ్ పార్క్లో ఆదివారం చోటుచేసుకుంది. సందర్శకులు పెద్ద సంఖ్యలో జంతువులను చూసేందుకు తరలివచ్చారు. అయితే ఇద్దరు సందర్శకుల మధ్య గొడవ జరిగి.. రెండు కుటుంబాలు కొట్టుకునే స్థాయికి వెళ్లింది. రెండు గ్రూపులుగా విడిపోయిన మహిళలు ఒకరి జుట్లు ఒకరు పట్టుకుని ఘర్షణ పడ్డారు. ఇదే సమయంలో చిన్నారితో ఉన్న ఓ మహిళను ఓ వ్యక్తి కాలితో గట్టిగా తన్నడంతో ఆమె చేతిలో నుంచి చిన్నారి జారి కింద పడిపోయిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. చివరికి జూలోని భద్రతా సిబ్బంది జోక్యం చేసుకుని పరిస్థితిని అదుపుచేశారు. అయితే గొడవకు గల కారణాలు తెలియరాలేదు. ఈ గొడవ అక్కడే ఉన్న పర్యాటకులే కాదు.. చివరికి జంతువులు కూడా నిలబడి చూస్తూ ఉండిపోయాయని జూ అధికార యంత్రాంగం ఓ ప్రకటన విడుదల చేసింది. ఈ ఘటన జంతువులపై ప్రభావం చూపిందని, మనుషులను అనుకరిస్తూ.. జంతువులు కూడా రాత్రి ఒకదానిపై మరొకటి దాడికి దిగినట్టు చైనా అధికారిక పత్రిక గ్లోబల్ టైమ్స్ తన కథనంలో పేర్కొంది. ఈ గొడవపై నెటిజన్లు సైతం అసహనం వ్యక్తం చేస్తున్నారు. విచక్షణ కోల్పోయి మనుషులు కొట్టుకోవడం చూసి జంతువులు నవ్వుకున్నాయని కామెంట్లు పెడుతున్నారు.


By August 10, 2021 at 08:47AM


Read More https://telugu.samayam.com/latest-news/international-news/animals-in-zoo-fight-after-witnessing-tourists-tussle-in-beijing-in-china/articleshow/85199117.cms

No comments