Breaking News

జస్టిస్ ఎన్వీ రమణ చొరవతో నాలుగేళ్ల తర్వాత ఒక్కటయిన విడిపోయిన జంట!


21ఏళ్లుగా నానుతున్న గుంటూరు దంపతుల విడాకుల కేసు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ రమణ చొరవతో సుఖాంతమైన విషయం తెలిసిందే. ఆ జంటకు చక్కటి తెలుగులో నచ్చజెప్పిన జస్టిస్‌ రమణ.. ఇద్దరూ కలిసి ఉండేందుకు ఒప్పించారు. తాజాగా, మరో జంట విడిపోవకుండా జస్టిస్‌ ఎన్వీ రమణ నేతృత్వంలోని ధర్మాసనం వారిని ఒక్కటి చేసింది. దాదాపు నాలుగేళ్ల నుంచి విడిగా ఉంటున్న పుణే జంటతో న్యాయమూర్తులు మాట్లాడి.. కలిసి జీవించేలా నచ్చజెప్పారు. పుణెకు చెందిన భర్త, రాంచీకి చెందిన భార్యతో వీడియో ద్వారా సంభాషించారు. కేసు వివరాల్లోకి వెళితే పుణేకు చెందిన వ్యక్తి రవి కిరణ్ రాకేశ్‌కు రాంచీ యువతితో నాలుగేళ్ల కిందట వివాహం జరిగింది. అయితే, పెళ్లయిన నెల రోజులకే అదనపు కట్నం తేవాలని అత్తింటివారు వేధించడంతో ఆమె పుట్టింకి వెళ్లిపోయింది. భర్త రవి, అత్తమామలు వేధింపులకు గురిచేయడంతో ఆమె కేసు పెట్టింది. దీంతో ఆయనకు దిగువ కోర్టులో బెయిల్ లభించలేదు. చివరకు బెయిల్ కోసం సుప్రీంకోర్టును ఆశ్రయించగా.. భార్యపై విడాకులు సహా పలు కేసులు వేశారు. ఈ వ్యవహారంపై జస్టిస్‌ ఎన్‌.వి.రమణ, జస్టిస్‌ సూర్యకాంత్‌ల ధర్మాసనం బుధవారం విచారణ చేపట్టింది. జస్టిస్‌ సూర్యకాంత్‌.. భార్యభర్తలు ఇరువురితోనూ హిందీలో మాట్లాడారు. ఈ సమయంలో భార్య తన అభిప్రాయం చెబుతూ.. ‘నేను ఎందుకు విడాకులు ఇవ్వాలి.. ఆయనతో కలిసి నేను బతకాలనుకుంటున్నాను.. ఆయనంటే ఇప్పటికే ప్రేమ ఉంది’ అని చెప్పింది. భర్త దగ్గరకు వెళ్లడానికి తనకు ఇష్టమేనని, ఎటువంటి అభ్యంతరం లేదని న్యాయమూర్తులకు ఆమె చెప్పింది. ఆమె మాటలను బట్టి భర్త, అత్తమామలే సమస్యలకు కారణమని ధర్మాసనం గుర్తించింది. భర్త, అతడి తల్లిదండ్రులు ఇబ్బందులకు గురిచేయడంతో వారికి జైలు శిక్ష విధించే అవకాశం ఉంది. ఆ పరిస్థితి రాకుండా ఉండేందుకు ధర్మాసనం సూచనలు చేసింది. భార్యపై పెట్టిన కేసును ఉపసంహరించుకుని, రెండు వారాల్లోగా అఫిడ్‌విడ్ దాఖలు చేయాలని తెలిపింది. అంతేకాదు, భార్యను కూడా తీసుకురావాలని సూచించింది. పుట్టింటి నుంచి ఆమె తీసుకొచ్చి, గతంలో ఏం జరిగిందో మరిచిపోయి కొత్త జీవితాన్ని మొదలుపెట్టాలని సూచించింది. అలాగే, మహిళను కూడా భర్త, ఆయన తల్లిదండ్రులపై పెట్టిన కేసును ఉపసంహరించుకోవాలని సలహా ఇచ్చింది. రవి కిరణ్ ప్రవర్థన కొన్ని రోజులు గమనిస్తామని, కోర్టుకు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలి. లేదంటే మళ్లీ మీరు జైలుకు వెళ్లాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ‘మీ అనుభవం, నేపథ్యంతో భర్త న్యాయపోరాటం కొనసాగించడానికి బదులుగా మీరు మీ ఛాంబర్‌లో వివాదాన్ని పరిష్కరించుకోవాలి’ రవి కిరణ్ తరఫున హాజరైన సీనియర్ న్యాయవాది, హైకోర్టు మాజీ జడ్జ్ అంజన్ ప్రకాశ్‌కు జస్టిస్ ఎన్వీ రమణ సూచించారు. దీనికి అంగీకరించిన జస్టిస్ ప్రకాశ్.. కానీ, ఈ రోజుల్లో యువకులు అనేక ఉదంతాలను చూస్తున్నారు.. అది వారి మనస్సులో బలంగా నాటుకుంటోందని తెలిపారు.


By August 05, 2021 at 10:51AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/supreme-court-justice-nv-ramana-bench-saves-maharashtra-young-couple-marriage/articleshow/85060490.cms

No comments