మూణ్నాళ్ల ముచ్చటగా సివిల్స్ టాపర్స్ వైవాహిక బంధం.. విడిపోయిన ఆ ప్రేమ జంట!
సివిల్స్‌లో టాపర్స్‌గా నిలిచి, శిక్షణ సమయంలోనే ప్రేమలో పడి మతాంతర వివాహం చేసుకున్న టీనా దాబి, అతహర్ ఆమిర్‌ఖాన్ దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే, ఈ జంట వైవాహిక బంధం మూణ్నాళ్ల ముచ్చటగా మిగిలిపోయింది. ఈ దంపతులకు జైపుర్ కుటుంబ న్యాయస్థానం మంగళవారం విడాకులు మంజూరు చేసింది. పరస్పర అంగీకారంతోనే టీనా, అమిర్‌ఖాన్‌లకు విడాకులు మంజూరయ్యాయి. 2018 ఏప్రిల్‌లో జరిగిన వీరి వివాహం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమై, మీడియాలో మార్మోగిపోయింది. ఢిల్లీలో జరిగిన ఈ వివాహానికి ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు, నాటి లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ సహా పలువురు కేంద్ర మంత్రులు హాజరయ్యారు. రాజస్థాన్ కేడర్‌కు చెందిన ఈ ఇద్దరికీ జైపుర్‌లో పోస్టింగు ఇచ్చారు. ఆ తర్వాత అథర్ ఆమిర్ ఖాన్ జమ్మూ కశ్మీర్‌కు డిప్యుటేషనుపై వెళ్లా. ఢిల్లీలోని లేడీ శ్రీరాం కాలేజీలో డిగ్రీ పూర్తిచేసిన టీనా దాబి.. 2015 సివిల్ సర్వీసెస్ పరీక్షకు హాజరై తొలి ప్రయత్నంలోనే టాపర్‌గా నిలిచారు. మొదటి ప్రయత్నంలోనే సివిల్స్‌కు ఎంపికావడమే కాదు... టాపర్‌గా నిలిచిన మొదటి దళిత యువతిగా దేశం దృష్టిని ఆకర్షించారు. ఆదే ఏడాది సివిల్స్‌లో కశ్మీర్‌లోని అనంతనాగ్‌కు చెందిన అథర్ ఆమిర్‌ఖాన్ రెండో ర్యాంకు సాధించారు. శిక్షణ కాలంలోనే ఇరువురి మధ్య ఏర్పడిన పరిచయం ప్రేమకు దారితీసింది. అక్కడి నుంచి 2018లో వివాహం జరిగే వరకూ వీరి ప్రణయ కలాపాలు ఓ రొమాంటిక్ సినిమాను తలపించేలా సాగాయి. కుటుంబసభ్యులను ఒప్పించి ఒకటైన ఈ జంట వైవాహిక బంధం రెండేళ్లకే బీటలు వారింది. తమకు విడాకులు కావాలంటూ గతేడాది నవంబరులో వీరిద్దరూ కోర్టును ఆశ్రయించారు. చివరకు చట్టపరంగా విడిపోయారు. తాము విడిపోవడానికి మతపరమైన అంశాలేవీ కారణం కాదని టీనా డాబి చెప్పడం గమనార్హం. గతేడాది నవంబరులో రాజస్థాన్ ఆర్ధిక శాఖ జాయింట్ సెక్రెటరీగా టీనా దాబి చేరారు. పాఠశాల విద్యను జీసెస్ అండ్ మేరీ కాన్వెంట్‌లో పూర్తిచేసిన టీనా దాబి.. లేడీ శ్రీరాం కాలేజీ నుంచి పొలిటికల్ సైన్స్‌లో డిగ్రీ పట్టా పుచ్చుకున్నారు. ఇక, అథర్ తొలిసారి సివిల్స్ రాసి ఇండియన్ రైల్వేస్‌లో ఉద్యోగిగా చేరారు. తర్వాత 2015లో రెండో ప్రయత్నంలోనే రెండో ర్యాంక్ సాధించారు.
By August 12, 2021 at 08:05AM
No comments