Breaking News

Afghanistan మొదలైన అరాచకం.. హింసకు తెగబడి ట్రైలర్ చూపించిన తాలిబన్లు


అందర్నీ క్షమించేశామని, ఎటువంటి ప్రతీకార దాడులకు పాల్పబడబోమని ప్రకటించిన 24 గంటల్లోనే తాలిబన్లు తమ ముసుగు తొలగించారు. సహజ స్వభావానికి విరుద్ధంగా మూడు రోజులు కాస్త మెతక వైఖరితో ఉన్న తాలిబన్లు మళ్లీ విధ్వంసకాండకు తెరతీశారు. దీంతో ముష్కర మూకల హామీలు, శాంతివచనాలు కేవలం నీటిమూటలనని తెలిపోయింది. అఫ్గనిస్థాన్ వ్యాప్తంగా పలుచోట్ల బుధవారం హింసకు తెగబడి... రాబోయే రోజుల్లో తమ అరాచక పాలన ఎలా ఉంటుందో ట్రైలర్ చూపించారు. తాలిబన్ల దూరక్రమణను నిరసిస్తూ కాబూల్‌లో కొందరు చేపట్టిన నిరసన ప్రదర్శనపై కాల్పులకు పాల్పడ్డారు. ఈ కాల్పుల్లో ముగ్గురు యువకులు ప్రాణాలు కోల్పోయారు. గతంలో తమకు వ్యతిరేకంగా పోరాడిన ప్రముఖ నేత అబ్దుల్ అలీ మజారీ విగ్రహాన్ని ధ్వంసం చేశారు. మరోవైపు, ఓ ఎమ్యూజ్‌మెంట్ పార్క్‌కి నిప్పంటించారు. తాజా పరిణామాలతో అఫ్గన్‌ ప్రజల్లో భయాందోళనలు మరింత తీవ్రమయ్యాయి. తూర్పు అఫ్గన్‌లోని జలాలాబాద్‌లో తాలిబన్లకు ఊహించని తిరుగుబాటు ఎదురైంది. తాలిబన్లకు వ్యతిరేకంగా ప్రజలు వీధుల్లోకి వచ్చి నిరసన చేపట్టారు. తాలిబన్ల న జెండాలను దింపేసి.. అఫ్గాన్‌ జాతీయ పతాకాన్ని ఎగరేశారు. దీంతో రెచ్చిపోయిన తాలిబన్లు తమ అసలు నైజాన్ని బయటపెట్టారు. లాఠీలతో విరుచుకుపడి, గాల్లోకి కాల్పులు జరిపారు. అనంతరం ఆందోళనకారులపై నేరుగా తూటాలు ప్రయోగించారు. ఈ కాల్పుల్లో ముగ్గురు చనిపోగా, ఆరుగురు గాయపడ్డారు. ఇద్దరు జర్నలిస్టులపైనా తాలిబన్లు దాడి చేశారు. కాబూల్‌ను ఆక్రమించిన తర్వాత ఓ ఎమ్యూజ్‌మెంట్ పార్కులో ఎంజాయ్ చేసిన తాలిబన్లు... బుధవారం అదే పార్కుకు నిప్పంటించారు. దీంతో అందులోని సామగ్రి మొత్తం మంటల్లో కాలిపోతున్న వీడియో వెలుగులోకి వచ్చింది. విగ్రహాలు, బొమ్మలు ఇస్లామిక్‌ ఆచారాలకు వ్యతిరేకమని.. పార్కులో అవి ఉండటం వల్లే నిప్పంటించామని తాలిబన్లు చెప్పినట్లు తెలుస్తోంది.


By August 19, 2021 at 06:47AM


Read More https://telugu.samayam.com/latest-news/international-news/three-killed-in-jalalabad-due-to-taliban-fire-on-protesters-for-replacing-groups-flag/articleshow/85444946.cms

No comments