Breaking News

Afghanistan శాంతి మత్రం జపిస్తున్న తాలిబన్లు.. మహిళల విషయంలో సంచలన నిర్ణయం


అఫ్గనిస్థాన్‌లో మళ్లీ తాలిబన్ల శకం మొదలవ్వడంతో అంతర్జాతీయ సమాజం తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఒకప్పుడు వారి వికృతపాలనలో మగ్గిపోయిన అఫ్గన్లు.. మళ్లీ తమకు చీకటి రోజులొచ్చాయని బిక్కుబిక్కుమంటున్నారు. అయితే, అఫ్గనిస్థాన్‌లో మంగళవారం ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకున్నాయి. దేశాన్ని అక్రమించుకున్న తర్వాత తొలిసారిగా మీడియాతో మాట్లాడిన నేతలు.. యావత్‌ దేశానికి క్షమాభిక్ష పెడుతున్నట్లు ప్రకటించారు. మహిళల హక్కులను గౌరవిస్తామని హామీ ఇచ్చారు. అంతేకాదు, మహిళలకు ప్రభుత్వంలో అవకాశమిస్తామని, వారు కూడా భాగస్వాములు కావాలని తమ సహజ స్వభావానికి విరుద్ధంగా పిలుపునిచ్చారు. రక్తపాత రహితంగా రాజధాని కాబూల్‌ను స్వాధీనం చేసుకున్న తాలిబన్లు.. రెండో రోజూ మంగళవారం కూడా ఎక్కడా విధ్వంసాలకు తెగబడలేదు. శాంతిమంత్రం జపిస్తున్నా.. అఫ్గన్ ప్రజల్లో వారి మాటలు విశ్వాసం నింపడం లేదు. త్వరలోనే వారి అసలు రంగు బయటపెట్టి, ఒకప్పటి అరాచక పాలనను మళ్లీ తీసుకొస్తారనే భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. విదేశాల నుంచి అఫ్గన్‌కు నిధులు నిలిచిపోకుండా ఉండేందుకే వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారని విశ్లేషణలు వెలువడుతున్నాయి. మరో రెండు రోజుల్లో ప్రభుత్వ ఏర్పడే అవకాశముందని, తాలిబనేతర నేతలకూ అందులో చోటుదక్కుతుందని వార్తలొస్తున్నాయి. కాగా, కాబుల్‌లోని ఎమ్యూజ్‌మెంట్ పార్కుల్లో తాలిబన్లు సరదాగా గడుపుతున్న వీడియోలు సోషల్ మీడియాలో హల్‌చల్‌ చేస్తున్నాయి. మహిళల హక్కులను పూర్తిగా హరించినవారిగా పేరున్న తాలిబన్లు తాజాగా ఓ మహిళా యాంకర్‌కు ఇంటర్వ్యూ ఇవ్వడం చర్చనీయాంశమైంది. ఓ ప్రైవేటు వార్తాసంస్థకు చెందిన మహిళా టీవీ యాంకర్‌తో వారు ముఖాముఖి మాట్లాడారు. అలాగే, ‘ నుంచి ఏ దేశానికి ముప్పు ఉండబోదని ప్రపంచ దేశాలకు ఇస్లామిక్ ఎమిరేట్స్ హామీ ఇస్తోంది’అని తాలిబన్ అధికార ప్రతినిధి జబీహుల్లా ముజాహిద్ అన్నారు. అన్ని వైపుల నుంచి ప్రభుత్వం ఏర్పాటుచేస్తామని, యుద్ధాన్ని ఆపేయాలని కోరకుంటున్నామని అన్నారు. ‘మేము ఇంట, బయట ఎవరితో శత్రుత్వం పెట్టుకోం.. మా నేతల ఆదేశాల ప్రకారం అందరినీ క్షమించాం’ అని వ్యాఖ్యానించారు. విదేశీ దళాలతో కలిసి పనిచేసిన మాజీ సైనికులు సహా ఎవరిపైనా ప్రతీకార చర్యలు దిగబోం.. ఎవరి ఇళ్లలోనూ సోదాలు చేపట్టం.. ప్రజా విలువలకు సరిపోయే నియమాలను వర్తించే హక్కు అఫ్గన్లకు ఉంది... కాబట్టి, ఇతర దేశాలు ఈ నియమాలను గౌరవించాలి.. ఇస్లాం ప్రకారం మహిళలకు హక్కులను కల్పిస్తాం.. ఆరోగ్యం సహా అవసరమైన రంగాల్లో వారు పనిచేసుకోవచ్చు’ అని అన్నారు.


By August 18, 2021 at 07:11AM


Read More https://telugu.samayam.com/latest-news/international-news/taliban-declared-no-threat-will-be-posed-to-any-country-from-afghanistan/articleshow/85417696.cms

No comments