Breaking News

Afghanistan కాబూల్‌ను వశం చేసుకున్న తాలిబన్లు.. దేశం విడిచి వెళ్లిపోయిన అధ్యక్షుడు ఘనీ!


అఫ్గానిస్థాన్‌‌లో అంతర్జాతీయ సమాజం ఊహించిందే జరిగింది. అఫ్గన్ మొత్తం తాలిబన్ల తమ గుప్పిట్లోకి తెచ్చుకున్నారు. రాజధాని కాబూల్‌ నగరంలోకి ఆదివారం ప్రవేశించారు. దీంతో అఫ్గన్ అధ్యక్షుడు అష్రఫ్ ఘనీ దేశం విడిచి వెళ్లిపోయారు. అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన ఆయన.. కీలక బృందంతో కలిసి దేశం విడిచివెళ్లినట్లు అఫ్గన్ మీడియా వెల్లడించింది. ప్రస్తుతం తజికిస్తాన్‌కు పారిపోయిన అష్రఫ్‌, అక్కడ నుంచి మరో దేశానికి చేరుకుంటారని తెలుస్తోంది. అన్ని వైపుల నుంచి కాబూల్‌ను తాలిబన్లు చుట్టుముట్టినట్లు అఫ్గన్‌ అంతర్గత వ్యవహారాల శాఖ మంత్రి ప్రకటించారు. అయితే, అఫ్గన్‌ సైన్యం, తాలిబన్లకు మధ్య కాల్పులు జరిగాయా లేదా అనే విషయంపై స్పష్టత లేదు. తాలిబన్లు కాబూల్‌పై ఎలాంటి దాడి చేయలేదని, అధికార మార్పు శాంతియుతంగా జరుగుతుందని అంతర్గత వ్యవహారాల మంత్రిత్వశాఖ పేర్కొంది. ఇందుకోసం ప్రభుత్వంతో సంప్రదింపులు జరుగుతున్నాయని తాలిబన్ల అధికార ప్రతినిధి జబిహుల్లా ముజాహిద్‌ కూడా ప్రకటించారు. ఈ ప్రక్రియ శాంతియుతంగా ముగిసే వరకూ కాబూల్‌కు అన్ని ప్రవేశ మార్గాల వద్ద తాలిబన్‌ సైన్యం వేచి ఉంటుందని వెల్లడించారు. మరోవైపు, అమెరికా రాయబార కార్యాలయం నుంచి తమ సిబ్బందిని ప్రత్యేక హెలికాప్టర్‌లో తరలించింది. కాగా, తాలిబన్ల ప్రతినిధి ముల్లా అబ్దుల్‌ ఘనీ బరాదర్‌ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వానికి అఫ్గాన్‌ అధ్యక్షుడు అష్రఫ్‌ ఘనీ పాలన పగ్గాలను స్వచ్ఛందంగా అప్పగించారని ప్రచారం జరుగుతోంది. యుద్ధం ముగిసిందని, మా కొత్త పాలన ఏ రూపంలో ఉంటుందో ఆఫ్ఘన్ ప్రజలు త్వరలో నేర్చుకుంటారని తాలిబన్ అధికార ప్రతనిధి వ్యాఖ్యానించారు. ఇదిలాఉంటే, అధ్యక్షుడు అష్రఫ్‌ ఘనీ పదవి నుంచి తప్పుకొని దేశం విడిచి వెళ్లనున్నారని రెండు రోజుల ముందు నుంచే వార్తలు వస్తున్నాయి. ఇదే సమయంలో శనివారం జాతినుద్దేశించి ఓ వీడియో సందేశాన్ని ఆయన విడుదల చేశారు. అఫ్గాన్‌ ప్రజలపై యుద్ధం ప్రకటించడాన్ని తాను ఎన్నటికీ అంగీకరించబోనని... రెండు దశాబ్దాలుగా సాధించిన లక్ష్యాలను కోల్పోవడానికి సిద్ధంగా లేనని స్పష్టం చేశారు. అంతేకాకుండా ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేయడాన్నీ సహించనని అష్రఫ్‌ ఘనీ పేర్కొన్నారు. కానీ, ఊహించని వేగంతో తాలిబన్లు కాబూల్‌ను చేరుకోవడంతో తప్పని పరిస్థితుల్లో అధికారాన్ని వదిలి.. దేశాన్ని విడిచి వెళ్లిపోయినట్టు తెలుస్తోంది. వరల్డ్ ట్రేడ్ సెంటర్, పెంటగాన్‌పై 2001 సెప్టెంబరు 11న అల్ ఖైదా ఉగ్రవాదులు దాడి తర్వాత.. అఫ్గన్‌లో ప్రారంభించిన సుదీర్ఘ యుద్ధాన్ని ముగించాలని అమెరికా నిర్ణయించింది. ఈ నేపథ్యంలో అఫ్గన్‌లో అమెరికా సైన్యాలు పూర్తిగా వైదొలగుతున్నాయి. ఆగస్టు 31తో ఈ ప్రక్రియ పూర్తికానుంది. అమెరికా సైన్యం తరలిపోవడంతో తాలిబన్లు అధికారం హస్తగతం చేసుకున్నారు. కాబూల్ నగరం తాలిబన్ల వశం కావడంతో వందలాది మంది అఫ్గన్ ప్రజలు దేశం విడిచివెళ్లిపోతున్నారు. దేశం నుంచి పారిపోవాలని కోరుకుంటున్న వందలాది మంది విమానాల కోసం ఎదురు చూస్తున్నారు.. కొందరు లగేజీలను చీకటిలో రన్‌వేల మీదకు తీసుకొచ్చారు. విమానాలు నిలిపివేయడంతో అధికారులతో కొందరు గొడవపడ్డారని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. కాబూల్‌లో పలుచోట్ల పేలుళ్లు జరిగినట్టు స్థానిక మీడియా తెలిపింది. ఈ పేలుళ్లతో గాయపడిన క్షతగాత్రులను చికిత్స కోసం ఆస్పత్రికి తరలించినట్టు పేర్కొంది.


By August 16, 2021 at 07:03AM


Read More https://telugu.samayam.com/latest-news/international-news/afghanistan-taliban-terrorists-take-kabul-president-ashraf-ghani-ghani-flees-country/articleshow/85358271.cms

No comments