Breaking News

పంజ్‌షిర్‌‌లో ఉద్రిక్తత.. 300 మంది తాలిబన్లను మట్టుబెట్టిన మిలీషియా సైన్యం


అఫ్గనిస్థాన్‌లో పంజ్‌షీర్ తప్పా మొత్తం భూభాగం తాలిబన్ల వశమయ్యింది. ఈ నేపథ్యంలో ఆ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకునేందుకు తాలిబన్లు చేస్తున్న ప్రయత్నాలను అక్కడి మిలీషియా సైన్యం అడ్డుకుంటోంది. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకుంది. పంజ్‌షీర్‌ను ఆక్రమించుకోడానికి తాలిబన్‌లు చేసిన ప్రయత్నాలను తిప్పికొడుతున్నారు. తాజాగా, 300 మంది తాలిబన్లను మట్టుబెట్టినట్టు పంజ్‌షీర్ సైన్యం ప్రకటించిందని అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. పంజ్‌షీర్ లోయకు వెళ్లే మార్గాల్లో ఎక్కడికక్కడ దిగ్బంధించి, గట్టి పహరా నిర్వహిస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ తాలిబన్లకు లొంగిపోయే ప్రసక్తేలేదని పంజ్‌షీర్ ప్రజలు ఉద్ఘాటించారు. మరోవైపు, ఎలాగైనా పంజ్‌షీర్‌పై పట్టుసాధించాలని తాలిబన్లు కృతనిశ్చయంతో ఉన్నారు. పంజ్‌షీర్‌వైపు వందలాది వాహానాల్లో భారీ ఆయుధాలతో తాలిబన్లు కదులుతున్నారు. ఉత్తర అఫ్గనిస్థాన్‌లోని పంజ్‌షీర్ లోయలోకి ప్రవేశించడానికి దాదాపు మూడు దశాబ్దాలుగా తాలిబన్ల చేస్తున్న ప్రయత్నాలనీ విఫలమయ్యాయి. ప్రస్తుతం అక్కడ అఫ్గన్ ప్రభుత్వ మాజీ సైన్యం, మిలీషియా సంయుక్తంగా తాలిబన్లను ఎదుర్కొంటున్నాయి. పంజ్‌షీర్ లోయను హస్తం చేసుకోడానికి వందలాది మంది ఫైటర్ల కదులుతున్నట్టు ఆ సంస్థ ట్విట్టర్ ద్వారా వెల్లడించింది. అక్కడ స్థానిక అధికారులు శాంతియుతంగా అధికారం అప్పగించడానికి అంగీకరించకపోవడంతో భారీ ఆయుధాలతో వెళుతున్నట్టు తెలిపింది. అమెరికాలోని వరల్డ్ ట్రేడ్ సెంటర్, పెంటగాన్‌పై 2001 సెప్టెంబరు 11న దాడికి రెండు రోజుల ముందే పంజ్‌షీర్ యోధుడు, మిలీషియా నేత అహ్మద్ షా మసూద్‌ను అల్‌ఖైదా ఉగ్రవాదులు హత్యచేశారు. ప్రస్తుతం ఆయన తనయుడు అహ్మద్ మసూద్ 9,000 మంది సైన్యాన్ని సిద్ధం చేసి తాలిబన్లతో పోరాడుతున్నట్టు మిలీషియా సైన్యం అధికార ప్రతినిధి అలీ మైసమ్ నజర్ అన్నారు. మిలీషియా కొత్త విధానాలతో ప్రభుత్వ ఏర్పాటును కోరుకుంటోంది.. కానీ, అవసరమైతే పోరాటానికి కూడా సిద్ధంగా ఉందన్నారు. పలు అఫ్గన్ ప్రావిన్సుల నుంచి ప్రభుత్వ దళాలు పంజ్‌షీర్ లోయకు చేరినట్టు తెలిపారు. ‘గతంలో మాదిరిగా అనుసరించి విధానాలను కొనసాగిస్తే తాలిబన్ల ఎక్కువ కాలం ఉండరు.. మేము అఫ్గనిస్థాన్‌ను రక్షించడానికి సిద్ధంగా ఉన్నాం.. రక్తపాతానికి కూడా వెనుకాడబోమని హెచ్చరిస్తున్నాం’ అని నజర్ పేర్కొన్నారు. పంజిషిర్ లోయకు సమీపంలోని మూడు జిల్లాలను అఫ్గన్ ప్రభుత్వ సైన్యం, ఇతర మిలీషియా గ్రూప్‌లు సంయుక్తంగా స్వాధీనం చేసుకున్నట్టు ఆ దేశ రక్షణ మంత్రి జనరల్ బిస్మిల్లాహ్ మహ్మద్ ఆదివారం ట్విట్టర్‌లో తెలిపారు. పంజిషీర్‌కు ఉత్తరాన బఘలాన్ ప్రావిన్సుల్లోని దేహ్ సలేహ్, బనో, పల్-హేసర్ జిల్లాలలో తాలిబన్‌లను సంయుక్తంగా ప్రతిఘటించి అక్కడ నుంచి వెళ్లగొట్టాయని రక్షణ మంత్రి ట్వీట్ చేశారు.


By August 23, 2021 at 10:33AM


Read More https://telugu.samayam.com/latest-news/international-news/more-than-300-talibans-killed-by-militia-group-hundreds-headed-to-holdout-panjshir-valley/articleshow/85553829.cms

No comments