Breaking News

థర్డ్ వేవ్ అనివార్యం.. ప్రభుత్వాల తీరు బాధిస్తోంది.. IMA సంచలన ప్రకటన


థర్డ్ వేవ్‌ ముప్పు పొంచి ఉందని, ఎట్టి పరిస్థితుల్లో అలసత్వం పనికిరాదని ఇండియన్ మెడికల్ అసోసియేషన్() సోమవారం హెచ్చరించింది. కోవిడ్ ఆంక్షల సడలింపు విషయంలో ఉదాసీనంగా వ్యవహరించవద్దని పేర్కొంటూ ఈ మేరకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేస్తూ.. ఓ ప్రకటన విడుదల చేసింది. ఈ క్లిష్ట సమయంలో ప్రజలు, అధికార యంత్రాంగం తీరు తీవ్రంగా బాధిస్తోందని వ్యాఖ్యానించింది. ఆధ్యాత్మిక, పర్యాటక యాత్రలను కొన్నాళ్లు వాయిదా వేసుకోవడం మంచిదని సూచించింది. ‘ప్రపంచవ్యాప్తంగా అందుబాటులో ఉన్న ఆధారాలను బట్టి మహమ్మారుల చరిత్రను గమనిస్తే అనివార్యం.. ప్రజలు ఏ మాత్రం కోవిడ్ నిబంధనలు పాటించకుండా.. గుంపులు గుంపులుగా చేరడం తీవ్రంగా బాధిస్తోంది. ప్రభుత్వాలు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నాయి.. ఆధ్యాత్మిక, పర్యాటక యాత్రలు అవసరమే. కానీ, మరికొద్ది నెలలు వేచి ఉందాం. కోవిడ్ టీకాలు వేసుకోకుండా ఒకచోట చేరుతున్న జన సమూహాలు.. మూడో దశ విజృంభణకు సూపర్‌ స్ప్రెడర్లుగా మారే అవకాశం ఉంది’ అని ఐఎంఏ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఏడాదిన్నర కాలంగా ఉన్న అనుభవాలను పరిశీలిస్తే.. పెద్ద సంఖ్యలో టీకాల పంపిణీ, కొవిడ్ నిబంధనలను పాటించడం ద్వారా థర్డ్ వేవ్ ముప్పు ప్రభావాన్ని తగ్గించగలమని పేర్కొంది. మరో రెండు మూడు నెలలు జాగ్రత్తగా ఉండాలని సూచించింది. అలాగే రెండో దశ వ్యాప్తి సమయంలో వైద్య సిబ్బంది అందించిన సేవలకు ఐఎంఏ కృతజ్ఞతలు తెలియజేసింది. కోవిడ్ బాధితులకు చికిత్స పరిణామాలు, ఆర్థిక వ్యవస్థపై దాని ప్రభావం వంటి పరిగణనలోకి తీసుకుంటే సామూహిక సమావేశాలను నిలిపివేయడ ద్వారా కలిగే ఆర్థిక నష్టం కంటే ఎక్కువగా ఉంటుందని పేర్కొంది. దేశంలో కోవిడ్ మూడో దశ సంసిద్ధత గురించి ఐఎంఏ అధ్యక్షుడు జాన్‌రోజ్ ఆస్టిన్ జయలాల్ ఓ వీడియా సందేశాన్ని విడుదల చేశారు. మహమ్మారికి వ్యతిరేకంగా జరుగుతున్న యుద్ధంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దూరదృష్టిని అనుసరించి, సామూహిక సమావేశాలను నియంత్రించడానికి అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలి అని సూచించారు. ‘ప్రస్తుతం కీలక దశలో ఉన్నాం.. వచ్చే రెండు మూడు నెలలు మరింత అప్రమత్తంగా ఉండాలి.. సామూహిక వ్యాప్తికి ఎటువంటి అవకాశం ఇవ్వొద్దు’ అని పేర్కొన్నారు. ఇటీవల పలుచోట్ల పర్యాటక ప్రాంతాల్లో ప్రజలు భారీగా గుమిగూడిన దృశ్యాలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. కోవిడ్ నిబంధనలను గాలికొదిలేసి భయం లేకుండా భారీగా ఎగబడ్డారు. ఈ ఘటనలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం కాగా.. ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర ఆరోగ్య శాఖ స్పందించింది. థర్డ్ వేవ్‌కు అవకాశం ఇవ్వొద్దని అభ్యర్థించింది. ఈ నేపథ్యంలో ఐఎంఏ ప్రకటన విడుదల కావడం గమనార్హం. మరోవైపు, థర్డ్ వేవ్ హెచ్చరికలు, నివేదికల నేపథ్యంలో అందుకు తగ్గట్టుగా కేంద్ర ఆరోగ్య శాఖ సిద్ధమవుతోంది. రెండో దశలో ఎదురైన అనుభవాలను పునరావృతం కాకుండా చూస్తామని కేంద్రం ఆరోగ్య శాఖ నూతన మంత్రి మన్‌సుఖ్ మాండవీయ తెలిపారు. ఇప్పటికే అత్యవసర ప్రతిస్పందన నిధుల కిందట కేంద్ర కేబినెట్‌ రూ. 23వేల కోట్ల ఆర్థిక ప్యాకేజీని ఆమోదించిందని అన్నారు. చిన్నారుల కోసం ప్రత్యేక వార్డులు ఏర్పాటు చేస్తున్నట్టు పేర్కొన్నారు. ఏదైనా అత్యవసర పరిస్థితి ఎదురైతే సరైన సమయంలో స్పందించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వద్ద బఫర్ స్టాక్‌ సిద్ధంగా ఉండేలా చూస్తున్నామని చెప్పారు.


By July 13, 2021 at 07:45AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/indian-medical-association-warns-third-wave-and-says-tourism-pilgrimage-can-wait/articleshow/84365269.cms

No comments